నెలవారీ ఈఎంఐలు కట్టలేకపోతున్నరు

నెలవారీ ఈఎంఐలు కట్టలేకపోతున్నరు

పెరుగుతున్న ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ 

అకౌంట్స్​లో సరిపడినంత డబ్బులు లేకపోవడమే కారణం

పెరుగుతున్న మొండిబాకీలు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: అప్పులు తీసుకున్నవారు ప్రస్తుతం వారి ఈఎంఐలను చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ఆటో డెబిట్‌‌ ట్రాన్సాక్షన్‌‌ ఫెయిల్యూర్సే దీనికి రుజువు. నేషనల్‌‌ ఆటోమేటెడ్‌‌ క్లియరింగ్‌‌ హౌస్‌‌(ఎన్‌‌ఏసీహెచ్‌‌) విడుదల చేసిన డేటా ప్రకారం ఒక్క అక్టోబర్‌‌‌‌ నెలలోనే 40.1 శాతం ఆటో డెబిట్‌‌ ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 31.5 శాతం ఆటో డెబిట్‌‌ ట్రాన్సాక్షన్లు ఫెయిల్‌‌ అయ్యాయని తెలిసింది. ఈ ఫెయిల్యూర్స్‌‌ ప్రధాన కారణం బ్యాంక్ అకౌంట్లలో సరిపడినంత డబ్బులు లేకపోవడమే.  అంటే అక్టోబర్‌‌‌‌ నాటికి ఈఎంఐలు కట్టడంలో బారోవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్ధమవుతోంది. ఈ ఏడాది మార్చి ముందు వరకు ఎటువంటి లోన్‌‌ డీఫాల్ట్‌‌ లేని బారోవర్లు కూడా ప్రస్తుతం అప్పులు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సంక్షోభంతో సుమారు 21 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇంకా చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. మారటోరియం పీరియడ్‌‌ కూడా అయిపోవడంతో లోన్లను వెంటనే చెల్లించాలని రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారని రిటైల్ బారోవర్లు అంటున్నారు. ముఖ్యంగా ఇన్‌‌స్టంట్‌‌గా లోన్లిచ్చిన యాప్స్‌‌, ఈఎంఐలు  కట్టాలని బలవంతం చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్‌‌ వరకు ఆరు నెలల పాటు లోన్లపై మారటోరియాన్ని ఆర్‌‌‌‌బీఐ విధించింది. ఈ మారటోరియాన్ని 50 శాతానికి పైగా రిటైల్‌‌ బారోవర్లు ఎంచుకున్నారని సెంట్రల్‌‌ బ్యాంక్ డేటా చెబుతోంది. కేవలం అప్పులు తీసుకున్న వారిలో 30 శాతం మంది కార్పొరేట్ బారోవర్లు మాత్రమే మారటోరియాన్ని ఎంచుకున్నారని పేర్కొంది. మారటోరియం పీరియడ్‌‌ ముగియడంతో ప్రతి నెల లోన్‌‌ రీపేమెంట్లను బారోవర్లు చెల్లించక తప్పడం లేదు.

క్యూ4 లో లోన్‌‌ రీపేమెంట్‌‌ సంక్షోభం..

రిటైల్‌‌ బారోవర్లు అప్పులు తీర్చడంలో ఇబ్బంది పడుతున్నారని ఇండియా రేటింగ్స్‌‌ డైరక్టర్‌‌‌‌ ప్రకాశ్‌‌ అగర్వాల్‌‌ అన్నారు. కరోనా దెబ్బతో స్మాల్‌‌, మీడియం కంపెనీలలో  చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని చెప్పారు.  లోన్‌ రీపేమెంట్‌‌ సమస్యలు క్యూ4(జనవరి–మార్చి) లో  ఎక్కువగా కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు.  ఎకానమీ రికవరీ అవుతున్నప్పటికీ, బారోవర్లు ఇంకా తమ లోన్‌‌లను చెల్లించే స్థాయికి చేరుకోలేదని పేర్కొన్నారు.  ‘లోన్‌‌ తీసుకున్న ఒక ఉద్యోగి తన శాలరీలో సగాన్ని ఈఎంఐలకే కడుతున్నాడని అనుకుందాం. ఈ ఉద్యోగి తన జాబ్‌‌ను కోల్పోతే  తన లోన్‌‌ ఈఎంఐలను చెల్లించలేడు. ఒక వేళ శాలరీ తగ్గినా జాబ్‌‌ మిగిలిందనుకుంటే ఆ శాలరీ దేనికి సరిపోదు’ అని కన్జూమర్‌‌‌‌ యాక్టివిస్ట్‌‌ జహంగీర్ గై  పేర్కొన్నారు. మరోవైపు రీపేమెంట్ల జరగకపోతే  లెండర్లు కూడా తమ ఉద్యోగులకు శాలరీలను ఇవ్వలేరు, తమ బిజినెస్‌‌ను నడుపుకోలేరని అన్నారు.

అన్‌‌సెక్యూర్డ్‌‌ లోన్స్‌‌..

ఎటువంటి సెక్యూరిటీ తీసుకోకుండా లోన్లిచ్చిన లెండర్లు కరోనా సంక్షోభంతో ఎక్కువగా నష్టపోయారని చెప్పొచ్చు. ‘ఇప్పటి వరకు బాగా దెబ్బతిన్న సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది అన్‌‌సెక్యూర్డ్‌‌ అర్బన్ కన్జూమర్‌‌‌‌ సెగ్మెంటే’ అని కోటక్ బ్యాంక్ సీఈఓ ఉదయ్‌‌ కోటక్‌‌ అన్నారు. తక్కువ శాలరీ తీసుకుంటున్న ఉద్యోగులపై కరోనా సంక్షోభ ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో ఎస్‌‌బీఐ కార్డ్స్‌‌ అండ్ పేమెంట్స్‌‌ సర్వీసెస్‌‌ మొండిబాకీలు 1.35 శాతం నుంచి 4.29 శాతానికి పెరిగాయి. భవిష్యత్‌‌లో బ్యాంకుల మొండిబాకీలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు.

ఫెయిల్ ట్రాన్సాక్షన్‌‌పై బౌన్స్ ఛార్జీ..

ఆటోడెబిట్‌‌ ట్రాన్సాక్షన్‌‌ ఫెయిలైన ప్రతి సారి బౌన్స్‌‌ ఛార్జీ కింద రూ. 200 లను లెండర్లు కట్‌‌ చేస్తున్నారని వైజాగ్‌‌కు చెందిన ఓ బారోవర్‌‌‌‌ చెప్పారు. తన బ్యాంక్ అకౌంట్లలో బ్యాలెన్స్‌‌ నెగిటివ్‌‌లోకి వెళ్లిందని  వాపోయారు. మరోవైపు లోన్‌‌ కలెక్షన్స్‌‌ మెరుగుపడుతున్నాయని  బ్యాంకులు చెబుతున్నా, పెరుగుతున్న బౌన్స్‌‌ రేటు వలన  గ్రోత్‌‌ రికవరీ నెమ్మదిస్తుందని గోల్డ్‌‌మాన్‌‌ శాచ్స్‌‌ తెలిపింది. తమ లోన్‌‌ కలెక్షన్‌‌ సామర్ధ్యం మెరుగుపడుతోందని లెండర్లు చెబుతున్నారు. ఎన్‌‌బీఎఫ్‌‌సీలయితే తమ కలెక్షన్‌‌ సామర్ధ్యం 90–95 శాతం రికవరీ అయ్యిందని అంటున్నాయి కూడా. కానీ ఫైనాన్షియల్‌‌ సంస్థలు 95 శాతం లోన్‌‌ను రికవరీ చేస్తున్నప్పడు ఆటో డెబిట్‌‌ బౌన్స్ రేటు ఎందుకు ఎక్కువగా ఉందనే అనుమానం వస్తుంది. ఆటో డెబిట్‌‌ ట్రాన్సాక్షన్‌‌ ఫెయిలయితే  మెసేజ్‌‌లు ఇతర విధానాల ద్వారా ఈఎంఐలు కట్టాలని బారోవర్లపై లెండర్లు  ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బారోవర్లు ఎలాగోలా డబ్బులు రెడీ చేసి అప్పులు తీరుస్తున్నారని అంటున్నారు.