పరిచయం : పేరు తెచ్చిన సీరియల్.. అవకాశాలకు అడ్డుపడింది..

పరిచయం : పేరు తెచ్చిన సీరియల్.. అవకాశాలకు అడ్డుపడింది..

రోషిణి హరిప్రియన్.. ఓ తమిళ అమ్మాయి. ఒకే ఒక్క సీరియల్​తో తమిళనాట పాపులర్ అయింది. ఎంతలా అంటే ఆ సీరియల్​లో​ టైటిల్​ రోల్ చేయడంతో ప్రేక్షకులు ఆమెను ఆ పేరుతోనే గుర్తుపెట్టుకున్నారు. కానీ, అంత పేరు తీసుకొచ్చిన సీరియల్​ క్యారెక్టరే, సినిమాల్లో అవకాశాలు రాకుండా కొంతకాలం ఆపింది. ఆ తర్వాత మాత్రం వచ్చిన అవకాశాలను వదులుకోకుండా నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ స్టార్ట్ చేసింది. ఇండస్ట్రీకి వచ్చి కొంతకాలమే అయినా ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటోంది రోషిణి. ప్రస్తుతం ‘మద్రాస్ మ్యాట్నీ’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తనకు ఆ పాత్ర రావడం గోల్డెన్ చాన్స్ అంటోంది. ఆ సినిమా విశేషాలతోపాటు తన పర్సనల్ లైఫ్​ గురించి కూడా తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

తమిళనాడులోని చెన్నైలో పుట్టిన రోషిణి అక్కడే సెయింట్ మేరీస్ స్కూల్​లో చదివింది. తర్వాత ఎతిరాజ్ ఉమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఎంబీఎ పూర్తయ్యాక ఐటీ కంపెనీలో జాబ్ చేసింది. అది మానేశాక బిజినెస్ మొదలుపెట్టింది. ఆన్​లైన్​లోనూ బిజినెస్ రన్ చేసింది. దాంతోపాటు మోడలింగ్ కూడా చేసింది. అలా పలు కమర్షియల్ యాడ్స్​లో నటించింది. అనుకోకుండా ఆమె ప్రయాణం యాక్టింగ్ వైపు మళ్లింది. ‘‘యాక్టర్​ని కాకపోయి ఉంటే ఎంట్రప్రెన్యూర్​ని అయ్యేదాన్ని. ఇండస్ట్రీలోకి చాలామందిలాగే నా జర్నీ కూడా యాక్సిడెంటల్​గా మొదలైంది. 

నిజానికి నేను మొదట జాబ్​ చేశాను. ఆ తర్వాత లేట్​గా మోడలింగ్​లోకి ఎంటర్​ అయ్యాను. నిజానికి ఆ ఫొటోషూట్ నాకొక ఎక్స్​పరిమెంట్​లానే జరిగింది. ఆ టైంలో నన్ను చూసిన ఒక సీరియల్ టీం.. నాకు ‘కన్నమ్మ’ పాత్ర ఆఫర్​ చేశారు. అలా అనుకోకుండా వచ్చినా.. ఏ అవకాశాన్ని నేను వదులుకోవాలనుకోలేదు. నా బెస్ట్​ నేను ఇవ్వాలనుకున్నా. నా లైఫ్​లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ అదే” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

భారతి కన్నమ్మ ఒక బ్రాండ్​

‘భారతి కన్నమ్మ’ సీరియల్​లో ఉండే ఒక పాత్ర. తను నల్లగా ఉండడం వల్ల సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ పాత్ర నాకు టీవీలోనే కాదు.. సీరియల్ చూడని వాళ్లు కూడా గుర్తించేలా చేసింది. ‘‘మొదటి ప్రాజెక్ట్​లోనే లీడ్ రోల్ రావడం అంత ఈజీ కాదు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. టీవీ ఆడియెన్స్​ కూడా సీరియల్స్​లో కనిపించే పాత్రల్ని తమ నిజజీవితానికి అన్వయించుకుంటారు. ఆ పాత్రలకు అంతగా కనెక్ట్ అవుతారు. వాళ్లు నన్ను కూడా అలానే యాక్సెప్ట్ చేయాలని కోరుకున్నా. 

