ఉక్రెయిన్​కు అమెరికా పంపిన ఆయుధాలను మేం పేల్చేసినం

ఉక్రెయిన్​కు అమెరికా పంపిన ఆయుధాలను మేం పేల్చేసినం

కీవ్: అమెరికా, యూరోపియన్​ దేశాలు ఉక్రెయిన్​కు అందించిన మిలిటరీ ఎక్విప్​మెంట్, ఆయుధాలను రష్యా ధ్వంసం చేసింది. అమెరికా, యూరోపియన్​ దేశాల నుంచి భారీ స్థాయిలో మిలిటరీ ఎక్విప్​మెంట్​ కన్​సైన్​మెంట్​ ఖార్కివ్​ రీజియన్​లోని బోగోదుఖోవ్​ రైల్వే స్టేషన్​కు చేరుకుందని, వాటిని రైల్వే స్టేషన్​లోనే ధ్వంసం చేశామని రష్యా అధికార ప్రతినిధి ఇగోర్ కోనాషెంకోవ్​ శనివారం వెల్లడించారు. వైమానిక దాడులు చేసి 48 యూనిట్ల వెపన్స్, ఇతర మిలిటరీ ఎక్విప్​మెంట్​తో పాటు 280 మంది ఉక్రెయిన్​ జవాన్లను తుడిచిపెట్టేసినట్టు తెలిపారు. ఖార్కివ్​ రీజియన్​లోని స్కోవోరోడ్నికోవో జిల్లాలోని రెండు కమాండ్​ పోస్టులు, అలాగే ఒడెస్సా రీజియన్​లోని మూడు ఆయుధాగారాలు, ఫ్యూయల్​ డిపోలు ఎయిర్ స్ట్రయిక్స్​లో ధ్వంసమైనట్లు ప్రకటించారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్​కు అమెరికా, బ్రిటన్, ఇతర యూరోపియన్​ దేశాలు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాయి. ఆర్థికంగానే కాకుండా మిలిటరీ పరంగానూ సాయం చేస్తున్నాయి. విదేశాల సహాయం వల్లే ఉక్రెయిన్​లో పరిస్థితులు దిగజారుతున్నాయని, సంక్షోభం కొనసాగుతోందని రష్యా చెబుతోంది. 

మరియుపోల్​ నుంచి 50 మంది తరలింపు

ఉక్రెయిన్–రష్యా వార్​లో కేంద్ర బిందువుగా ఉన్న మరియుపోల్​లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అజోవ్​స్టల్​ స్టీల్ ప్లాంట్​ను చేజిక్కించుకోవడానికి రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే లోపల బంకర్లు, టన్నెల్స్​లో దాకున్న ఉక్రెయిన్​ సైనికులు రష్యా ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. మరోవైపు స్టీల్​ ప్లాంట్​ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్లాంట్​ లోపల చిక్కుకుపోయిన దాదాపు 50 మందిని శుక్రవారం మరియుపోల్​ దాటించారు. వీరిని ఐక్యరాజ్యసమితి, ఇంటర్నేషనల్​ రెడ్​క్రాస్​ ప్రతినిధులకు అప్పగించారు. ఈ గ్రూప్​లో 11 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు రష్యన్ సైనికులు చెప్పారు. కాగా, ఉక్రెయిన్​లో తాజా పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్​లో శాంతి నెలకొనాలంటూ యూఎన్ సెక్రెటరీ జనరల్​ ఆంటోనియో గుటెరస్​ చేస్తున్న ప్రయత్నాలకు ఐక్యరాజ్యసమితి సెక్యురిటీ కౌన్సిల్​ మద్దతు తెలిపింది.

డ్రోన్లతో ఉక్రెయిన్ ఆర్మీ ఎదురుదాడి

రష్యాతో పోరాటంలో ఉక్రెయిన్​ అత్యున్నత స్థాయి టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇందుకోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది. సోవియన్​ యూనియన్​ కాలంనాటి ఆర్కేజీ 3 యాంటీ ట్యాంక్ గ్రనేడ్లను మాడిఫై చేసి డ్రోన్ల సాయంతో రష్యన్​ ట్యాంకర్లపై వదులుతోంది. ఇందుకోసం అత్యాధునిక 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని వాడుతోంది. కాలం చెల్లిన ఈ గ్రనేడ్లకు 3డీ ప్రింటెడ్​ ప్లాస్టిక్ పిన్స్​ను అటాచ్​ చేస్తోంది. ఎలాంటి చప్పుడు, హెచ్చరికలు లేకుండా డ్రోన్ల నుంచి జారవిడవగానే ఈ పిన్స్ ధ్వంసమై గ్రనేడ్లు పేలుతున్నాయి. రష్యన్​ ట్యాంకర్లలో ఎలాంటి రక్షణా లేకుండా ఉంటున్న సైనికులను ఇవి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో డ్రోన్లు ఎటునుంచి వచ్చి బాంబులు జార విడుస్తాయో అనే ఆందోళన రష్యన్​ సైనికులను పట్టిపీడిస్తోంది.