మాతాశిశు సంరక్షణ కేంద్రంలో తల్లీబిడ్డ మృతి

మాతాశిశు సంరక్షణ కేంద్రంలో తల్లీబిడ్డ మృతి
  • డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అని బాధితుల ఆందోళన
  • కొత్తగూడెంలో పట్టణంలో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతాశిశు సంరక్షణ  కేంద్రంలో తల్లీబిడ్డ మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతనగర్​ మండలం నాయకులగూడెం గ్రామానికి చెందిన చింతాల వీరేందర్​ తన భార్య సింధు (23) ను డెలివరీ కోసం రామవరంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి బుధవారం ఉదయం తీసుకెళ్లాడు. సింధును హాస్పిటల్​లో అడ్మిట్​ చేసుకున్నారు. మధ్యాహ్నం స్కానింగ్​ చేయగా కడుపులోని బేబీలో కదలికలు లేవని డాక్టర్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్​ చేయాలని చెప్పి సాయంత్రం ఆపరేషన్​ చేసి శిశువును బయటకు తీశారు. అప్పటికే శిశువు మృతి చెందింది.

అప్పటికీ తల్లి బాగానే ఉందని చెప్పారు. కొద్ది సేపటికే తల్లికి ఫిట్స్  వచ్చాయని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని జిల్లా జనరల్​ హాస్పిటల్​కు తరలించాలని సూచించారు. దీంతో సింధును జిల్లా జనరల్  ఆసుపత్రికి తీసుకెళ్లారు. బుధవారం అర్ధరాత్రి ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అయితే, మాతాశిశు సంరక్షణ కేంద్రంలోనే బిడ్డతో పాటు తల్లి కూడా చనిపోయిందని బాధితులు చెప్పారు. తల్లి చనిపోయిన కాసేపటి తర్వాత జిల్లా జనరల్  ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారని తెలిపారు.తమ వల్ల కాదని ముందే చెప్పి ఉంటే తాము ఖమ్మం తీసుకెళ్లే వాళ్లమని, చివరి క్షణంలో పరిస్థితి సీరియస్​గా ఉందని చెప్పి తన భార్య ప్రాణం తీశారని ఆమె బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లీబిడ్డ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల తీరుపై హాస్పిటల్​ వద్ద ఆందోళన చేశారు. కాగా, గర్భంలోనే బిడ్డ మృతి చెందినట్లు స్కానింగ్​లో గుర్తించామని మాతాశిశు సంరక్షణ కేంద్రం, జిల్లా ఆసుపత్రి  సూపరింటెండెంట్​ కుమారస్వామి పేర్కొన్నారు.