తన బంగారం తనకు ఇవ్వాలని .. కూతురు ఇంటిముందు తల్లి ధర్నా

తన బంగారం తనకు ఇవ్వాలని .. కూతురు ఇంటిముందు తల్లి ధర్నా

సిద్దిపేట రూరల్, వెలుగు : దాచి ఉంచమని ఇచ్చిన బంగారాన్ని అడిగితే ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ సిద్దిపేటలో సోమవారం మధ్యాహ్నం కూతురి ఇంటి ముందు తల్లి ధర్నా చేసింది. బాధితురాలి కథనం ప్రకారం..చేర్యాల మండలం కడవేరుకు చెందిన వృద్ధురాలు లక్ష్మీనర్సమ్మకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు గతంలోనే చనిపోగా, మరో కొడుకు నర్సంపేటలో టీచర్. బిడ్డలకు పెండ్లిళ్లు చేసి పంపింది.

ఈ క్రమంలో నర్సమ్మ సిద్దిపేటలోని తన చిన్న బిడ్డ వజ్రోజు అరుణకు ఐదేండ్ల కింద ఎనిమిది తులాల బంగారాన్ని దాచి ఉంచమని ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత అడిగితే ఇవ్వలేదని, పీఎస్​కు వెళ్లి అడిగినా న్యాయం జరగలేదని చెప్పింది. సోమవారం తాను వస్తున్న విషయం తెలుసుకుని కూతురు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిందని వాపోయింది. అరుణ కుటుంబసభ్యులను సంప్రదించగా బంగారాన్ని ఆమె కొడుకుకు ఇవ్వడానికి వెళ్తున్నట్టు చెప్పారు. కావాలనే తమపై అభాండాలు వేస్తున్నారన్నారు.