ఇప్పట్లో.. పెట్రో ధరలు పెరగవు.. ఎన్నికలే కారణం : మూడీస్

ఇప్పట్లో.. పెట్రో ధరలు పెరగవు.. ఎన్నికలే కారణం : మూడీస్

న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు అధికంగా ఉన్నప్పటికీ, 2024లో జరగనున్న ఎన్నికల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోవచ్చని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ నివేదిక పేర్కొంది. మూడు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లతో సహా భారతదేశంలోని ప్రధాన ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు (ఓఎంసీలు).. 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీ​పీసీఎల్​)  హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్​పీసీఎల్​)లకు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు 90 శాతం వాటా ఉంది. గత 18 నెలలుగా పెట్రో ప్రొడక్టుల ధరలు మారడం లేదు. అయితే ఇదేకాలంలో ముడి చమురు ధరలు మాత్రం బాగా పెరిగాయి. 

2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో చమురు సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.  ఆగస్టు నుంచి అంతర్జాతీయ చమురు ధరలు దూసుకెళ్లడంతో ఈ మూడు రిటైలర్ల మార్జిన్లు (లాభాలు) మళ్లీ తగ్గాయి.  జూన్​తో ముగిసిన క్వార్టర్​లో ఓఎంసీల మార్కెటింగ్ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బాగా పడిపోయాయి. డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మార్కెటింగ్ మార్జిన్లు ఆగస్టు నుంచి నెగటివ్​లోకి వెళ్లగా, అంతర్జాతీయ ధరలు పెరగడంతో అదే కాలంలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మార్జిన్లు గణనీయంగా తగ్గాయి. 

ఇంటర్నేషనల్​ ధరల్లో పెరుగుదల..

ముడిచమురు ధర 2024  మొదటి క్వార్టర్​లో బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సగటున 78 డాలర్లు ఉండగా, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 90 డాలర్లకు చేరింది. దీంతో ముడిసరుకు ఖర్చులు పెరిగాయని మూడీస్ తెలిపింది. ఉత్పత్తి కోతలను ఒపెక్​ పొడిగించడం, రష్యా ఎగుమతి కోతల వల్ల ఉత్పత్తి రోజుకు సుమారు మూడు లక్షల బ్యారెల్స్ తగ్గిందని పేర్కొంది.  

గ్లోబల్ గ్రోత్ బలహీనపడినంత కాలం చమురు ధరలు ఎక్కువగా ఉండే అవకాశం లేదని పేర్కొంది. అంతర్జాతీయ,  దేశీయ ధరల మధ్య చిన్న అంతరం ఉంటే ఓఎంసీల మార్కెటింగ్ నష్టాలు తగ్గినప్పటికీ, రిటైల్ అమ్మకపు ధరలు మారకుండా ఉంటాయి కాబట్టి ఓంఎసీలు మొత్తం లాభదాయకత బలహీనంగా ఉంటుందని వివరించింది. ఏప్రిల్–-జూన్ క్వార్టర్​లో వీటికి బాగానే ఆదాయాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం చమురు ధరలు ఎక్కువగా ఉన్నందున ఓఎంసీల నిర్వహణ, పనితీరు తదుపరి 12 నెలల్లో బలహీనపడుతుందని అంచనా. ముడి చమురు ధరలు ప్రస్తుతం  85 డాలర్ల నుంచి 90 డాలర్ల వరకు ఉన్నాయి.  

ఇదిలా ఉంటే, ఈ సంవత్సరం ప్రారంభంలో బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చమురు మార్కెటింగ్ రంగానికి కేంద్ర ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల మూలధన మద్దతు ప్రకటించింది.  దీనివల్ల ఆయా సంస్థల మూలధన అవసరాలు తీరుతాయి. మరో సంగతి ఏమిటంటే ఐఓసీఎల్​, బీపీసీఎల్​ క్యాపిటల్​ కోసం రైట్స్​ ఇష్యూలను కూడా ప్రకటించాయి.