డేటా సైన్స్‌‌లో బొచ్చెడు జాబ్స్‌‌

V6 Velugu Posted on Mar 30, 2021

  • ఆన్‌లైన్ బిజినెస్‌లతో ఫుల్ డిమాండ్

డేటా సైన్స్‌‌ ప్రొఫెషనల్స్‌‌కు ఎంతో డిమాండ్‌‌ ఉన్నప్పటికీ, తగినంత మంది దొరకడం లేదు. డేటా సైన్స్‌‌ స్కిల్స్‌‌ ఉన్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని కంపెనీలు చెబుతున్నాయి. 3–10 ఏళ్ల వరకు అనుభవం ఉన్న వారికి ఏటా రూ.25లక్షల నుంచి రూ.65 లక్షల వరకు ప్యాకేజ్‌‌ ఇస్తున్నారు. రూ.కోటి ప్యాకేజీ తీసుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. 

న్యూఢిల్లీ: కరోనా లాక్‌‌డౌన్‌‌ వల్ల జనం ఇండ్లకే పరిమితం అయ్యారు. అప్పుడు బయటికి వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. దీంతో ఆన్‌‌లైన్‌‌పై ఆధారపడటం ఎక్కువయింది. పేమెంట్స్‌‌, షాపింగ్‌‌, రీచార్జ్‌‌లకు ఆన్‌‌లైన్‌‌ మార్గాలను వాడే సంఖ్య విపరీతంగా పెరిగింది. డిజిటల్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌లను డెవలప్‌‌ చేయడంలో, సమాచారాన్ని ఎనలైజ్‌‌ చేయడంలో డేటా సైంటిస్టుల పాత్ర కీలకం కాబట్టి వీరికి గిరాకీ బాగా పెరిగింది. 3–-10 ఏళ్ల వరకు అనుభవం ఉన్న వారికి ఏటా రూ.25లక్షల నుంచి రూ.65 లక్షల వరకు జీతం ఇస్తున్నారు. కొన్ని కంపెనీల్లో రూ.కోటి తీసుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇంత డిమాండ్‌‌ ఉన్నప్పటికీ డేటా సైన్స్‌‌ ప్రొఫెషనల్స్‌‌ తగినంత మంది దొరకడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. 15 ఏళ్ల కంటే ఎక్కువ ఎక్స్‌‌పీరియన్స్‌‌ ఉన్న వారికి ఏటా రూ.1.8 కోట్ల ప్యాకేజీలు ఇస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయని రిక్రూట్‌‌మెంట్‌‌ కంపెనీ మైఖేల్‌‌ పేజ్‌‌ ‘2021 ఇండియా ట్యాలెంట్‌‌ ట్రెండ్స్‌‌’ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. కస్టమర్ల డేటాను పరిశీలించడానికి, వారి అభిరుచులను, అలవాట్లను అంచనా వేయడంలో డేటా సైన్స్‌‌ ప్రొఫెషనల్స్‌‌ పాత్ర కీలకం. అయితే వీళ్ల పని చాలా కష్టంగా ఉంటుంది కాబట్టే ఎక్కువ జీతం ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ‘‘డేటా సైన్స్‌‌ ప్రొఫెషనల్స్‌‌కు డిమాండ్‌‌ ఆల్‌‌టైమ్‌‌ హైకి చేరింది. సప్లై మాత్రం తగినంతగా లేదు. డేటా సైన్స్‌‌ స్కిల్స్‌‌ తెలిసిన టెకీల సంఖ్య చాలా తక్కువ. డేటా సైన్స్‌‌ ప్రొఫెషనల్స్‌‌కు జీతంతోపాటు ఇతర ఇన్సెంటివ్స్‌‌, బెనిఫిట్స్ ఇవ్వడానికి కంపెనీలు రెడీగా ఉన్నాయి. ఉన్న ఎంప్లాయిస్‌‌ను కాపాడుకోవడానికి కూడా జీతాలు ఎక్కువ ఇస్తున్నాయి’’ అని మైఖేల్‌‌ పేజ్‌‌ ఇండియా అసోసియేట్‌‌ డైరెక్టర్‌‌ కరణ్‌‌ మద్‌‌హోక్‌‌ వివరించారు. 
తేడా ఏమిటంటే...
డేటా ఇంజనీర్లు, డేటా సైంటిస్టుల మధ్య స్పష్టమైన తేడాలు ఉంటాయి. డేటా జెనరేషన్‌‌ కోసం ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను, ఆర్కిటెక్చర్‌‌ను తయారు చేయడం డేటా ఇంజనీర్ల పని. డేటా సైన్స్‌‌ ప్రొఫెషనల్స్‌‌ అడ్వాన్స్‌‌డ్‌‌ మ్యాథ్స్‌‌పై పనిచేస్తారు. సేకరించిన డేటాతో స్టాటిస్టికల్‌‌ ఎనాలిసిస్‌‌ చేస్తారు. ఆర్టిఫిషియల్‌‌ ఇంటిలెజెన్స్‌‌, ఎనలిటిక్స్‌‌, ఐఓటీ, బ్లాక్‌‌చెయిన్‌‌, క్వాంటమ్‌‌ కంప్యూటింగ్‌‌ వంటి టెక్నాలజీ ఏరియాలకు డేటా సైన్స్‌‌ ప్రొఫెషనల్స్‌‌ కావాలని హన్ డిజిటల్‌‌ అనే కన్సల్టింగ్‌‌ కంపెనీ సీఈఓ శరణ్‌‌ బాలసుందరం అన్నారు. చాలా కంపెనీలు క్లౌడ్‌‌ కంప్యూటింగ్‌‌వైపు మళ్లుతుండటంతో, డేటా సైన్స్‌‌ ప్రొఫెషనల్స్‌‌ అవసరం పెరిగిందని చెప్పారు. డేటా ఇంజనీర్ల కంటే డేటా సైంటిస్టుల జీతాలు 20 శాతం వరకు ఎక్కువ ఉంటాయని, వీళ్లు కొత్త కంపెనీలో చేరితే 45 శాతం వరకు హైక్ అడుగుతారని ఆయన అన్నారు. డేటా సైంటిస్టుల రిక్రూట్‌‌మెంట్‌‌కు దాదాపు 12 వారాలు పడుతుందని వివరించారు. డేటాసైన్స్‌‌లో అవకాశాలను దక్కించుకోవడానికి ఈ కోర్సుల్లో చేరే వారి సంఖ్య గత 12 నెలల్లో 50 శాతం పెరిగిందని జిగ్‌‌సా అకాడమీ తెలిపింది. బిజినెస్‌‌ స్కూల్స్‌‌ ఈ రకం కోర్సులను ఆఫర్‌‌ చేస్తున్నాయి. ఐఐఎంలలో ఇప్పుడు ఆర్టిఫిషియల్‌‌ ఇంటిలెజెన్స్‌‌, ఎనలిటిక్స్‌‌, ఐఓటీ, బ్లాక్‌‌చెయిన్‌‌, క్వాంటమ్‌‌ కంప్యూటింగ్‌‌ కోర్సులకు చాలా ఆదరణ ఉందని బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్‌‌ దినేశ్‌‌ కుమార్‌‌ చెప్పారు.  డేటా సైంటిస్టుల రిక్రూట్‌‌మెంట్లలో ఐటీ కంపెనీలది 40 శాతం వాటా కాగా, మిగతా సెక్టార్లు కూడా వీరిని తీసుకుంటున్నాయి.


 

Tagged market, jobs, opportunities, Industries, online business, requirements

Latest Videos

Subscribe Now

More News