ప్రస్తుత రోజుల్లో ఎవరి పని వారు చేయకుండా పక్కోడు ఏం చేస్తున్నాడా అని గమనిస్తుంటారు. ఉన్నతాధికారి వచ్చి ఈ పని ఎవరు చేశారని గట్టిగా అడిగితే.. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందోనని మంచి పని చేసినా.. తానే చేయలేదని..పక్కవారి మీద చాడీలు చెబుతారు. అయితే ఒక్కోసారి అలా చెప్పిన వారికి తనకు దక్కాల్సిన మంచి.. రివార్డ్స్ ఇతరులకు దక్కుతాయి. ఈ స్టోరీలో అడవిలో కుందేలు మంచి పని చేసినా.. అడవి రాజు సింహానికి నక్క చేసిందని చెప్పడంతో కుందేలు నష్టపోయింది..!
ఒకదట్టమైన కీకారణ్యంలో జంతువులన్నీ హాయిగా బతికేవి. ఏ ఆపద వచ్చినా అన్నీ కలసి కట్టుగా సమస్యలను పరిష్కరించుకునేవి. అదే అడవిలో 'కున్నీ' అనే ఒక కుందేలు ఉండేది. అది ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్తూ జంతువుల మధ్య గొడవలు పెంచేది. అవి తగువులాడుతుంటే ఇది ఆనందించేది.
అదే చోట 'నిమ్ము' అనే నక్క ఉండేది. దానికి అబద్దం అంటేనే తెలియదు. అందరి దగ్గర ఎప్పుడూ నిజాలే చెప్తూ, అందరికీ సాయం చేస్తూ ఎంతో మంచిదని పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఒక రోజు అడవికి రాజైన సింహం అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంది.
ఠీవీగా నడుస్తూ ఒక్కో ప్రాంతాన్ని చూస్తూ.. నక్క, కుందేలు ఉండే ప్రాంతానికి వచ్చింది. ఒక ప్రదేశానికి రాగానే అక్కడ ఒక పెద్ద నేల మాళిగ,అందులో అనేక కంద మూలాలు ఉన్నాయి. వాటిని దాచిన జంతువు ఇంకో ఏడాది పాటు కష్ట పడాల్సిన అవసరం లేదు. ఆ మాళిగను చూసిన సింహం 'నేను ఈ అడవికి రాజునై ఉండి కూడా ఎప్పుడూ ఇలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు.
ఈ జంతువుకు తెలివి, ముందుచూపు చాలా ఉన్నాయి. కాబట్టి, ఈ జంతువును నాతోపాటే ఉంచుకుంటే బాగుంటుంది' అనుకుంది. వెంటనే “ఇక్కడ దీన్ని కట్టింది ఎవరు?" అని గట్టిగా అరిచింది. అక్కడే ఉన్న కుందేలు అది కట్టింది తానే అని చెబితే రాజు తన అనుమతి లేకుండా ఇలా చేసినందుకు ఆగ్రహించవచ్చు అనుకుంది.
అతి వినయంగా దగ్గరకు వెళ్లి.. "ప్రణామాలు రాజా! నేను మీ దాసుడను. ఈ ప్రదేశంలోనే ఓ మూల తలదాచుకుంటున్నా. మీరు ఇప్పుడడిగిన ప్రశ్న విని, సమాధానం చెప్పి మీకు సాయం చేయాలని వచ్చా" అని చెప్తుండగానే.. "సరేఇక్కడ దీన్ని కట్టిందెవరో చెప్పు" అంటూ గర్జించింది సింహం.
"రాజా.. ఇక్కడ దీన్ని మీ అనుమతి లేకుండా నిర్మించింది నిమ్ము అనే నక్క ..
మీరు వినే ఉంటారు నక్కలు చాలా జిత్తుల మారివి. మీరు ఇప్పుడు ఇంత గట్టిగా అడుగుతున్నారు అంటే కచ్చితంగా దానికి తగిన శిక్ష వేయడానికే అయ్యుంటుంది" అంటూ నక్క మీద లేనిపోని చాడీలు చెప్పింది. సింహం నక్కను ఎలాగైనా చంపుతుంది అనుకుని మనసులో సంతోషించింది. “అయితే.. ఆ నక్క ఎక్కడున్నా నా గుహకు తీసుకునిరా. నేను దానితో మాట్లాడాలి" అంటూ తన కోట గుహకు వెళ్ళింది.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా కుందేలు నక్క దగ్గరకు వెళ్లి "నిన్ను సింహం వెంటబెట్టుకుని కోట గుహకు తీసుకురమ్మంది పద" అంటూ తీసుకెళ్లింది. దారి మధ్యలో "చూడు! సింహం చాలా కోపంగా ఉంది. నా బొరియ పక్కన ఉన్న ముళ్ల పొద ఏర్పర్చింది ఎవరని నన్ను అడిగింది. అడిగి నేను నువ్వని చెప్పాను. ఆయన ఏమడిగినా 'ఆ నేనే. మీకు ఇష్టం లేకపోతే దాన్ని ఇప్పుడే తొలగిస్తా' అని చెప్పు" అంటూ సింహం ఉన్న గుహ దగ్గరకు తీసుకెళ్లింది.
వెంటనే సింహం నక్కను చూసి “నీ పనితనం నాకు బాగా నచ్చింది. నువ్వు వెంటనే నీ బొరియ ఖాళీ చేసి, నా దగ్గరకు వచ్చెయ్. నీకు నా గుహ ఇస్తా. రోజూ వేటకు వెళ్లి తెచ్చిన ఆహారంలో నీకు కొంత ఇస్తా" అని చెప్పడంతో నక్క తల ఊపింది. ఆ మాటలు విన్న కుందేలు ఆశ్చర్యపోయింది. టక్కరి మాటల కున్నీ తన బుద్ధిని మార్చుకుంది. “ఒక వ్యక్తిలోని గుణాన్ని అందరికీ ఆపాదించకూడదు" అనుకుని అప్పటినుంచి నిజాలు మాత్రమే చెప్తోంది. నక్క సింహం గుహలో హాయిగా గడపసాగింది.
-సింగంపల్లి శేష సాయికుమార్–
