తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం 

తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం 

శాయంపేట/మొగుళ్లపల్లి, వెలుగు: ‘మీ ఊర్ల మొగోళ్ల సంఖ్య తక్కువనే..అయినా తాగిన ఖాళీ బ్రాండీసీసాలు అమ్మితే వచ్చిన రూ.1500 గ్రామాభివృద్ధికి ఉపయోగపడ్డయ్...’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వ్యాఖ్యానించారు. ఆదివారం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి, హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకల్లో పర్యటించారు. వేములపల్లిలో ఆయన రూ.22 లక్షలతో కట్టిన రైతు వేదికను ప్రారంభించారు. తర్వాత జడ్పీ హైస్కూల్​లో నిర్వహించిన సభలో మాట్లాడారు. అధికారులతో ‘సీసాలు అమ్మిన్రా..ఎన్నమ్రిన్రు..ఎన్ని పైసలొచ్చినయ్​’ అని అడిగారు రూ.1500 అని చెప్పడంతో గ్రామస్తులతో ‘మీ ఊర్లె మొగోళ్లు తాగి పడేసిన సీసాలున్నయ్. గుర్తున్నయా? ఆ సీసాలన్నీ అమ్మినమ్​. రూ.1500 వచ్చినయ్.​ ఎన్ని సీసాలమ్మిర్రో తెల్తె మీ ఊరోళ్లు తక్కువ తాగుతున్నరా? ఎక్కువ తాగుతున్నరా? తెల్తది. ఇది వరకు తాగిన సీసాలు ఎక్కడ పడితే అక్కడ పడేసేది. దీంతో అన్ని ఊళ్లలో ముఖ్యమంత్రి ఆ సీసాలన్ని జమ చేసి డంపింగ్​యార్డు ఏర్పాటు చేసి అమ్మే ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని తెస్తున్తడు. ఇది మంచిదేనా కాదా. గట్టిగ సప్పట్లు కొట్టాలె ఆడోళ్లు’ అని అనడంతో చప్పట్లు కొట్టారు. ‘మొగుళ్లపల్లి,చిట్యాల, టేకుమట్ల మండలాల్లో తాగునీళ్ల కోసం ప్రజలకు ఇబ్బంది రావద్దు.  నేను నెల రోజుల్లో వస్తా. నీళ్ల గురించి ఎవరైనా కంప్లయింట్ ​చేస్తే మీ సంగతి చెప్తా’ అని ఆర్​డబ్ల్యూఎస్​ ఆఫీసర్లను హెచ్చరించారు. తాను ఈ రోజు వస్తున్నానని పనికి రాని మొక్కలు పెట్టారని, అక్కరకు వచ్చే మొక్కలు పెట్టాలన్నారు. వాటికి ట్రీ గార్డ్స్​కాకుండా సర్కారు తుమ్మ కొమ్మలు నరికి చుట్టూ పెట్టాలన్నారు. మంత్రి సంక్షేమ పథకాల గురించి చెబుతున్న క్రమంలో ఓ మహిళ లేచి ‘మాకు పథకాలేం వస్తలేవు సారూ’ అని చెబుతుండగా ఆయన జోక్యం చేసుకున్నారు. ‘మధ్యలో మాట్లాడెటోళ్లందరూ చెడగొట్టెటోళ్లే.. చీడపురుగు లాంటోడు ఊరికొక్కడుంటరు. అలాంటి వాళ్లను పంటలో కలుపు మొక్కను పీకేసినట్లుగా తీసెయ్యాలె’ అని అన్నారు. గ్రామంలో కొత్తగా కడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పనులు పూర్తి కాకపోవడంతో ఎమ్మార్పీఎస్, ఇండ్ల లబ్ధిదారులు మంత్రిని అడిగే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని మీటింగ్ నుంచి బయటకు పంపించారు. అంతకుముందు హనుమకొండ జిల్లాలోని పత్తిపాకలోని గవర్నమెంట్‌‌ స్కూల్‌‌లో మన ఊరు‒మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.22 లక్షలతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. తర్వాత నిర్వహించిన సభలో  మాట్లాడుతూ 'సెక్రటరీ గారూ..ఈ ఊళ్లో బ్రాండి సీసాలు ఎన్ని దొరికినయ్‌‌..మొగోళ్లు తాగిన సీసాలు అమ్మితే ఎంతొచ్చింది? ఆ..2500 వచ్చినయా..పత్తిపాకలో తాగెటోళ్ల సంఖ్య ఎక్కువనే..రూ.2500 అంటే నయమే కదా' అని అన్నారు. ‘ఊళ్లో తిరిగినప్పుడు కొందరు మంచినీళ్లు వస్తలేవని, శ్మశానవాటికలో కూడా నీళ్లు ఇస్తలేరని అన్నరు. వారం రోజుల్లో ఊరంతా నీళ్లివ్వకపోతే నౌకర్లు ఉండవు’ అని మిషన్‌‌ భగీరథ ఇంజినీర్లను హెచ్చరించారు. మీటింగ్​తర్వాత ఈజీఎస్‌‌ బిల్లులు చాలా రోజులుగా రావడం లేదని ఉపాధి కూలీలు జడ్పీ చైర్​పర్సన్ ​గండ్ర జ్యోతిని నిలదీశారు. ఆయా కార్యక్రమాల్లో భూపాలపల్లి కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్​పర్సన్​గండ్ర జ్యోతి, అడిషనల్ కలెక్టర్ దివాకర్, పత్తిపాకలో డీఆర్‌‌డీఓ రాజారావు, డీపీఓ జగదీశ్వర్‌‌, మిషన్‌‌ భగీరథ ఈఈ వెంకటరమణారెడ్డి, డీఈ చంద్రు నాయక్‌ పాల్గొన్నారు.