వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తినాల్సిందే

వర్షాకాలంలో ఈ ఫ్రూట్స్ తినాల్సిందే

కరోనా వల్ల ప్రజల్లో ఆరోగ్య స్పృహ చాలా పెరిగింది. మంచి ఆరోగ్యం కోసం చాలా మంది హెల్తీ డైట్‌ను ఫాలో అవుతున్నారు. అయితే డైట్‌తోపాటు ఎక్సర్‌సైజులు, యోగా, ధ్యానం చేయడం, మ్యూజిక్ వినడంతోపాటు ఒత్తిడిని పోగొట్టే పుస్తకాలు చదవడం, మొక్కల పెంపకం లాంటి హాబీలు కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో సీజన్‌లను బట్టి డైట్‌ను మార్చుకోవాలని చెబుతున్నారు. వాతావరణ మార్పులను బట్టి మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలని లేకపోతే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు అధిన న్యూట్రిషన్లు కలిగిన ఫుడ్ ఐటమ్స్‌ను తినాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో రోజువారీ ఆహారంలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్న ఫుడ్ ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం..

అరటి పండ్లు: వర్షాకాలంలో గ్యాస్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని అధిగమించడానికి అరటి పండ్లు బాగా ఉపకరిస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచేందుకు అరటిలోని సీ విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అరటి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. 

గుడ్లు: ఏ సీజన్‌లో అయినా బెస్ట్ ఫుడ్, సూపర్ ఫుడ్‌గా గుడ్లను చెప్పొచ్చు. ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లతో కండరాలు బలంగా తయారవుతాయి. గుడ్లు ఎక్కువ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్లతో పోరాడటం సులువవుతుంది.  

సీజనల్ పండ్లు: లిచీ, బొప్పాయి, దానిమ్మ లాంటి పండ్లను వర్షాకాలపు పండ్లుగా చెప్పొచ్చు. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చడంతోపాటు ఉక్కపోత ఎక్కువగా ఉండే ఈ సీజన్‌లో వచ్చే ఇన్ఫెక్షన్లతో ఫైట్ చేసేందుకు తోడ్పడతాయి. ఈ పండ్లతోపాటు ఐరన్, ఫోలెట్, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉండే జామకాయను కూడా భోజనంలో చేర్చాలి. 

కొబ్బరినీళ్లు: శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటే సీజనల్‌ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు. ఇందుకు ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరి నీళ్లను తాగడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. కోకోనట్ వాటర్ తాగితే గుండెకు మంచిది. టాక్సిన్లను బయటకు పంపే కొబ్బరినీళ్ల వల్ల మన స్కిన్ కూడా కాంతివంతంగా మారుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి నీళ్లు ప్రయోజనం చేకూరుస్తాయి. కొబ్బరి నీళ్లకు కొంత లెమన్ జ్యూస్ లేదా పైనాపిల్‌‌ జ్యూస్‌ను కలిపి తీసుకోవాలి. అప్పుడు శరీరంలో ఇమ్యూనిటీని పెంచే విటమిన్ సీ లెవల్స్ కూడా పెరుగుతాయి.