
- గన్‌మెన్ చేతిలోంచి గన్ లాక్కునే యత్నం
- మల్లన్న గది తలుపులను బద్దలు కొడుతుండగా..
- గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన గన్‌మెన్
- తోపులాటలో తీన్మార్ మల్లన్న చేతికి గాయం
- పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడితోపాటు మరో ఇద్దరు?
- ఇరువర్గాల ఫిర్యాదులు.. కేసులు నమోదు
అక్కడున్న ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. గన్మెన్లు అడ్డుకోగా.. వారిపైనా చేయి చేసుకున్నారు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న లోపలి గదిలో ఉండగా ఆయన వైపు దూసుకువెళ్లేందుకుప్రయత్నించారు. దీంతో ఓ గన్‌మ్యాన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా జాగృతి కార్యకర్తలు అక్కడున్న అద్దాలన్నీ పగలగొట్టారు. అద్దం ముక్కలు మీదపడి 8 మంది మల్లన్న స్టాఫ్‌కు, అద్దాలు పగలగొట్టే క్రమంలో సుమారు 10 మంది జాగృతి కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఆఫీసులోని గదులు రక్తపు మరకలతో నిండిపోయాయి.
వీడియో తీయబోయిన మహిళపైనా దాడి
ఉదయం 11 గంటలకు క్యూ న్యూస్ ఆఫీస్‌కు వచ్చి ఆందోళనకు దిగి జాగృతి కార్యకర్తలను అక్కడున్న ఓ గన్‌మ్యాన్ అడ్డుకోవడంతో ఆయనపై దాడి చేశారు. గన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. తర్వాత గన్‌మ్యాన్, స్టాఫ్‌ను నెట్టేసుకుంటూ లోపలికి చొచ్చుకొచ్చి.. పలు వస్తువులను ధ్వంసం చేశారు. మల్లన్న ఏ చాంబర్లో ఉన్నారో కనుక్కుని ఆ వైపుగా దూసుకువెళ్లారు. మల్లన్నను కలవడానికి వచ్చిన ఓ బాధితురాలు దీన్నంతా వీడియో తీయడానికి ప్రయత్నించగా.. ఆమెపైకి కుర్చీ విసిరేశారు. ఆమె భయపడి బాత్రూంలోకి వెళ్లి దాక్కుంది. మల్లన్న చాంబర్ వద్దకు వెళ్లిన జాగృతి కార్యకర్తలు తలుపు పెట్టి ఉండడంతో బాదారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో అక్కడే ఉన్న మల్లన్న మరో గన్‌మ్యాన్ గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా, జాగృతి కార్యకర్తలు తలుపులు పగలగొట్టడానికి ప్రయత్నించారు. దీంతో లోపల్నుంచి మల్లన్న, మరో ఇద్దరు తలుపులను గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమంలో మల్లన్న చేతికి గాయమైంది.
పోలీసుల ఎంట్రీతో..
జాగృతి కార్యకర్తల దాడి గురించి తీన్మార్ మల్లన్న స్టాఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న జాగృతి కార్యకర్తలు పారిపోయారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజా రాణి, మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలు సేకరించింది. గాయపడ్డ మల్లన్నను చికిత్స కోసం ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారాణి.. ఏం జరిగిందని మల్లన్నతో పాటు అక్కడి స్టాఫ్‌ను వివరాలడిగి తెలుసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారెవరైనా, ఎంతటి హోదాలో ఉన్న కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా, తీన్మార్ మల్లన్న ఆఫీసులో దాడికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.
బీఆర్ఎస్ సైలెంట్..
క్యూ న్యూస్‌పై కల్వకుంట్ల కవిత అనుచరులు దాడి చేయడం, తాము శాంతియుత నిరసనకు వెళ్తే తమపైనే దాడికి దిగారని కవిత ఆరోపించడం వంటి పరిణామాలపై ఆమె సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. మల్లన్నను సస్పెండ్ చేయాలంటూ కవిత మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు డీజీపీ ఆఫీసుకు వచ్చి ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట ఒక్క బీఆర్ఎస్ నేత కానీ, కార్యకర్త కానీ రాలేదు. ఎప్పటిలానే జాగృతి ప్రతినిధులే ఉన్నారు.