విశాఖ స్టీల్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి.. అసలేం జరిగిందంటే..

విశాఖ స్టీల్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి.. అసలేం జరిగిందంటే..
  • 9 మంది మృతి, ఇద్దరి పరిస్థితి విషమం, పలువురికి తీవ్ర గాయాలు
  • క్రేన్ ల్యాడెల్ కూలి.. కింద పడ్డ లిక్విడ్ ఐరన్
  • నిర్వహణ లోపాల వల్లే ప్రమాదమంటున్న కార్మికులు
  • విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు

హైదరాబాద్, వెలుగు: విశాఖ స్టీల్ ప్లాంట్​లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌‌‌‌‌‌‌‌లోని అత్యంత కీలకమైన స్టీల్ మెల్టింగ్ షాప్-1 (ఎస్ఎంఎస్ 1) విభాగంలో ఇది చోటుచేసుకుంది. సుమారు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన లిక్విడ్ ఐరన్ ను తరలిస్తున్న క్రేన్ ల్యాడెల్ ఒక్కసారిగా తెగి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. 

వందల టన్నుల లిక్విడ్ ఐరన్  నేలపై ఒలికిపోవడంతో ప్లాంట్ ప్రాంగణం క్షణాల్లో అగ్ని గుండంలా మారింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు మృతిచెందారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి హాస్పిటల్​లో చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే తోటి సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమించి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. దట్టమైన పొగ వల్ల కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ప్రమాద స్థలంలో ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అనే కోణంలో రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్టీల్‌‌ప్లాంట్‌‌కు చెందిన డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు
ఎస్ఎంఎస్-1 విభాగంలోని సీసీడీ భాగంలో లిక్విడ్ ఉక్కును తరలిస్తున్న సమయంలో ల్యాడెల్ మెకానిజంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హాట్ మెటల్ బకెట్లు నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో కిందపడ్డాయి. లిక్విడ్ ఉక్కు వేడికి అక్కడ ఉన్న ఒక భారీ క్రేన్ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. అలాగే ప్లాంట్ లోపల ఉన్న విద్యుత్ కేబుళ్లు, పవర్ లైన్లు, సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా ఆకాశాన్నంటిన మంటలు, దట్టమైన పొగతో భయానక వాతావరణం నెలకొంది.

ప్లాంట్‌‌లో సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచు జరుగుతున్నాయని, కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువైందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు 2లక్షల పరిహారం
వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మృతులకు రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేలు పరిహారం అందించనున్నట్లు సోమవారం ట్వీట్ లో తెలిపారు. 

ప్రమాదంపై సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి కుమార స్వామి తెలిపారు. పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులతో చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం  చేశారు. ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి వైద్య సాయం అందించాలని, కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.