తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మూడు రకాలైన కోతులున్నాయి. బెనెట్ కోతి, రిసస్ కోతి, లంగూర్ (కొండేంగ). రాష్ట్రంలో పెద్ద ఎత్తున కోతుల పెరుగుదలతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. కొండేంగల కోతులు అంతగా లేవు. ఇతర కోతులు కొండేంగలకు భయపడి పారిపోతాయని ఒక నమ్మకం. అయితే అది కోతుల గుంపు పెద్దగా ఉన్నప్పుడు ఏమీ చేయదు. చాలా గ్రామాలలో కొండేంగలను సుదూర ప్రాంతాల నుంచి తెచ్చి కోతుల మందలను పారదోలే ప్రయత్నం చేసినా అది అంతగా ఫలించడం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయం పేరుతో పెద్ద ఎత్తున అడవులు ఆక్రమించి, నరకడంతో కోతులకు ఇతర వన్యప్రాణులకు ఆవాసయోగ్యాలు తగ్గిపోయాయి. దీంతో అవి గ్రామాలపై పడి పంట చేనులకు నష్టం కలిగించడం మొదలైంది.
రానురాను కోతులు ఇండ్లల్లోకి చొరబడి తినుబండారాలను తీసుకుపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో అడ్డగించిన వారిని గాయాలు చేస్తున్నాయి. కొన్ని గ్రామాలలో అయితే పిల్లలు, వృద్ధులు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇక పంటల సంగతి చూస్తే కూరగాయలు, వేరుశెనగ, మొక్కజొన్న, ఇతర పండ్ల తోటలపై కోతుల ప్రభావం ఎక్కువగా ఉంది.
భారీగా పెరుగుతున్న కోతుల సంఖ్య
కోతుల బాధతో పల్లెల్లో కూరగాయలు పండించడం తగ్గింది. ఇక ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. పేదలు కట్టుకున్న గుడిసెలు, కూనపెంకుల ఇండ్లను కోతులు పీకి పాకాన పెడుతున్నాయి. గ్రామాలలో కోతులు నష్టం చేయని పంటలవైపు ముఖ్యంగా వరి వైపు మొగ్గు చూపుతున్నారు. హిందువులు కోతిని ఆంజనేయ రూపంగా చూస్తూ కోతులను చంపరు. దీంతో కోతుల సంఖ్య నానాటికీ పెరుగుతూ తీవ్ర సమస్యగా తయారైనాయి. గ్రామీణ ప్రాంతాలనేకాక పట్టణాల్లో కూడా కోతుల బెడద ఉంది. కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కోతులను పట్టుకుని స్టెరిలైజ్ చేసి కేజ్‌లలో ఉంచుతున్నారు. ఈవిధంగా కొంతవరకు కోతుల బెడద తగ్గించినారు.
కుక్కల మాదిరిగా కోతులు ప్రివెన్షన్ఆఫ్ క్రుయాలిటి టు యానిమల్స్ చట్టం 1960 కిందికి వస్తాయి. కుక్కలను పట్టుకొని స్టెరిలైజ్ చేసి ఎక్కడ పట్టుకున్నారో అదే ప్రాంతంలో వదిలివేయాలని చట్టం చెపుతోంది. అయితే, కోతుల విషయంలో ఈ పద్ధతితో ఫలితముండదు. కోతులను పట్టుకొని సమీప అడవిలో వదిలనా అవి మళ్లీ గ్రామంవైపే వస్తాయి. ఇది సమస్యకు పరిష్కారం కాదు. అదీకాక అడవిలో కోతుల పొట్ట నిండాలంటే రోజుకు 18 గంటలు ఆహారం కోసం చెట్టు చెట్టుకు వెదకాలి. అదే పంట పొలాలలో, గ్రామంలో కాని ఒక గంటలో కడుపు నిండుతుంది. అక్కడనే చెట్లపై విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ పరిస్థితిని గమనించి చాలా గ్రామాలలో చెట్లు నరికి వేసినా సమస్మ పరిష్కారం కాలేదు.
రీహాబిలిటేషన్ సెంటర్లలో ఉంచాలి
ఎన్నికలలో గ్రామ ప్రాంత ప్రజలు తమకు కావలసిన సేవలు.. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజి, చెరువుల మరమ్మతు, వీధిదీపాలు వంటివి సమస్యలు ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల ముందు ఉంచుతారు. కానీ, కోతుల సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. ఇప్పుడు గ్రామప్రజలు కోతుల బెడద తీర్చినవారికి తమ ఓటు వేస్తామంటున్నారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలలో కోతుల బెడద ఒక ప్రధాన ఎన్నికల సమస్యగా తయారైంది. కోతుల బెడద తగ్గాలంటే కోతులను పట్టుకొని స్టెరిలైజ్ చేసి కోతులను రీహాబిలిటేషన్ సెంటర్లలో ఉంచాలి.
మొదటగా కోతుల బెడద ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి అటువంటి మండలాల్లో కోతుల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అక్కడ కోతులకు వైద్యశాల, మందులు, పశువుల డాక్టర్లను ఏర్పాటు చేయాలి. అలాగే పునరావాస కేంద్రంలో స్టెరిలైజ్ చేయడానికి తగిన వసతులు ఉండాలి. గ్రామాలలో పట్టుకున్న కోతులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఒక వాహనముండాలి. ఒక్కో పునరావాస కేంద్రంలో 300 నుంచి 500 కోతుల వరకు కేజ్‌లలో ఉంచి వాటికి తగిన ఆహారం అందించాలి. ఈవిధంగా మూడు నాలుగు సంవత్సరాల్లో చాలావరకు కోతుల బెడద తగ్గించవచ్చు.
ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి
కోతులు వన్యప్రాణులు జాబితాలో లేకపోవడంతో అటవీశాఖ వారు కోతుల సమస్య మాది కాదు అంటున్నారు. అలాగే పంచాయతీ శాఖ, వ్యవసాయశాఖ ఎవరికివారు తమకు సంబంధం లేదని చేతులు
దులుపుకుంటున్నారు. ఈ విషయం గురించి పార్లమెంటులో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కోతుల వలన తెలంగాణ రాష్ట్రంలో కలుగుతున్న పంట నష్టాన్ని, ప్రజలకు కలుగుతున్న హాని తెలుపుతూ అసలు కోతుల సమస్య ఏ శాఖదని కేంద్రాన్ని అడగడం జరిగింది.
ఆయన తన నియోజకవర్గంలో సొంతఖర్చుతో కోతులను పట్టడం, వ్యానుల ద్వారా రవాణా చేసి దూరప్రాంతాలలో వదిలివేయడం జరుగుతుంది. ఇది స్వాగతించవలసినదే. అయితే, ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే కోతులను వదిలిన ప్రాంతంలోని గ్రామాలలో సమస్య మొదలవుతుంది. కోతులు రకరకాలైన బాక్టీరియా కలిగి ఉంటాయి. అలాగే కుక్కకాటు వలె కోతి గాయాలతో ప్రజలు రాబిస్ వంటి రోగాల పాలవుతారు.
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో కోతుల సమస్య నివారణకు వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, పశుసంవర్ధక శాఖ, అటవీశాఖల అధికారులతో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి దానికి తగిన నిధులు సమకూర్చి కోతుల దాడి నుంచి ప్రజలను, పంటలను రక్షించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతుంది.
యం. పద్మనాభరెడ్డి, అధ్యక్షుడు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

