ఇవాళ సూపర్ బ్లూమూన్.. రక్షా బంధన్ రోజు ఆకాశంలో కనువిందుగా జాబిల్లి

ఇవాళ సూపర్  బ్లూమూన్.. రక్షా బంధన్ రోజు ఆకాశంలో కనువిందుగా జాబిల్లి


హైదరాబాద్, వెలుగు: రాఖీ పండుగ రోజు ఆకాశంలో చందమామ కనువిందు చేయనున్నాడు. ఈ ఏడాది మొదటి సూపర్ మూన్ సోమవారం రాత్రి కనిపించనుంది. సూపర్ మూన్ బ్లూమూన్ గా జాబిల్లి అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనువిందు చేయనుందని సైంటిస్టులు వెల్లడించారు. మన దేశంలో సూపర్ మూన్ బ్లూమూన్ సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 5.32 వరకూ కనిపిస్తుందని తెలిపారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆయా కాలమానాల ప్రకారం సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు సూపర్ మూన్ బ్లూమూన్ కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. కాగా, ఈ ఏడాది నాలుగు సూపర్ మూన్ లు ఏర్పడనుండగా, ఆగస్టు 19న ఏర్పడేది మొదటిది. మిగతా మూడు సూపర్ మూన్ లు సెప్టెంబర్ 18న, అక్టోబర్ 17న, నవంబర్ 15న ఏర్పడనున్నాయి.  

సూపర్ మూన్ బ్లూమూన్ అంటే? 

చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు అత్యంత దగ్గరగా వచ్చిన సమయంలో ఎక్కువ వెలుతురుతో, పెద్దగా కనిపించే పున్నమి చంద్రుడినే సూపర్ మూన్ అంటారు. సూపర్ మూన్ లు ఏడాదికి మూడు నాలుగు సార్లు ఏర్పడుతుంటాయి. ఇక బ్లూమూన్ అంటే నిజానికి నీలం రంగులో ఉండే చంద్రుడని అర్థం కాదు. బ్లూమూన్ లు రెండు రకాలుగా ఉంటాయి. ఒక సీజన్ లో నాలుగు ఫుల్ మూన్ లు ఉంటే.. అందులో మూడో ఫుల్ మూన్ ను సీజనల్ బ్లూమూన్ గా పిలుస్తారు. ఇక ఏదైనా ఒక నెలలో రెండోసారి వచ్చే ఫుల్ మూన్ ను మంత్లీ బ్లూమూన్ అని అంటారు. అయితే, ఆయా కాలాల్లో వాతావరణంలో దుమ్ము ధూళిని బట్టి.. కొన్నిసార్లు చంద్రుడు నీలం రంగులో కనిపిస్తుంటాడు. అంతేతప్ప నిజానికి చంద్రుడు నీలం రంగులోకి మారిపోయి బ్లూమూన్ లా ఏర్పడటం అంటూ ఉండదు. అయితే, సోమవారం వచ్చే పున్నమి చంద్రుడు అటు సూపర్ మూన్, ఇటు బ్లూమూన్ కూడా కావడంతో దీనిని సూపర్ బ్లూమూన్ అంటున్నారు. అలాగే ఆగస్టు నెలలో వచ్చే ఫుల్ మూన్ ను స్టర్జియన్ మూన్ అని కూడా అంటారు. అందుకే ఈ సూపర్ మూన్ బ్లూమూన్ ను స్టర్జియన్ మూన్ అని కూడా పిలుస్తారు.