దోమల​ బెడద డెంగీ భయం​.. సిటీలో తగ్గిన వానలతో పెరిగిన దోమల తీవ్రత

దోమల​ బెడద డెంగీ భయం​.. సిటీలో తగ్గిన వానలతో పెరిగిన దోమల తీవ్రత
  • దోమలున్న ఏరియాల్లో నిలబడలేని పరిస్థితి  
  • 25వేల బ్రీడింట్ పాయింట్లు గుర్తింపు
  • హాస్టల్స్ ఉన్న చోట అధికంగా డెంగీ కేసులు 
  • ఈ నెలలో ఇప్పటి వరకు 68 నమోదు   
  • ఫోకస్ పెట్టిన బల్దియా ఎంటమాలజీ

హైదరాబాద్, వెలుగు: సిటీలో దోమల దండయాత్ర మొదలైంది. వానలు తగ్గడంతో వాటి తీవ్రత పెరిగింది. కొద్దిరోజుల కిందట కురిసిన వర్షాలతో వరదనీరు, మురుగు నిల్వ ప్రాంతాల్లోనే దోమల బెడద ఎక్కువగా ఉంది. గ్రేటర్​లోని చాలా ప్రాంతాల్లో  మస్కిటో నెట్, కాయిల్స్ , మస్కిటో బ్యాట్ లాంటి తదితర రక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు డెంగీ కేసులు కూడా నమోదవుతుండగా జనాల్లో ఆందోళన నెలకొంది. ప్రతిఏటా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే భారీగా కేసులు వస్తుంటాయి. మూడేళ్లుగా డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలను బల్దియా హాట్ స్పాట్లుగా గుర్తించింది. దోమల బ్రీడింగ్ పాయింట్లను నిర్ధారించింది. సిటీలో 4,850 కాలనీల్లో దోమల నియంత్రణపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. డెంగీ కేసులు 24 గంటల్లో ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలపైనా ఫోకస్ పెట్టింది. ఇటీవల దోమల వ్యాప్తిపై బల్దియా ఎంటమాలజీ విభాగం సర్వే నిర్వహించింది. అధికంగా కూలర్ల ద్వారానే దోమలు వ్యాప్తి చెందినట్లు గుర్తించింది. ఇక్కడే 70 శాతం వృద్ధి చెందుతున్నాయని, మిగతావి టైర్లలో నీరు చేరడం, డ్రమ్ములు, కులాయిల్లో నీరు ఉంచడంతో వ్యాప్తి చెందుతున్నట్లు తేల్చింది. రెండేళ్లుగా దోమల నివారణకు బల్దియా రూ.40కోట్లు ఖర్చు చేసింది.

25 వేల బ్రీడింగ్ పాయింట్ల గుర్తింపు 

 మూడేళ్లుగా  డెంగీ, మలేరియా కేసులు నమోదైన ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా బల్దియా ఎంటమాలజీ అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో దోమల వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదముందని ముందస్తుగా ప్రకటించారు.  4,850 కాలనీల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. తాళాలు వేసిన 8 వేల ఇండ్లలో, 8,200  ఓపెన్ ప్లాట్లలో,  5,900 సెల్లార్లలో,  ఫంక్షన్ హాల్స్​, కన్ స్ట్రక్షన్ ఏరియాలు, 6,700 ప్రాంతాలు, 5వేల లోతట్టు ప్రాంతాల్లో  తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అన్ని పాంత్రాలు కలిపితే 25వేల  బ్రీడింట్ పాయింట్లు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తేల్చారు. ఆయా ప్రాంతాల్లో దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటామంటున్నారు.

హాస్టల్స్ ఉన్న చోటనే  ఎక్కువగా..

సిటీలోని బస్తీలు, కాలనీలతో పాటు మురుగు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమల వ్యాప్తి ఎక్కువైతుంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సాయంత్రమైతే బయట తిరగలేని పరిస్థితి ఉంది. మరోవైపు డెంగీ కేసులు నమోదవుతుండగా జనాల్లో ఆందోళన నెలకొంది. ఈనెలలో  ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. ఇవి ఎక్కువగా అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, దిల్ సుఖ్​నగర్, గోల్కొండ తదితర ప్రాంతాల నుంచి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో అధికంగా హాస్టల్స్ లో ఉండే స్టూడెంట్స్​నే డెంగీ బారిన పడుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 632  డెంగీ కేసులు వచ్చాయి. గత నెలలో 312 ,  ఈనెల 9 రోజుల్లో 68  కేసులు నమోదయ్యాయి. గతేడాది జిల్లాలో  38,274  కేసులు నమోదుకాగా, జులైలో 318, ఆగస్టులో 1,020 కేసులు వచ్చాయి.  

 యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తున్నం

దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్ చేపడుతున్నాం. గతేడాదితో పోలిస్తే ఈసారి దోమల బెడద తక్కువగా ఉంది. డెంగీ కేసుల సంఖ్య కూడా తగ్గింది. కేసులు వచ్చిన ప్రాంతాల్లో 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటున్నం. యాంటిలార్వా, పైరత్రామ్, ఐఆర్ఎస్​  స్ప్రే, ఫాగింగ్, చెరువులు, కుంటల వద్ద డ్రోన్ల ద్వారా చల్లుతున్నాం.  ప్రతి శుక్రవారం స్కూల్స్, కాలేజీల్లో యాంటీ లార్వా ఆపరేషన్ చేస్తున్నం. 

 డాక్టర్​ రాంబాబు,  జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజీ