త్యాగంతోనే కాంగ్రెస్​కు యోగం! : ఆర్‌‌‌‌. దిలీప్‌‌‌‌ రెడ్డి

త్యాగంతోనే కాంగ్రెస్​కు యోగం! : ఆర్‌‌‌‌. దిలీప్‌‌‌‌ రెడ్డి

కాంగ్రెస్‌కు కావాల్సిందిపుడు.. కడలిలో కలిసే ముందర నదికి కలిగే జ్ఞానోదయం! అస్థిత్వం పోయే అనివార్య స్థితిలో ‘అయ్యో! నా ఉనికి’అనే శంక వీడి, నది తానే సముద్రమయ్యే సద్యోచన, విశాలత్వ భావన! మరో త్యాగానికి సిద్ధమైతే తప్ప రాజకీయ మనుగడే సందిగ్ధంలో పడ్డ పరిస్థితి కాంగ్రెస్‌ది. భారత్‌ జోడో విజయంతో లభించిన సానుకూలత ఫలించాలన్నా, ‘రాయ్‌పూర్‌’ వేదిక నుంచి సాచిన స్నేహ ‘హస్తం’ అందుకునే వాళ్లు కావాలన్నా కాంగ్రెస్‌ ఇంకో మెట్టు కిందకు దిగాలి. 2024 కి భూమిక సిద్ధం చేయాలి. విపక్ష కూటమికి కేంద్రబిందువుగా ఉండటమంటే... ప్రధాని కుర్చీ మీద ఖర్చీఫ్ వేయటం కాదు, ‘మాకు ఆ పదవేం తప్పనిసరి కాద’ని స్పష్టం చేయాలి. కాంగ్రెస్‌ అంటే పొడగిట్టని ఎన్డీయే బయట నేతల సంఖ్య తగ్గేలా నడచుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి.

కాంగ్రెస్‌ గురించి ఈ దేశంలో అత్యధికులు మాట్లాడేది, కాంగ్రెస్‌ పార్టీ కోసం కానే కాదు! ప్రజాస్వామ్యంలో బలమైన విపక్షం ఉండాలనో, అవసరాల్లో గట్టి ప్రత్యామ్నాయం ప్రజల అందుబాటులోకి రావాలనో కోరుకుంటారు కనుకే... కాంగ్రెస్‌ మంచిచెడుల గురించిన చర్చ! సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ మునుపెన్నడూ లేనంతగా బలహీనపడింది. బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన తర్వాత రాజకీయ ప్రభావం తగ్గింది. అప్పుడప్పుడు కొంత మెరుగుపడుతున్న లక్షణాలు కనిపించినా.. ‘పునరుజ్జీవ సంకేతాలు మరింత పతనపు నడక’ మధ్య ఇదొక నిత్యఘర్షణ. బహుళపార్టీ సమాఖ్య రాజకీయాల్లో ఏదో రోజున అధికారంలో ఉన్న వాళ్లపై ప్రజల్లో గట్టి వ్యతిరేకత వచ్చి, నెగెటివ్‌ ఓటింగ్‌ ద్వారా మనల్ని ఎన్నుకోకపోతారా? అన్న గుడ్డి నిరీక్షణ ఎంత కాలం! దేశం దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ రాజకీయ శక్తులు బలపడ్డాక అదీ గాల్లో దీపమే అయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్​లలో ప్రభుత్వాల్ని నిలబెట్టుకొని, కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో తిరిగి అధికారంలోకి వస్తే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అస్థిత్వం నిలుపుకునేందుకు కాంగ్రెస్‌కు భూమిక దొరికినట్టవుతుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) అన్నట్టు, కనీసం ఓ పది పదిహేనేళ్ల ప్రణాళికతో, పార్టీ అంతర్గత సఖ్యతతో పనిచేస్తే తప్ప, కాంగ్రెస్‌కు మనుగడ లేదు.

