సగానికి పైగా లెక్చరర్​ పోస్టులు ఖాళీ

 సగానికి పైగా లెక్చరర్​ పోస్టులు ఖాళీ
  • సదువు సక్కగలేదు.. సౌలతులకు గతిలేదు
  • తెలంగాణ యూనివర్సిటీ లో సగానికి పైగా లెక్చరర్​ పోస్టులు ఖాళీ
  • కనీస వసతులు లేక స్టూడెంట్ల కష్టాలు
  • నలుగురు ఉండాల్సిన గదిలో ఎనిమిది మందిని పెట్టిన్రు
  • సరిపడా బాత్రూంలు లేక పాట్లు 
  • ఫుడ్​ తినలేకపోతున్నామన్న ఫిర్యాదులపైనా పట్టింపు లేదు

నిజామాబాద్,  వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటై 16 ఏండ్లు కావస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రత్యేక రాష్ట్రంలోనూ సర్కారు సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  సరిపడా లెక్చరర్లు లేక చదువులకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు మహిళా స్టూడెంట్లు వసతి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలకేంద్రం శివారులో తెలంగాణ యూనివర్సిటీని ప్రభుత్వం 2006వ సంవత్సరంలో రెండు పీజీ కోర్సులతో ప్రారంభించింది. 2009లో 28 కోర్సులకు పెంచారు. 2019లో  మరో రెండు కోర్సులు పెంచారు. ప్రస్తుతం యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ విభాగాల్లో 30  కోర్సుల్లో 1,750 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. టీయూలోని మాస్టర్ డిగ్రీ కోర్సుల 19 డిపార్ట్ మెంట్లకు 144 మంది లెక్చరర్ల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే 85 మందిని మాత్రమే నియమించారు. వీరిలో కొందరు వివిధ కారణాలతో బదిలీ, ప్రమోషన్లపై వెళ్లగా ప్రస్తుతం 69 మంది మాత్రమే ఉన్నారు. మరో 11 డిపార్ట్​మెంట్లకు వంద పోస్టులు అవసరం ఉండగా సర్కారు పట్టించుకోకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభావం రిజల్ట్స్ పై పడుతోంది.  

సరైన వసతి లేక..

వర్సిటీలో మొత్తం 1,750 మంది స్టూడెంట్స్ లో 450 వరకు గర్ల్స్ ఉన్నారు. మొత్తం మూడు హాస్టళ్లలో రెండు బాయ్స్, ఒకటి గర్ల్స్ కోసం కేటాయించారు. ప్రధానంగా గర్ల్స్ హాస్టల్​లో సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 324 మంది ఉండాల్సిన హాస్టల్​లో 425 మంది ఉంటున్నారు. నలుగురు ఉండాల్సిన గదిలో  ఆరు నుంచి 8 మంది ఉండాల్సి వస్తోంది. నీటి సౌకర్యం, టాయిలెట్స్ స్టూడెంట్స్​సంఖ్యకు అనుగుణంగా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కాలకృత్యాల్లో ఆలస్యం వల్ల తరగతులకు సకాలంలో వెళ్లలేకపోతున్నారు. 

మెస్​లో నాసిరకం ఫుడ్
  
యూనివర్సిటీలోని మెస్​లో నాసిరకం భోజనంతో స్టూడెంట్స్​అనారోగ్యం పాలవుతున్నారు.  ఇక్కడ చదువుతున్న స్టూడెంట్లకు ఒక్కొక్కరికి సర్కారు రూ. 1,500 చొప్పున చెల్లిస్తోంది. రెండు మూడేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో స్టూడెంట్స్ భోజన ఖర్చులు 30 శాతం వరకు పెరిగాయి. దీంతో ఫుడ్​లో క్వాలిటీ తగ్గింది. నాసిరకం ఫుడ్ తో స్టూడెంట్స్ తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. స్థానికంగా డిస్పెన్సరీ లేకపోవడంతో వ్యాధుల సీజన్ లో మరింత అవస్థ పడుతున్నారు.

