
మద్దూరు, వెలుగు: మద్దూరు పట్టణంలో ఇటీవల కోతుల బెడద ఎక్కువైంది. అడవుల్లో పండ్లు, ఆహారం దొరుకుతున్నా ప్రజలపై దాడులు చేస్తున్నాయి. బుధవారం పట్టణానికి చెందిన బైరం దస్తప్ప(30) రేషన్ దుకాణానికి వెళ్తుండగా, అతడిపై కోతి దాడి చేయడంతో భుజం, అర చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు పట్టణానికి చెందిన చాకలి వెంకటమ్మపై దాడి చేసి గాయపరిచాయి.
వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, మెరుగైన వైద్యం కోసం నారాయణ పేట జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ నెల 2న పట్టణానికి చెందిన ఓ బాలుడిపై దాడి చేయగా, అతడిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇలా రెండు రోజుల వ్యవధిలో ముగ్గురిపై కోతులు దాడి చేయడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఆఫీసర్లు స్పందించి కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.