అవకాశమున్నా... దిగదుడుపే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి గొప్పగా ఏం లేదు. ఏపీలో, కొత్తగా పోవడానికి పరువుతో సహా కాంగ్రెస్‌కు ఏమీ లేదు. కనీసం కమ్యూనిస్టులతో కలిసి ప్రజా ఉద్యమాలు నిర్మిస్తే, 2029 కి ఏమైనా ఆలోచించొచ్చు! తెలంగాణలో ప్రభుత్వం ఎదుర్కొనే ప్రజా వ్యతిరేకతను సొమ్ముజేసుకోగల వ్యవస్థ ఉండీ కాంగ్రెస్‌ నిస్తేజంగానే ఉంది. అనైక్యత, అంతర్గత విబేధాల వల్ల, బీఆర్‌ఎస్‌ని ఓడించి, ఓ సమర్థ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఇవ్వగలదన్న నమ్మకం జనాల్లో కలిగించలేకపోతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయ్యే ముందు, అయినప్పుడు, అయిన కొత్తలో రేవంత్‌రెడ్డి గ్రాఫ్‌ పైపైకి వెళ్లింది. తర్వాత తగ్గింది. ఆయన ఎందుకో అభద్రతకు గురవుతున్నారు. పార్టీ రేపు అధికారంలోకి వస్తే... ‘సోకాల్డ్‌’ సీనియర్లంతా తనకు వ్యతిరేకంగా ఏకమై, బయటివాడినని అధిష్టానాన్ని నమ్మించి, ముఖ్యమంత్రి కానీయరేమో? అన్నది దిగులు కావచ్చు. అందుకని, ఆయా ‘సీనియర్ల’ రేటింగ్‌ ఇప్పటి నుంచే తగ్గిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రయోజనాలకు విరుద్ధంగా, పాలకపక్షానికి అనుకూలంగా పనిచేస్తున్న ‘కోవర్టులు’ వారని రేవంత్‌ వర్గం చిత్రిస్తోంది. అది కూడా పార్టీకి నష్టమే! వాళ్లూ అలాగే ఉన్నారు. ఇక, బీజేపీని లక్ష్యం చేసి సాగించే ప్రచారం క్లిక్‌ అవటం లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకటే అనే బీజేపీ ప్రచారానికి దాంతో ఊపు లభిస్తోంది. రేపు వారిద్దరూ కలిసిపోతారనే ప్రచారం బీజేపీ సాగిస్తోంది. ఫలితంగా, టీఆర్‌ఎస్‌ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు రాకుండా, బీజేపీ వైపు వెళ్లే ఆస్కారముంది. కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా బీఆర్‌ఎస్‌ను లక్ష్యం చేసుకోవాలనే సూచన వస్తోంది. అది, రేవంత్‌ ఒకరే పాటిస్తున్నారు. కాంగ్రెస్‌లో లోగడా వర్గపోరున్నా, పలుకుబడి గల, ప్రభావశీల నాయకులుండేది, ఇప్పుడు అదీ లేదు. ఇలాంటి తగాదాలతోనే దారుణంగా ఓడి, 26/294 కు పరిమితమైన గడ్డు రోజుల్లో కూడా ‘కాంగ్రెస్‌కు అధికారమేం అవసరం లేదు, మా ఆధిపత్యాలు నిలవటం ముఖ్యం’ అన్న నాటి సిటీ ఎమ్మెల్యే ఒకరి మాటలు నేటి పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ఇదీ కథ!

మూల సూత్రాలని పైకి తేవాలి

ఇటీవలి మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎవరినీ ఆశ్చర్యపరచకపోయినా... కాంగ్రెస్‌పై ఆశల్ని మరింత సన్నగిల్ల జేశాయి. కాంగ్రెస్‌ లౌకిక పునాదులు ఎలా కదిలిపోయాయో, విధానాలెలా వికటిస్తున్నాయో ఈ ఫలితాలు నిదర్శనం. క్రిస్టియన్‌ మైనారిటీలు అధిక జనాభాగా ఉన్న మేఘాలయ(75 శాతం), నాగాలాండ్‌(88 శాతం)లలో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయి, బీజేపీ పటిష్టమవుతున్న తీరు వెల్లడైంది. అరుణాచల్‌ ప్రదేశ్‌(31 శాతం) ఎప్పుడో బీజేపీ వశమైంది. నిజానికి బీజేపీ, దాని ‘హిందుత్వ ఎజెండా’ ప్రతికూలంగా పనిచేసి, కాంగ్రెస్‌కు లాభించాల్సిన ప్రాంతమిది. కానీ, జరిగింది భిన్నం. దేశంలో 2014 బీజేపీ విజయం తర్వాత కాంగ్రెస్‌ తన పటిష్ట లౌకిక విధానానికి తిలోదకాలిచ్చి, హిందూ ఉదారవాదాన్ని నెత్తికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. మైనారిటీల అనుకూల వాదం, మెజారిటీ హిందువుల మనోభావాలకు వ్యతిరేకమని కాంగ్రెసే భావించిందేమో అన్నట్టుంది వారి వ్యవహార శైలి. రాహుల్‌ తానే స్వయంగా శివభక్తుడిని అన్నా, గుడి – గోపురాలు తిరిగినా, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ భారత్‌ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ఉండాలన్నా.. జనం వీటిని ఎన్నికల ఎత్తులుగానే చూశారు తప్ప లాభం ఇవ్వలేదు. మైనారిటీలకు వ్యతిరేకంగా సమీకృతమైన మనోభావనలు బీజేపీ బచ్చెలోనే ఓట్లుగా రాలాయి. అటు మైనార్టీలు ఆశలు పెట్టుకోక, ఇటు మెజారిటీ(హిందూ) వర్గీయులు నమ్మక.. ‘రెంటికి చెడ్డ రేవడి’ అయింది కాంగ్రెస్‌. మరోమారు గాంధేయ లౌకికవాదాన్ని అక్కున చేర్చుకుంటేనే కాంగ్రెస్‌కు ఆదరణ! సామాజికార్థికాంశాల్లో కూడా ‘కాపీ’ విధానమే తప్ప సొంత విధానాలు దారితప్పాయి. విధాన వైఫల్యాలు ఒక వైపు, సంస్థాగతంగా కుమ్ములాటలు, అనైక్యత మరోవైపు... పార్టీ పలుచపడింది. అందుకే, దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో కలిపి 4033 అసెంబ్లీ స్థానాలుంటే, కాంగ్రెస్‌ పార్టీకున్నది 660 ఎమ్మెల్యేలు(16.36 శాతం) మాత్రమే!

