బాల రాముడ్ని చూసేందుకు స్వయంగా హనుమంతుడే వచ్చినట్లుంది

బాల రాముడ్ని  చూసేందుకు స్వయంగా హనుమంతుడే వచ్చినట్లుంది

అయోధ్యలో 2024 జనవరి 23  మంగళవారం రోజున ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.  సాయంత్రం 05 గంటల ప్రాంతంలో  ఆలయ గర్భగుడిలోకి కోతి ప్రవేశించి రాముడి ఉత్సవ విగ్రహం దగ్గరకు వెళ్లింది.   హనుమంతుడు స్వయంగా రామ్‌లల్లాకు ప్రార్థనలు చేసేందుకు వచ్చినట్లు అనిపిస్తోందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్వీట్ చేసింది.  దక్షిణ ద్వారం గుండా లోపలికి వచ్చిన కోతి..ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్లింది. కోతిని పట్టుకునేందుకు ఆలయ భద్రతా సిబ్బంది ప్రయత్నం చేసినప్పటికీ వారికి ఎలాంటి హాని చేయకుండా కోతి వెళ్లిపోయిందని తెలిపింది.  హనుమాన్ జీ స్వయంగా రామ్‌లల్లాను చూడటానికి వచ్చినట్లుగా ఉందని వెల్లడించింది.  

5 లక్షల మంది భక్తులు దర్శనం 

అయోధ్య రామయ్య దర్శనానికి తొలిరోజు భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించిన నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచే జనం తరలివచ్చారు. చాలా మంది మెయిన్ గేట్ వద్ద రాత్రంతా పడిగాపులు కాశారు. ‘భక్తులతో ఆలయ ప్రధాన రోడ్డు మార్గమైన ‘రామ్‌‌ పథ్’ నిండిపోయింది. ఉదయం 6 గంటల నుంచి భక్తులను టెంపుల్ కాంప్లెక్స్‌‌ లోపలికి అనుమతించాం. మధ్యాహ్నం 2 గంటల కల్లా స్వామి వారిని 2.5 లక్షల మంది దర్శించుకున్నారు’ అని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ చెప్పారు.  తొలి రోజు మొత్తంగా 5 లక్షల మంది దర్శించుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. కాగా, ఆలయంలో లోపలికి వెళ్లేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు భక్తులు తన్మయత్వంతో జైశ్రీరామ్ నినాదాలు చేశారు.