నైతిక గెలుపు టీఆర్ఎస్‌దే: గెల్లు శ్రీనివాస్

నైతిక గెలుపు టీఆర్ఎస్‌దే: గెల్లు శ్రీనివాస్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై నన్ను ఓడించాయి

కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోయినా నైతిక విజయం టీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ఆయన కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉధ్యమంలో పనిచేసానని పేదరికాన్ని చూడకుండా తనకు టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు తెలుపు తనకు ఓటేసిన ఓటర్లకు పాదబివందనం చేస్తున్నానన్నారు. 
ఈటల గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు పనిచేశారు
ఈటల రాజేందర్ గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు పనిచేశారని గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు ఒక్కటై తనను ఓడించాయని, ఈటల గెలవాలని కాంగ్రెస్ నాయకులే బల్మూరి వెంకట్ ను బలిపశువు చేశారని పేర్కొన్నారు. మరో రెండున్నర సంవత్సరాలలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి.. భవిష్యత్ లో మళ్ళీ హుజూరాబాద్ లో ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. గెలుపు ఓటములు సహజం అంటూ టీఆర్ఎస్ ఓటమికి తనదే నైతిక భాధ్యత అన్నారు. గెలిచిన ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన కోసం పనిచేసిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్,కొప్పుల ఈశ్వర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయిస్తానని అన్నారు.