విజయవాడ: మోంథా తుఫాను ప్రభావంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా.. అంశాలపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కాల్వలు, చెరువులకు గండిపడకుండా చూడాలని, నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు.
లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, రిలీఫ్ క్యాంపులకు తరలించాలని అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాను ప్రభావం వల్ల కరెంట్ కట్ చేయాల్సి రావచ్చని, ముందుగానే ప్రజలకు కొవ్వొత్తులు అందేలా చూడాలని సీఎం చెప్పారు.
తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస శిబిరాల్లో ఉండేవారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని, అధికారులు.. -ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉండాలని.. క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు ఉంటే.. ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అవుతుందని సీఎం తెలిపారు.
భారీ వర్షాల వల్ల వచ్చే వరద నీటిని కాల్వలు, డ్రైన్ల ద్వారా బయటకు పంప్ చేయాలని.. విజయవాడ, ఏలూరు, భీమవరం వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ప్రతి గంటకూ తుఫాన్ బులెటిన్ రిలీజ్ చేయాలని, మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించాలని సీఎం స్పష్టం చేశారు.
►ALSO READ | Cyclone Montha: తీరానికి దగ్గరగా భీకర్ తుఫాన్ మోంథా: ఈ రాత్రి కోస్తా జిల్లాల్లో ప్రయాణాలు వద్దు
మోంథా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసుకుని జాతీయ రహదారులపై రాకపోకలను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రహదారులపై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. తీవ్ర తుఫాన్ కారణంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే కంటెయినర్ లాంటి భారీ వాహనాలను ఈ రోజు (28, అక్టోబర్) రాత్రి 7.00 గంటల నుంచి జాతీయ రహదారుల వెంట ఉన్న హోల్డింగ్ ప్రాంతాల్లో నిలిపివేయడం జరుగుతుందని ఏపీ పోలీస్ శాఖ ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేశారు. తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు.
🌧️🚛తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు🚧
— Andhra Pradesh Police (@APPOLICE100) October 28, 2025
తీవ్ర తుఫాన్ కారణంగా జాతీయ రహదారుల్లో ప్రయాణించే కంటెయినర్ లాంటి భారీ వాహనాలను ఈ రోజు (28, అక్టోబర్) రాత్రి 7.00 గంటల నుంచి జాతీయ రహదారుల వెంట ఉన్న హోల్డింగ్ ప్రాంతాల్లో నిలిపివేయడం జరుగుతుంది. (1/2) pic.twitter.com/tSDSaYjJIk
