
సాధారణంగా రిటైర్‌మెంట్ అంటే 60 ఏండ్లు. కానీ, ‘మనీ విటమిన్’ పుస్తక రచయిత 40ఏండ్లకే రిటైర్మెంట్ తీసుకున్నాడు. తానే కాదు.. మిగతావాళ్లకు కూడా రిటైర్మెంట్ ఏజ్ అంతే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెబుతాడు. దానికి కారణాలు, రెమెడీలు కూడా అందిస్తాడు రచయిత. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే సమస్య. కానీ, డబ్బును ఎలా సంపాదించాలి? ఎలా సంరక్షించాలి? ఎలా పెట్టుబడి పెట్టాలి? అనే విషయాలపై సరైన దిశానిర్దేశం లేకపోతే, కావాల్సినంత డబ్బు సంపాదిస్తున్నా అంతకంటే పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే, మనీకి కూడా ఒక “విటమిన్” అవసరం. అదే పేరు మీద వచ్చిన పుస్తకం ‘మనీ విటమిన్’. ఆర్థికంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక బేసిక్ కోర్స్ లాంటిది ఈ పుస్తకం.
రచయిత ‘‘శ్రీనివాస్ చీకటి’’ ఈ పుస్తకంలో డబ్బు గురించి మాట్లాడలేదు. ‘‘డబ్బును చూడటానికి సరికొత్త కళ్లజోడు’’ అందించారు. ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే డైలీ మనీ డైలమాలను సులువైన వాడుక భాషలో అర్థవంతంగా వివరించారు.ఈ పుస్తకంలోని ప్రతీ అధ్యాయం ఓ జీవితం నేర్పిన పాఠంలా ఉంటుంది. అనేక ఫైనాన్షియల్ థీమ్స్‌ను సింపుల్‌గా డికోడ్ చేశారు. ఫలితంగా ‘‘మనీ విటమిన్’’ను ప్రేరణాత్మక వాహకంగా మార్చేశారు. ఈ పుస్తకం చదవడమంటే.. డబ్బు సంపాదన మాత్రమే కాదు.. ధనవంతుల మైండ్‌సెట్ అలవర్చు కోవడమే.. అని చెప్పొచ్చు.
భారతదేశంలోని కొన్ని సంపన్న వర్గాల ఆర్థిక సంస్కృతిపై విలక్షణమైన రీతిలో విశ్లేషణ చేశారు. మార్వాడీలు, గుజరాతీలు, ఆర్యవైశ్యులు వంటి వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించిన ప్రత్యేక వర్గాల ఆర్థిక నైపుణ్యాలపై ఇచ్చిన వాస్తవ ఉదాహరణలు.. పాఠకులలో ఆర్థిక ఆలోచన శైలిని ప్రభావితం చేస్తాయి. ఒక గ్రామంలో చిన్నగా మొదలైన షాపు ఎలా బ్రాండ్ అవుతుందో... ఒక చిన్న పెట్టుబడి ఎలా వ్యాపార సామ్రాజ్యంగా విస్తరిస్తుందో.. ప్రాక్టికల్‌గా విశ్లేషించారు రచయిత.
ఈ పుస్తకంలో రచయిత తన స్వీయ అనుభవాల నుంచి గ్రహించిన జీవిత పాఠాలను వివరించారు. ఉద్యోగం చేసిన సమయంలో తాను చేసిన పొరపాట్లు.. సంకుచితంగా చేసిన ఆలోచనలను విశ్లేషించారు. ఫలితంగా ఆర్థిక జ్ఞానోదయం పొంది.. 40 ఏళ్లకే రిటైరయ్యే స్థాయికి ఎలా చేరుకున్నారన్న విషయాలు ప్రధానంగా యువతీ యువకులను ఆలోచింపజేస్తాయి. మధ్య వయస్కులను కూడా ఆత్మ విమర్శ చేసుకునేందుకు ప్రేరేపిస్తాయి.ఎంత సంపాదించినా సరే.. తమ డబ్బును సక్రమంగా నిర్వహించేందుకు ప్రాథమిక విజ్ఞానాన్ని అందిస్తుంది 'మనీ విటమిన్'. ఇది చదివాక మీరు స్మార్ట్‌గా ఆలోచించడం ప్రారంభిస్తారు. అందుకే ఇది పుస్తకం కాదు.. ఓ ఆర్థిక మార్గదర్శి. సప్తగిరి