చల్లని కబురు.. రుతు పవనాలు వచ్చేస్తున్నాయ్

చల్లని కబురు.. రుతు పవనాలు వచ్చేస్తున్నాయ్

నైరుతి రుతు పవనాలు వచ్చేస్తున్నాయి.. ఇప్పటికే అండమాన్ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతు పవనాలు.. జూన్ 4వ తేదీ నాటికి కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి రావటానికి సమయం పడుతుందని స్పష్టం చేసింది. జూన్ ఒకటో తేదీ మధ్యాహ్నం విడుదల చేసిన వాతావరణ శాఖ రిపోర్ట్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది.

కేరళను జూన్ 4వ తేదీ నాటికి ప్రవేశిస్తుండగా.. జూన్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది.. జూన్ 12వ తేదీ నాటికి ఏపీ అంతటా విస్తరిస్తాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ.

ఇక నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి జూన్ 10 నుంచి 12వ తేదీ మధ్య ప్రవేశిస్తాయని వెల్లడించింది. వాతావరణం అనుకూలిస్తే.. జూన్ 16వ తేదీనాటికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. 

మండే ఎండల్లో చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. మొదటగా అంచనా వేసినట్లు.. జూన్ ఒకటో తేదీన కేరళలోకి నైరుతి రుతు పవనాలు రావాల్సి ఉంది. అయితే సముద్రంలో ఏర్పడిన తుఫాన్లు, వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల.. నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 4వ తేదీన నైరుతి దేశంలోకి వస్తుంది. కేరళ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి రావటానికి రెండు వారాల సమయం తీసుకుంటుంది. 

మండే ఎండలు మరికొన్ని రోజులే ఉండొచ్చు.. ఆ తర్వాత ఎండలు ఉన్నా.. ఇంత తీవ్ర స్థాయిలో ఉండవనేది వాతావరణ శాఖ అంచనా.