
- 2,000 మందికి పైగా జాబ్స్
- ఎంఓయూలపై సంతకాలు
- తెలంగాణ దూసుకెళ్తోంది
- ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ కే టీ రామారావు
లండన్: తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టుబడులు తెచ్చేందుకు ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీ రామారావు నాయకత్వంలోని ప్రభుత్వ అధికారుల టీమ్ యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో ఎంఓయూలను ప్రభుత్వం కుదుర్చుకుంటోంది. ఎల్ఎస్ఈ గ్రూప్టెక్ సెంటర్ పెట్టేందుకు ఒక ఒప్పందం, జెనోమ్‌వ్యాలీలో సెంటర్ ఏర్పాటుకు క్రోడా ఇంటర్నేషనల్, టెక్ సెంటర్ ఏర్పాటుకు డీజీజెడ్ఎన్ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఎంత పెట్టుబడులు పెట్టేదీ ఆ కంపెనీలు బయటపెట్టకపోయినా, కొన్ని వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని మినిస్టర్ కేటీఆర్ ఈ పర్యటనలో వెల్లడించారు.
లండన్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎల్ఎస్ఈ) గ్రూప్ హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయనుంది. ఈ టెక్నాలజీ సెంటర్ 1,000 మందికి ఉద్యోగాలు కల్పించనుందని తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ వెల్లడించారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్‌తో ఈ మేరకు ఒక ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుందని చెప్పారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు తెచ్చేందుకు అధికారులతో కలిసి కేటీ రామారావు యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తున్నారు. ఎల్ఎస్ఈ గ్రూప్ సీఐఓ మెక్‌కార్తీ, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు.
అంతకు ముందు ఇండియన్ హై కమిషన్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ డిస్కషన్లోనూ కేటీఆర్ పాల్గొన్నారు. ఇండియాలో అత్యంత సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్‌గా తెలంగాణను మంత్రి అక్కడివారికి పరిచయం చేశారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన 9 ఏళ్లలోనే అనేక విజయాలు సాధించగలిగామని, అందుకే సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్‌గా చెబుతున్నానని మంత్రి పేర్కొన్నారు. దేశంలో జనాభాపరంగా చూస్తే 2.5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ రాష్ట్రం జీడీపీలో 5 శాతాన్ని సమకూరుస్తోందని చెప్పారు.
ప్రపంచంలోనే మూడో పెద్ద వ్యాక్సిన్‌హబ్‌గా తెలంగాణ అవతరించిందని అన్నారు. కిందటేడాది ఇండియా ఐటీ ఇండస్ట్రీలో 4.5 లక్షల కొత్త జాబ్స్ క్రియేట్ అయితే ఇందులో 1,50,000 తెలంగాణ నుంచి, 1,46,000 మాత్రమే కర్నాటక నుంచి క్రియేట్ అవడాన్ని గమనించాలని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంత వేగంగా ఎదుగుతోందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు బాగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.