ప్రస్తుతం ఎన్నో సీరియల్స్ ఉన్నప్పటికీ  నాకు ఆడియెన్స్ ప్రత్యేక స్థానం ఇచ్చారు. వాళ్లకోసం నేను ఇంకా కష్టపడాలి అనిపిస్తుంటుంది. ప్రస్తుతం బాధ్యతతో పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నా. అలాగే పాత్ర డిమాండ్ చేస్తే తప్ప ఎవరినైనా తన కలర్ చూసి రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఇక నిజజీవితంలో స్కిన్ కలర్ విషయానికొస్తే..  ప్రతి ఒక్కరూ సవాళ్లు ఎదుర్కొంటారని కాదు. ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటుంది. అలాంటి వాళ్లకు నేనిచ్చే సలహా ఏంటంటే.. సహనంతో ఉండండి. పాజిటివ్​గా ఆలోచించండి. కష్టపడండి.’’ 

మద్రాస్ మ్యాట్నీ.. గోల్డెన్ చాన్స్

‘‘ఒక మధ్యతరగతి కుటుంబంలో మొదటి సంతానంగా అమ్మాయి పుడితే ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? పెద్దమ్మాయిగా తనకంటే చిన్నవాళ్లైన తోబుట్టువులను ఎలా చూసుకోవాలి? అనే అంశాలపై కథ నడుస్తుంటుంది. ఈ సినిమా ప్రతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది. ఇలాంటి అక్క, తమ్ముడు, నాన్న.. మనలో కూడా ఉన్నారని గుర్తొస్తుంది. కథ విన్నప్పుడు నాక్కూడా అలానే అనిపించింది. 

కచ్చితంగా ఈ సినిమాలో నటించాలని అప్పుడే అనుకున్నా. వెంటనే ఓకే చేశా. ఇందులో తండ్రే హీరో. నా తండ్రి పాత్రలో కాళీ వెంకట్​ నటించారు. ఆయన సీన్స్ చాలా బాగుంటాయి. తమ్ముడి పాత్రలో చేసిన విశ్వ నటన చూస్తే నిజంగానే బ్రదర్ ఫీలింగ్ వచ్చింది. సినిమా మొత్తం ఎమోషనల్​ రైడ్​లా ఉంటుంది. 

నేనేమీ కెరీర్​ని ప్లాన్​ చేసుకోలేదు. వచ్చిన అవకాశాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నా. అందరిలానే నేనూ ఒక మంచి కథలో నటించాలనుకుంటూ ఉంటాను. అలా వచ్చినవాటిలో ‘మద్రాస్ మ్యాట్నీ’ నాకు గోల్డెన్​ చాన్స్. ఈ కథలో పాత్రలు చాలా నేచురల్​గా కనిపించాలి అని వాళ్లు అనుకున్నారు. నేను సీరియల్​లో చేసినప్పుడు ఒక లుక్​లో కనిపించాను. సినిమాకు సీరియల్​కు డిఫరెన్స్ తెలియాలి. పైగా ఒక కుటుంబంలోని పాత్రలు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకని, నేను ఆ క్యారెక్టర్​కి సరిపోతానా? లేదా? మొదట్లో టీం నన్ను పాత్రకు తగ్గట్టు రెడీ అవ్వమని చెప్పారు. 

అయితే డైరెక్టర్​ చాలా కాన్ఫిడెంట్​గా యాక్టర్స్ వీళ్లే ఉండాలి అని ఫిక్స్ చేశారు. నా మీద నాకంటే అతనికే ఎక్కువ నమ్మకం ఉంది. దాంతో నా ఆడిషన్​ తీసుకున్నారు. వెంటనే సెలక్ట్ కావడంతో అప్పటివరకు ఉన్న టెన్షన్ నుంచి చాలా రిలీఫ్​ అయ్యాను. నా పాత్రకు కూడా ప్రియారిటీ ఇచ్చారు. అప్పటి నుంచి నా ఆలోచన మారిపోయింది. నేను వినాలనుకుంటున్న కథలు కాకుండా వాళ్లు తయారుచేసిన కథలో ఒక పాత్రగా నేను ఇమిడిపోవాలి. అలాంటి పాత్రల్లో కనిపించాలనుకుంటున్నా.’’  

పేరెంట్స్ సపోర్ట్ ఇలా ఉంటే..

