ఫర్టిలైజర్ షాప్ పర్మిషన్ కోసం లక్ష లంచం డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా దొరికిన మండల వ్యవసాయాధికారి

ఫర్టిలైజర్ షాప్ పర్మిషన్ కోసం లక్ష లంచం డిమాండ్.. ఏసీబీకి అడ్డంగా దొరికిన మండల వ్యవసాయాధికారి

తెలంగాణలో ప్రభుత్వ అధికారుల తీరు  మారడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఎన్ని రైడ్లు చేస్తున్నా.. ఎంత మందిని పట్టుకుంటున్నా లంచాలు తీసుకుంటూనే ఉన్నారు.  సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లేటెస్ట్ గా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి జయశంకర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు. 

ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం రూ . లక్ష డిమాండ్ చేశారు వ్యవసాయ అధికారి జయశంకర్. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.  పక్కా ప్లాన్ తో బాధితుడి నుంచి  రూ.50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.వ్యవసాయ శాఖ అధికారిని అదుపులోకి తీసుకుంది. 

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ,  ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులకు ఏసీబీ చుక్కలు చూపిస్తున్నది. అవినీతి నిరోధక చట్టం కింద  2  నెలల నుంచి 3 నెలల పాటు జైల్లోనే ఉంచుతున్నది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో వందల కోట్లు విలువ చేసే అక్రమాస్తులను స్వాధీనం చేసుకుంటున్నది. అవినీతితో సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తున్నది.  ఈ ఏడాది 8  నెలల్లోనే మొత్తం 162 కేసులను నమోదు చేయగా.. ప్రైవేట్ వ్యక్తులుసహా దాదాపు180 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇందులో 22 మంది గత మూడు నెలలుగా జైల్లోనే ఉన్నారు.