మూడో రోజూ స్టూడెంట్స్​ ధర్నా

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ లో వరుసగా మూడో రోజు స్టూడెంట్స్​ధర్నా కొనసాగింది. సమస్యల పరిష్కారంపై బుధవారం సాయంత్రం వీసీ రవీందర్​ఇచ్చిన హామీ మేరకు ధర్నా ముగిసినట్లేనని అంతా భావించారు. సాయంత్రం స్టూడెంట్స్​ హాస్టల్స్​కు తిరిగి వెళ్లారు. రాత్రి ఒక స్టూడెంట్​అనారోగ్యానికి గురవడంతో వర్సిటీ అంబులెన్స్​ డ్రైవర్​కి కాల్ ​చేశారు. రిజిస్ట్రార్ ​చెప్తేనే అంబులెన్స్​ తెస్తానని చెప్పడంతో స్టూడెంట్స్​ కంగు తిన్నారు. అంబులెన్స్ ​వచ్చేందుకు ఆలస్యమవుతుందని బైక్​ పై మండలకేంద్రంలోని హాస్పిటల్​కు తీసుకువెళ్లారు. ఈ ఘటనతో సమస్యలు పరిష్కారమయ్యేవరకు ధర్నా కొనసాగించాలని స్టూడెంట్స్​ నిర్ణయించుకున్నారు. గురువారం వర్సిటీ మెయిన్​గేట్​ఎదుట బైఠాయించి ఆందోళన కొనసాగించారు.

డ్యూటీలకు వెళ్లే ప్రొఫెసర్స్, ఇతర సిబ్బందిని కాలినడకన లోపలికి వెళ్లాలని చెప్పారు. దీంతో తెలుగు ప్రొఫెసర్​ కనకయ్య స్టూడెంట్స్​ తో వాగ్వాదానికి దిగారు. ‘మీరు పేయిడ్​ ధర్నా చేస్తున్నారని’ అనడంతో స్టూడెంట్స్​ భగ్గుమన్నారు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నామో రుజువు చేయాలని డిమాండ్​ చేశారు. స్టూడెంట్స్ ​ఉద్యమాన్ని అవమానించిన ప్రొఫెసర్​ క్షమాపణ చెప్పాలని, వెంటనే ఆయన్ని సస్పెండ్​ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కనకయ్య దిష్టిబొమ్మతో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్​ బిల్డింగ్​వరకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. శుక్రవారం కూడా ధర్నా కొనసాగుతుందని స్టూడెంట్స్​ తెలిపారు. 


మెరుగైన వసతి కల్పించండి

గర్ల్స్ కి ఒకే హాస్టల్ ఉండడంతో నానా అవస్థలు పడుతున్నం. 324 మంది ఉండాల్సిన చోట 425 మందిని ఉంచారు. ఒక్కో గదిలో 8 మంది ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డిస్పెన్సరీ లేక గర్ల్స్ అవస్థలు పడుతున్రు. లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేయడం లేదు. మెస్ చార్జీలు పెంచకపోవడంతో నాసిరకం ఫుడ్ అందిస్తున్నారు. వసతి సౌకర్యం మెరుగుపరచడంతోపాటు స్టూడెంట్స్ కి పౌష్టికాహారం అందించాలి. 
– రచన, పీజీ స్టూడెంట్​

లెక్చరర్ల ఖాళీలు  భర్తీ చేయాలె

వర్సిటీలో 75 లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగేండ్లుగా వర్సిటీలో సమస్యలు పేరుకుపోతున్నాయి.  ఖాళీల వల్ల విద్యాబోధన సక్రమంగా లేక రిజల్ట్స్ పై ప్రభావం పడుతోంది. లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నత విద్యామండలి, వర్సిటీ ఆఫీసర్లు పదేళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలె.
– సందీప్, స్టూడెంట్