రైతులు నడీడులోనే రాలిపోతున్నరు

రైతులు నడీడులోనే రాలిపోతున్నరు
  • సగటున 42 ఏండ్లకే మరణం
  • హార్ట్​ఎటాక్​తో కొందరు.. అనారోగ్యం,  ప్రమాదాలతో మరికొందరు..
  • ఆత్మహత్యలు చేసుకొని ఇంకొందరు..
  • మృతుల్లో చిన్న కమతాల వారు,
  • బడుగు బలహీనవర్గాల వారే ఎక్కువ
  • నల్గొండ జిల్లాలో అత్యధిక మరణాలు
  • రాజధాని పక్క జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
  • ‘రైతు బీమా’ లెక్కల్లో తేలిన చేదు నిజాలు

హైదరాబాద్, వెలుగు:

రాష్ట్రంలోని రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని తట్టుకోలేక నడి వయసులోనే ప్రాణాలు విడుస్తున్నారు. గుండెపోటుతో కొందరు.. ఆత్మహత్యలు చేసుకొని మరికొందరు.. వివిధ ప్రమాదాల్లో ఇంకొందరు.. ఇలా కారణాలు ఏవైనా అన్నదాతలు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. 2018 ఆగస్టు 14 నుంచి ఈ ఏడాది జులై 31 వరకు ‘రైతు బీమా’ కోసం ప్రభుత్వం తయారుచేసిన జాబితాను లోతుగా పరిశీలిస్తే ఈ చేదు నిజాలు బయటపడ్డాయి. ఏడాది కాలంలో రాష్ట్రంలో 15,880 మంది అన్నదాతలు చనిపోయారు. రైతు మరణాల్లో జాతీయస్థాయి సగటు వయసు 53 నుంచి 54 ఏండ్లు కాగా,  అది మన రాష్ట్రంలో 42 ఏండ్లుగా ఉంది. మహారాష్ట్రలోని విదర్భలో 36 ఏండ్లుగా ఉంది. రైతు మరణాల్లో విదర్భ మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ  రెండో స్థానంలో ఉంది.

చుట్టూ సమస్యల వలయం

అప్పులు, దిగుబడి బాధలు, మార్కెట్ సమస్యలు రైతులను చుట్టుముడుతున్నాయి. నలుగురికి అన్నం పెట్టే అన్నదాతలకే పౌష్టికాహారం కరువవుతోంది. సమయానికి తినకా, తిన్న దాంట్లో బలమైన ఆహార పదార్థాలు లేక చిన్న వయస్సులోనే పెద్ద రోగాల బారినపడుతున్నారు. రెండేండ్లుగా సకాలంలో వానలు రాలేదు. మరణాల సంఖ్య పెరగడానికి ఇదీ ఓ కారణం. రాష్ట్రంలో మెట్ట పంటలు, బోర్ల కింద సేద్యంపైనే ఎక్కువ మంది రైతులు ఆధారపడ్డారు. సీజన్​లో పదిరోజులు ఆలస్యంగా విత్తనాలు వేస్తే దిగుబడిలో 20 శాతం తగ్గుదల వస్తుంది. పదిహేను రోజులు ఆలస్యమైతే 30 శాతం దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. ఇవి కూడా రైతులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇంటిల్లి పాదికి ఓ మోస్తరు జీవితాన్నైనా ఇవ్వలేక పోతున్నామనే వేదనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. 18 ఏండ్ల నుంచి 50 ఏండ్ల వయసులోపు రైతులే ఎక్కువ మంది చనిపోతున్నారు.

ఏ కారణం వల్ల ఎంత మంది మృతి

రైతుల మరణాలకు కారణాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య  ఎక్కువ మంది గుండెపోట్లు,  ఇతర అనారోగ్య  సమస్యల బారిన పడుతున్నారు. ఏటా జరిగే రైతు మరణాల్లో ఆత్మహత్యల కారణంగా 4.5 శాతం, పాము కాట్ల వల్ల రెండు శాతం సంభవిస్తున్నాయి. ఏడు శాతం మంది వివిధ రకాల ప్రమాదాల వల్ల  చనిపోతున్నారు. మిగిలిన ఎనభైశాతం మంది రైతులు ఇతర కారణాల వల్ల మరణిస్తున్నట్లు అంచనా. ఇటీవల జరిగిన  రైతుల మరణాల తీరును చూస్తే తీవ్ర ఒత్తిడి.. దాని పర్యవసానంగా వస్తున్న అనారోగ్యం వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలంలో రాష్ట్రంలో 15,880 మంది రైతులు చనిపోయినట్లు రైతు బీమా లెక్కలు చెబుతుండగా.. ఇందులో 20 నుంచి 45 ఏండ్ల లోపు వారు నాలుగు వేల మందికి పైగా ఉన్నారు. యాభై నుంచి యాభై ఐదు ఏండ్ల మధ్య వయసు వారు ఏడు వేలకు పైగా ఉన్నారు.

