
- ఫెడరల్ రిజిస్టర్‌లో రికార్డ్
- వీసా పరిమితి మినహాయింపుల అర్హత మరింత కఠినతరం
- వీసా ప్రోగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించే యాజమాన్యాలు,
- థర్డ్ పార్టీ నియామకాలపై ఫోకస్
- ఈ నిబంధనలు 2025 డిసెంబర్‌లో వెలువడే అవకాశం
- అమలు చేస్తే లాభాపేక్షలేని సంస్థ లు, మన స్టూడెంట్లపై ప్రభావం
వాషింగ్టన్: లక్ష డాలర్ల ఫీజు పెంపును మరువకముందే హెచ్ 1 బీ వీసాలపై అమెరికా మరిన్ని ఆంక్షలకు సిద్ధమైంది. వీసా జారీ ప్రక్రియలో మరిన్ని మార్పులు చేస్తూ ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదనలు చేసింది. వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేసింది.
‘‘యజమానులు పర్మిట్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చు.. దానికి ఎవరు అర్హులు’’ అనేదానిపై అదనపు ఇమిగ్రేషన్ పరిమితులను విధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీసా ప్రోగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించే యాజమాన్యాలు, థర్డ్‌పార్టీ నియామకాలపై ఫోకస్ పెట్టింది. ‘రిఫార్మింగ్ ది హెచ్-1బీ నాన్ ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్’ కింద ఈ కొత్త ప్రపోజల్స్ ఫెడరల్ రిజిస్టర్‌లో నమోదయ్యాయి.
అమలుపై స్పష్టత లేదు..
హెచ్-1బీ వీసా కార్యక్రమం ఇంటిగ్రిటీని మెరుగుపర్చేందుకు, అమెరికాలోని కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో పరిస్థితులకు రక్షణ కల్పించడం కోసం ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చినట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్) పేర్కొన్నది. అయితే.. ఈ ప్రపోజల్స్ అమలు విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. వార్షిక పరిమితి నుంచి ఏ యజమానులు, ఏ పొజిషన్స్‌లో ఉన్నవారికి మినహాయింపు ఇస్తారనేదీ డీహెచ్‌ఎస్ వెల్లడించలేదు.
మినహాయింపుల పరిమితిలో మార్పులు గనుక చేస్తే.. లాభాపేక్ష లేకుండా సోషల్ సర్వీస్ చేస్తున్న రీసెర్చ్, హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూషన్లు, వర్సిటీలు తమకు అందుతున్న ప్రయోజనాలను కోల్పోతాయని ఇంటర్నేషనల్మీడియా కథనాలు వెల్లడించాయి. అలాగే, అమెరికాలో పనిచేయాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు, యువ నిపుణులపై ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. రెగ్యులేటరీ నోటీస్ప్రకారం.. ఈ నిబంధనలు 2025 డిసెంబర్‌లో వెలువడే అవకాశం ఉన్నది.