వినమ్ర పొత్తులు

గాంధీ -నెహ్రూ కుటుంబం బయటి వ్యక్తి మల్లిఖార్జున ఖర్గేకు కాంగ్రెస్‌ అధ్యక్షస్థానం కట్టబెట్టి ఆ కుటుంబం ఒక త్యాగం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీయే మరో త్యాగం చేయాలి. బలమైన రాజకీయ ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కోలేక చతికిల పడుతున్న కాంగ్రెస్‌ విపక్షాల ఐక్యత సాధించి, దానికి తానే కేంద్ర బిందువు కావాలి. దానికి ‘కర్నాటక ఫార్ములా’ అనుసరించాలి. అతిపెద్ద పార్టీగా అవతరించినా, తక్కువ స్థానాలున్న జేడీఎస్‌కు పట్టంకట్టి, కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేసింది. రేపటి సార్వత్రికంలో విపక్షం గెలిస్తే తానే ప్రధాని పదవి ఆశించే హక్కుదారుననే భావన రానీయకూడదు. ఎన్నికల తర్వాత లభించే సంఖ్యాబలాన్ని, అత్యధికుల ఆమోదాన్ని బట్టి యోగ్యులెవరైనా ప్రధాని కావచ్చనే సంకేతాలు ఇప్పటి నుంచే ఇచ్చి, తాను పెద్దన్న పాత్ర పోషించవచ్చు. ఇటీవలి ఒక సర్వే ప్రకారం చూస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు దేశంలో దక్కేది 68 స్థానాలు. ఆ సంఖ్య కనీసం రెట్టింపయితే తప్ప రాజకీయ ఎజెండాపైకి కాంగ్రెస్‌ రాదు. ఇతర విపక్షాల విశ్వాసం చూరగొనలేదు. ‘కాంగ్రెస్‌ కథ ముగియలేదు’ అంటున్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ప్రొఫెసర్‌ సుహాస్‌ వల్శీకర్‌ అన్నట్టు సంస్కరణ ఆచరణ రెండంశాలకు కాంగ్రెస్‌ సిద్ధపడాలి. ఒకటి: స్పర్థలు, వివాదాలు, కుమ్ములాటలు వీడి కాంగ్రెస్‌ ఐక్యతతో బలోపేతం కావాలి. మరింత స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటున్న ఖర్గేను అందుకు అనుమతించాలి. రెండు భావసారూప్యత కలిగిన పార్టీలతో సఖ్యత సాధించాలి. ఇందుకోసం, కాంగ్రెస్‌ మరింత వినమ్రంగా పొత్తుల సయోధ్య జరపాలి. త్యాగాలకు సిద్ధపడాలి. అయితే ఒక్కటి గుర్తుంచుకోవాలి, త్యాగాలకు అడ్వాన్స్‌ గ్యారంటీ ఏమీ ఉండదు. త్యాగాలు చేయాల్సిందే!

- ఆర్‌‌‌‌. దిలీప్‌‌‌‌ రెడ్డి, పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌,  పీపుల్స్‌‌‌‌ పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