రాష్ట్రంలో రైతులెంత మంది

మన రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులున్నారు. ఇందులో 31 లక్షల మందికి వరకు ‘రైతు బీమా’ కింద ఎన్ రోల్ చేసుకున్నారు. 2018 ఆగస్టు 14 నుంచి రైతు బీమాను ప్రభుత్వం ప్రారంభించింది. ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం బీమా చెల్లిస్తున్నది. ప్రభుత్వం ద్వారా సాయం పొందిన, పొందాల్సిన రైతు కుటుంబాలు 15,880 వరకు ఉన్నాయి. ఏడాది కాలంలో 14 వేల మందికిపైగా రైతుల కుటుంబాలకు బీమా అందింది.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఏడాది కాలంలో 19 మంది రైతులు చనిపోయారు. ఇందులో ఆరుగురు గుండె పోటుతోనే ప్రాణాలు విడిచారు. వీరంతా 35 ఏండ్ల లోపు వారే. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన రైతు గుండాల చిన్నమల్లయ్య (38) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే మండలం ధన్ సింగ్ తండాకు చెందిన రామావత్ బత్తి (45) కిడ్నీ సమస్య కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. తనకున్న భూమితోపాటు కొంత కౌలుకు తీసుకున్నాడు. పంట రాలేదు. అనారోగ్యానికి గురయ్యాడు. సరైన వైద్యం అందక చనిపోయాడు. మేకల వెంకటయ్య (40) మూడెకరాల భూమి ఉంది. గుండె పోటుతో చనిపోయాడు. ఈయనది యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రైతు పోచయ్య(50) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడ్డాడు. ఈ మధ్యనే ఈయనా చనిపోయాడు. గతంలో ఈయన భార్య కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. ఇలా ఏడాది కాలంలో రాష్ట్రంలో సుమారు 16 వేల మంది రైతులు నడీడులోనే జీవితం ముగించారు. కాడిని వదిలి కన్న వారికి, ఉన్న ఊరికి శాశ్వతంగా దూరమయ్యారు.

బడుగు బలహీనవర్గాల వారే ఎక్కువ

చనిపోతున్న రైతుల్లో బడుగు బలహీనవర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. చిన్న కమతాలున్న వారిలో ఎక్కువగా బీసీలున్నారు. ఏడాది కాలంలో బీసీ కులాలకు చెందిన రైతులు 8వేల మందికి పైగా చనిపోయారు. ఏడాది కాలంలో చనిపోయిన రైతుల్లో 90 శాతం మంది అట్టడుగు కులాలవారే.

కమ్యూనిటీ వారీగా రైతు మరణాలు

కమ్యూనిటీ                       రైతు మరణాల సంఖ్య

బీసీ                                 8,042

మైనార్టీ                             129

ఎస్సీలు                             2,862

ఎస్టీలు                              2,270

ఇతరులు                          2,577

మొత్తం :                       15,880

రైతు బీమాతో భరోసా

సామాజిక రక్షణగా రైతు బీమా పథకం బాధిత కుటుంబాలను ఆదుకుంటున్నది.  కాయ కష్టం చేసుకు బతికే రైతు కుటుంబాలకు ఇది ఆపన్న హస్తం.  రైతులు ఏ కారణంతో చనిపోతున్నా  వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. బాధిత రైతుకుటుంబాలందరికీ బీమాను ఇస్తున్నాం. ఇది ఖచ్చితంగా వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది.

– పార్థసారథి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి

ఆరోగ్య వసతులు పెంచాలి

సరైన ఆహారం, సురక్షితమైన నీళ్లు లేక పోవడం వల్ల రైతులు డయాబెటిస్, మూత్ర పిండాల వ్యాధుల బారిన పడుతున్నారు. అప్పులు, గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి కారణాలతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వీరికి సరైన వైద్య సౌకర్యాలు లేవు. పొలాల్లో విద్యుత్ షాక్ వల్ల కూడా చనిపోతున్నారు. ప్రభుత్వం ఆరోగ్య వసతులు పెంచాల్సిన అవసరం ఉంది.

– సారంపల్లి మల్లారెడ్డి, ఆల్ ఇండియా రైతు సంఘం నాయకుడు

కమతం చిన్నది కష్టం పెద్దది

ఏడాది కాలంలో చనిపోయిన రైతుల్లో చిన్న కమతాల వారే ఎక్కువగా ఉన్నారు. అందులో అర ఎకరా నుంచి రెండున్నర ఎకరాల లోపున్న వారు ఏడు వేల మంది, రెండున్నర ఎకరాల నుంచి ఐదు ఎకరాల లోపున్న వారు  2,960 మంది ఉన్నారు. కమతాలు చిన్నవైనా రైతులకు కష్టం పెద్దగా ఉంటోంది. ఎకరా సాగుకు ప్రభుత్వ సాయంతోపాటు అదనంగా ఒక్కో  రైతు ఇరవై వేల నుంచి యాభై వేల వరకు అప్పులు తెచ్చుకుంటున్నారు. సరైన నీటి వసతి లేకపోవడం, పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం వంటి అంశాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు పిల్లల చదువులకు,పెళ్లిళ్లకూ అప్పులు చేయాల్సి వస్తున్నది. అవి తీర్చే మార్గం కన్పించడం లేదు. దీని వల్ల రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకున్నా ఫలితం దక్కడం లేదని కుంగిపోతున్నారు.

నల్గొండ జిల్లాలో ఎక్కువ

జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లాలో ఎక్కువ మంది రైతులు చనిపోయారు. వెయ్యి మందికి పైగా నల్గొండ జిల్లాలోనే ఉన్నారు. అతి తక్కువ మంది మేడ్చల్ జిల్లాలో ఉన్నారు. ఇక  హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఎనిమిది వందలకు పైగా రైతులు ప్రాణాలు విడిచారు. ఈ రెండు జిల్లాల వారికి వేరే ఉపాధి మార్గాలూ ఉన్నాయి.  కూరగాయలు, పూలు, పాల ఉత్పత్తులతో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అయినా మానసిక ఒత్తిడి గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

కమతాల వారీగా రైతు మరణాలు

భూ విస్తీర్ణం                                         రైతు మరణాల సంఖ్య

అర ఎకరా లోపు                                        3,916

అర ఎకరా నుంచి హెక్టార్ లోపు                      7,521

హెక్టార్ నుంచి ఐదు ఎకరాలు                         2,960

5 నుంచి 10 ఎకరాలు                                  1,319

10 ఎకరాలు, ఆ పైన                                    164

మొత్తం :                                               15,880

జిల్లాల వారీగా రైతు మరణాలు (రైతు బీమా పొందిన కుటుంబాల సంఖ్య ఆధారంగా..)

జిల్లా                                                                చనిపోయిన రైతుల సంఖ్య

ఆదిలాబాద్                                                               460

భద్రాద్రి కొత్తగూడెం                                                      345

జగిత్యాల                                                                 484

జనగాం                                                                   305

జయశంకర్​భూపాలపల్లి                                              188

జోగులాంబగద్వాల                                                     412

కామారెడ్డి                                                                630

ఖమ్మం                                                                   679

కుమ్రంభీం ఆసీఫాబాద్​                                                288

మహబూబాబాద్                                                       352

మహబూబ్​నగర్                                                       538

మంచిర్యాల                                                              284

మెదక్                                                                     568

మేడ్చల్                                                                     59

వరంగల్ (అర్బన్​)                                                       192

యాదాద్రి భువనగిరి                                                    455

ములుగు                                                                 125

నాగర్​కర్నూలు                                                          620

నల్గొండ                                                                   1041

నారాయణపేట                                                           523

నిర్మల్                                                                      457

నిజామాబాద్                                                             554

పెద్దపల్లి                                                                     253

రాజన్నసిరిసిల్ల                                                          271

రంగారెడ్డి                                                                   660

సంగారెడ్డి                                                                  870

సిద్దిపేట                                                                     623

సూర్యాపేట                                                                508

వికారాబాద్                                                                576

వనపర్తి                                                                     370

వరంగల్ (రూరల్​)                                                       306