‘‘ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి అమ్మాయి పెండ్లి చేసుకోవాలి అని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేస్తుంటారు. కానీ, అది వాళ్ల సొంత నిర్ణయం కాకపోవచ్చు. ఎందుకంటే సొసైటీ ప్రెజర్ వల్ల ఇంట్లోవాళ్లు మనల్ని ఇబ్బందిపెడుతుంటారు. అలాకాకుండా ఒక్కసారి పేరెంట్స్ కూడా ఆలోచించి..  ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా సాధించాలి అనుకుంటున్నావా? ఎంత టైం కావాలి? ఎప్పుడు పెండ్లి చేసుకుంటావు? అని తమ పిల్లల ఇష్టాలను తెలుసుకోవాలి. వాళ్ల ఆలోచనలను పంచుకోవాలి. వాళ్ల నిర్ణయాలకూ విలువనివ్వాలి. అలాంటి సపోర్ట్ ప్రతి పేరెంట్​ వాళ్ల పిల్లలకు ఇస్తే.. వాళ్ల కెరీర్ చాలా బాగుంటుంది. 

లైఫ్​లో ఏదైనా సాధించడానికి వీలవుతుంది. చుట్టుపక్కలవాళ్లు, చుట్టాలు.. పదే పదే అడుగుతున్నారని వాళ్లకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడిపోయి, పిల్లలపై ఒత్తిడి పెంచడం సరికాదు. అనుకోగానే అన్నీ జరగవు. దేనికైనా సరైన టైం రావాలి. అది అర్థం చేసుకుంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. ఆ సపోర్ట్ మా ఇంట్లో ఉంది కాబట్టే నేను యాక్టింగ్​లో ముందుకెళ్లగలుగుతున్నా” అంటోంది రోషిణి.

స్ట్రగుల్స్ ఫేస్ చేశా...

‘భారతి కన్నమ్మ’ సీరియల్​తో నాకు చాలా మంచి పేరు వచ్చింది. అదొక బ్రాండ్ అయిపోయింది. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత నుంచి నాకు ఒత్తిడి పెరిగింది. అందరూ నన్ను చూసి ఫలానా సీరియల్​లో కన్నమ్మ అని గుర్తించేవాళ్లు. కానీ, నా పేరు రోషిణి, ఇతర పాత్రల్లోనూ చేస్తాను అనేది మర్చిపోయారేమో అనిపించింది. నా లైఫ్ ఏంటి? ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అవకాశాల కోసం తిరిగితే రేపు, ఎల్లుండి.. నెల తర్వాత రండి అని చెప్పి పంపేవాళ్లు. ఆదాయం లేకుండా నేను పొదుపు ఎలా చేయగలను?

మోస్ట్​ డిజైరబుల్ విమెన్.. 

2019లో ‘భారతి కన్నమ్మ’ అనే సీరియల్​లో కన్నమ్మగా యాక్ట్ చేసింది. ఆ సీరియల్​కి 2021లో మోస్ట్ ఫేవరెట్​ అండ్ బెస్ట్ హీరోయిన్ ఆన్ టెలివిజన్ కేటగిరీలో విజయ్ టెలివిజన్ అవార్డు అందుకుంది. ఆ సీరియల్​ హిట్​ కావడంతో తర్వాత రోషిణికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి కాస్ట్​ అనౌన్స్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అది పక్కనపెడితే, ఆ తర్వాత షార్ట్​ ఫిల్మ్స్, కమర్షియల్ అడ్వర్టైజ్​మెంట్స్​లోనూ కనిపించింది. మ్యూజిక్ వీడియోల్లోనూ మెస్మరైజ్ చేసింది ఈ అమ్మాయి. 2022లో ‘కుకు విత్ కోమాలి’ అనే టెలివిజన్ షోకి మూడో సీజన్​లో ఎంట్రీ ఇచ్చింది. 

ఆ షోలో తన పర్ఫార్మెన్స్​తో అందర్నీ ఆకట్టుకున్న ఆమె ఫైనల్స్​ వరకు వెళ్లింది. అంతేకాదు.. 2019, 2020 ఈ రెండేండ్ల పాటు ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ మోస్ట్​ డిజైరబుల్ విమెన్ ఇన్ ఇండియన్ టెలివిజన్​ జాబితాలో ఆమె పేరు కొనసాగింది. 2024లో తమిళ కమెడియన్ హీరోగా నటించిన ‘గరుడన్’​ అనే సినిమాలో ఉన్ని ముకుందన్​ అనే మరో నటుడికి భార్యగా కనపడింది. ఆ సినిమా తమిళంలో సక్సెస్ కావడంతో అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం ‘మద్రాస్ మ్యాట్నీ’ సినిమాలో మరో మంచి పాత్ర చేసింది. రాబోయే ‘తలైవన్ తలైవి’ సినిమాలోనూ ఓ పాత్రలో కనిపించనుంది.