
జగిత్యాల టౌన్, వెలుగు : ఎప్పుడూ సెల్ఫోన్లో గేమ్స్ఆడుతున్న కొడుకును తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల రూరల్ తిప్పన్నపేట గ్రామానికి చెందిన మ్యాడ నరేశ్, -జల కొడుకు సాయి చరణ్ (13). ఇతడు ఓ ప్రైవేట్స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి నరేశ్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా, తల్లి జల బీడీలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. మంగళవారం ఉదయం బాలుడు కాలు జారి కిందపడడంతో దెబ్బ తాకింది. దీంతో తల్లి స్కూలుకు వెళ్లొద్దని చెప్పింది. దీంతో సాయి చరణ్సెల్ఫోన్లో గేమ్స్ఆడుతూ కనిపించాడు. ఎంతసేపయినా ఆపకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలని, ఎప్పుడూ ఫోన్లో ఆడుతున్నావెందుకని తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన సాయి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై సధాకర్ కేసు నమోదు చేశారు.