తల్లీకూతురు దారుణహత్య.. అల్లుడే చంపాడని అనుమానం

తల్లీకూతురు దారుణహత్య.. అల్లుడే చంపాడని అనుమానం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో తల్లీకూతురు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రం రైల్వే ఓవర్​బ్రిడ్జి సమీపంలోని బృందావన్​ కాలనీలో పూదరి విజయలక్ష్మి(47), ఆమె కూతురు రవీనా(23) నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పనిమనిషి వచ్చి ఎంత పిలిచినా తలుపులు తీయలేదు. దీంతో పక్కన ఉండేవారికి చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఇద్దరూ చనిపోయి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి, ఏసీపీ అఖిల్​మహాజన్, టౌన్​సీఐ ముత్తి లింగయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లీ కూతురును గొంతునులిమి హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. సింగరేణి ఉద్యోగి అయిన విజయలక్ష్మి భర్త చనిపోవడంతో కొడుక్కు డిపెండెంట్​ ఉద్యోగం వచ్చింది. అతడు ఫ్యామిలీతో భూపాలపల్లిలో ఉంటున్నాడు. 

ఫేస్ బుక్​లో ప్రేమ.. పెళ్లి
నిజామాబాద్ జిల్లా బోధన్​కు చెందిన అరుణ్​కుమార్ ​ఫేస్​బుక్​ద్వారా రవీనాకు పరిచయమయ్యాడు. వీరిద్దరు నిరుడు కుటుంబసభ్యుల సమక్షంలో లవ్​మ్యారేజ్​ చేసుకున్నారు. అరుణ్​కుమార్​ జులాయిగా తిరుగుతూ రవీనాను వేధించడంతో నాలుగు నెలలకే గొడవలు మొదలయ్యాయి. అప్పటినుంచి ఆమె తల్లి దగ్గరే ఉంటోంది. అరుణ్​కుమార్​వారిపై దుష్ర్పచారం చేస్తూ వేధిస్తున్నాడు. మంచిర్యాల విమెన్​పోలీస్​స్టేషన్​లో పలుసార్లు కౌన్సెలింగ్​నిర్వహించినా మారలేదు. దీంతో వారం కిందట టౌన్​ పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్​ చేశారు. అరుణ్​కుమార్​తో తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు గురువారం తల్లీకూతుళ్ల స్టేట్​మెంట్​ను కోర్టులో రికార్డ్​చేశారు. విషయం తెలుసుకున్న అరుణ్​కుమార్​ రాత్రి ఇంటికి వచ్చి గొడవ పడ్డాడని బంధువులు చెప్పారు. తెల్లవారేసరికి వారిద్దరు హత్యకు గురవడంతో అరుణ్​కుమారే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. బంధువుల కంప్లైంట్​ మేరకు కేసు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు టీంలను నియమించారు.