ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : ఆ నలుగురి విచారణ నేడే

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : ఆ నలుగురి విచారణ నేడే

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కంటిన్యూ అవుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీఏ కన్వీనర్ తుషార్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుస్వామి, అడ్వకేట్ శ్రీనివాస్ లకు సిట్ నోటీసులు పంపింది. ఇవాళ విచారణకు హాజరుకావాలని తెలిపింది. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విచారణ జరగనుంది. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో సిట్ తెలిపింది. అయితే విచారణకు ఎవరెవరు వస్తారనేది సస్పెన్స్ గా మారింది. 

 హైకోర్టుకు బీజేపీ .. అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు

ఫాంహౌస్ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని, దీనిని అడ్డుకోవాలంటూ శుక్రవారం (నవంబరు 18న) హైకోర్టును బీజేపీ  ఆశ్రయించింది. కుట్రలో భాగంగానే ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇచ్చారని ఆరోపించింది. హైకోర్టు సింగిల్ జడ్జి పర్మిషన్ తీసుకోకుండానే సిట్ నోటీసులు ఇస్తోందని ఈ మేరకు బీజేపీ రాష్ట్ర జనరల్‌‌ సెక్రటరీ జి.ప్రేమేందర్‌‌రెడ్డి రిట్‌‌ పిటిషన్ లో పేర్కొన్నారు. నిందితుల వివరాలు, ఇతర సమాచారం సీక్రెట్ గా ఉంచాలని హైకోర్టు ఆదేశించినా.. ఈ నెల 17న పలువురికి నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయన్నారు.

ఎవిడెన్స్‌‌ లేకపోయినా నిందితులతో బీజేపీ లీడర్ల పేర్లను చెప్పించి కేసులో ఇరికించేందుకు సిట్ కుట్ర చేస్తోందన్నారు. మొబైల్, ల్యాప్‌‌టాప్, ఇతర డివైజ్‌‌లను తీసుకురావాలని, డేటాను డిలీట్‌‌ చేయకూడదని నోటీసులో పేర్కొన్నారని వివరించారు. బీఎల్ సంతోష్, లాయర్ శ్రీనివాస్ కు నోటీసుల్లో ఒకే సెల్ నెంబర్ పెట్టారన్నారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వాళ్లను వేధించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. వాళ్లను ఇబ్బందులకు గురిచేసే అవకాశాలూ ఉన్నాయన్నారు. సిట్‌‌ నోటీసులపై స్టే ఇవ్వాలని, ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరారు.

న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు

బీజేపీ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అయితే బీఎల్ సంతోష్ కు నోటీసులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని సూచించింది. అదే సమయంలో సిట్ దర్యాప్తునకు బీఎల్ సంతోష్ సహకరించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మంగళవారాని(నవంబరు 22)కి వాయిదా వేసింది.