
- ఏపీకే ఫైల్స్ షేర్ చేస్తరు.. ఇన్ స్టాల్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తరు
- మనం ఓటీపీలు చెప్పకున్నా.. అకౌంట్లు ఖాళీ అవుతయ్
- వాట్సాప్ డీపీల్లో ఒరిజినల్ లా లోగోలు.. గ్రూపుల్లో ఏపీకే లింకులు సర్క్యులేట్
- సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయ్యొద్దు: సైబర్ నిపుణులు
- మొబైల్ ఫోన్లలో M-–Kavach 2 యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి
- మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: సైబర్ మోసగాళ్లు రూట్ మార్చారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరిగి ఓటీపీలు చెప్పకుండా జాగ్రత్త పడుతుండటంతో ఏకంగా మొబైల్ ఫోన్లనే హ్యాక్ చేస్తున్నారు. ఇందుకోసం ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైళ్ల రూపంలో మాల్‌వేర్‌ను పంపి సెల్‌ఫోన్లలోకి చొరబడుతున్నారు. ఆ తరువాత మొబైల్ ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుని బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఇందులో ప్రస్తుతం పీఎం కిసాన్ యోజనను టార్గెట్ చేశారు. PM KISAN.apk, SBI YONO.apk పేరుతో లింకులు పంపించి అందినంత దోచేస్తున్నారు. అలాగే ఎస్‌బీఐ సహా జాతీయ బ్యాంకుల సింబల్స్‌తో యోనో వీఐపీ రివార్డ్ పాయింట్స్, క్రెడిట్ స్కోర్ పాయింట్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీంలు అంటూ ఆశచూపి గాలం వేస్తున్నారు. ఈ కామర్స్ సైట్స్, ఈవెంట్స్ పేరుతో బంపర్ ఆఫర్లు అంటూ మోసం చేస్తున్నారు. ఈజీగా ట్రాప్‌లో పడేలా ఆయా స్కీంలు, ఆఫర్ల పేరిట మోసపూరిత ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. వీటిని క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్న వారి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి, అందినకాడికి దండుకుంటున్నారు.
టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రతిఒక్కరి చేతిలో అధునాత వైర్షన్లతో సెల్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కుప్పలు తెప్పలుగా వస్తున్న మొబైల్ యాప్స్‌తో క్షణక్షణం స్మార్ట్‌ఫోన్లకే హత్తుకుపోతున్నారు. ఒక్క రూపాయి మొదలు ఎన్ని లక్షలైనా సరే క్షణాల్లోనే డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. దీంతో పత్రి బ్యాంక్ అకౌంట్, గూగుల్ పే, పేటీఎం సహా పేమెంట్స్ యాప్స్‌కు సంబంధించిన సీక్రెట్ పిన్ నంబర్లు, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు సహా ఆన్‌లైన్ లావాదేవీలకు చెందిన ప్రతి సమాచారం మొబైల్ అప్లికేషన్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. అయితే ఇలాంటి ఓటీపీల కోసమే సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఓటీపీలు చెప్తే మోసపోతామని ప్రజల్లో అవగాహన పెరగడంతో.. స్మార్ట్ ఫోన్లనే స్మార్ట్‌గా హ్యాక్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీకే ఫైల్స్ లింకులను సర్క్యులేట్ చేస్తున్నారు.
వాట్సాప్, టెలిగ్రామ్, ఎఫ్బీ గ్రూపుల్లో షేర్..
మొబైల్ ఫోన్లను హ్యాక్ చేయడం అంత తేలిక కాదు. ఆండ్రాయిడ్ ఫోన్లలో సంబంధిత కంపెనీ అందించే అప్లికేషన్లు, గూగుల్ ప్లేస్టోర్ లోని (దాదాపు 90 శాతం) యాప్స్ సురక్షితంగా ఉంటాయి. అవి కాకుండా సోషల్ మీడియా, థర్డ్ పార్టీ వెబ్సైట్ల నుంచి అనధికారిక యాప్స్ డౌన్ లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేస్తే తప్ప ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం లేదు. దీన్నే సైబర్ నేరగాళ్లు అదనుగా తీసుకున్నారు. ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఫైల్ ఫార్మాట్‌తో రూపొందించిన ప్రమాదకరమైన మాల్‌వేర్ ను మొబైల్ ఫోన్లోకి ప్రవేశపెట్టే విధంగా లింకులు పంపిస్తున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ సహా సోషల్ మీడియాలో వీటిని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇలాంటి లింకును క్లిక్ చేసి, ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న సమయంలో ఇందులో ఉన్న యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతున్న సమయంలో కాంటాక్టులు, గ్యాలరీతో పాటు అన్ని అనుమతులు సెల్ ఫోన్ యూజర్ ప్రమేయం లేకుండా దానంతట అదే తీసుకుంటుంది. కొన్ని యాప్స్ పర్మిషన్లు కూడా అడుగుతాయి. అనుమతులు ఇవ్వకపోయినా ఇన్‌స్టాల్ అవుతాయి.
ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే ఇక అంతే
సోషల్ మీడియాల్లో వచ్చే ఏపీకే ఫైల్స్ లింకుల గురించి అవగాహన లేని కొందరు ఆ లింకులను క్లిక్ చేస్తుండడంతో పాటు వాటిని తెలిసిన వారికి ఫార్వర్డ్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్ట్ చేస్తున్నారు. నిజమని నమ్మి కొందరు ఏపీకే లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. దీంతో వారి మొబైల్‌లో ఉన్న సమాచారం, వీడియోలు, ఫొటోలు, బ్యాంకు అకౌంట్లు, మెసేజ్‌లు, వాట్సాప్ సహా స్మార్ట్‌ఫోన్ మొత్తాన్ని హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయిన ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలతో అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు.
ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయొద్దు..
సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్(.apk) లింకులను ఎట్టి పరిస్థితిలోనూ క్లిక్ చేయొద్దు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లోనూ కొన్ని యాప్ లు స్కామర్లు సృష్టించినవి ఉంటాయి. స్మార్ట్ ఫోన్‌లోని సెట్టింగ్‌లో ఇన్‌స్టాల్ ఫ్రం అన్‌నోన్ సోర్సెస్(తెలియని వెబ్ సైట్ల నుంచి) అనే ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలి. దీంతో మన అనుమతి లేకుండా యాప్స్ ఇన్‌స్టాల్ కావు. ఏపీకే ఫైల్, మాల్‌వేర్ ఇన్‌స్టాల్ జరిగినట్లు అనుమానం వస్తే మొబైల్ రీసెట్ చేయాలి. ఆ వెంటనే బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన పిన్ నంబర్లు, పాస్‌వర్డులు మార్చుకోవాలి. M KAVACH2 యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని స్కాన్ చేస్తే మొబైల్ డివైజ్ సెక్యూర్‌గా ఉంటుంది.
- విశ్వనాథ్, ఎథికల్ హ్యాకర్, హైదరాబాద్
వెంటనే 1930కి కాల్ చేయాలి..
ఏపీకే ఫైళ్లతో పాటు సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే లింకులు ఓపెన్ చేస్తే.. ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్తుంది. ఏపీకే వంటి యాప్‌లను ఇన్ స్టాల్ చేస్తే.. ఓటీపీలు చెప్పకున్నా అకౌంట్లు ఖాళీ చేస్తారు. సైబర్ క్రిమినల్స్ బారిన పడిన బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. లేదా http://cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. కవిత, డీసీపీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్
హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన సురేశ్‌కు జూన్ 22న వాట్సాప్ గ్రూప్‌లో పీఎం కిసాన్ యోజన పేరిట ఓ ఏపీకే ఫైల్ వచ్చింది. అది ఓపెన్ చేసి, తన తల్లి ఆధార్ కార్డు అప్డేట్ చేసేందుకు ఇన్‌స్టాల్ చేశాడు. ఫోన్ ఒక్కసారిగా హీట్ అయ్యింది. అతని ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆ తరువాత 22 , 23, 24 తేదీల్లో పలు దఫాలుగా మొత్తం రూ. 1,38,800 కొల్లగొట్టారు. సిమ్ కార్డును కూడా క్లోనింగ్ చేసి.. అతని కాంటాక్ట్స్, వాట్సాప్ గ్రూపులలో ఆ ఏపీకే ఫైల్‌ను షేర్ చేశారు. దీంతో బాధితుడు సురేశ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని, వెంటనే రూ.1,000 జరిమానా కట్టాలంటూ సికింద్రాబాద్‌కు చెందిన ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్‌కు ఈ నెల 6న మేసేజ్ వచ్చింది. "e-parivahan.apk" అనే ఏపీకే ఫైల్‌ను పంపించారు. దానిని డౌన్‌లోడ్ చేసుకుని, అందులో చలానా చెల్లించాలని సూచించారు. ఇది నిజమని నమ్మిన ఆయన ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేశాడు. ఆ వెంటనే ఎలాంటి ఓటీపీ లేకుండా కల్నల్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు నుంచి రెండు దఫాలుగా అమెజాన్ పే ఇండియా లిమిటెడ్‌కు రూ.1,20,409 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన కల్నల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.