సోషల్ మీడియా ద్వారా ఆచూకీ దొరికింది

సోషల్ మీడియా ద్వారా ఆచూకీ దొరికింది

ముంబై: అమ్మ కోసం ఎన్నో ఏండ్లుగా వెతుకుతున్న బిడ్డ కష్టం తీరింది. 20 ఏండ్ల కిందట మిస్సయిన మహిళ ఆచూకీ సోషల్ మీడియా ద్వారా దొరికింది. ముంబైకి చెందిన హమీదా బానో ఖతార్​లో వంట మనిషిగా పనిచేస్తుండేది. అయితే 2002లో ఒక ఏజెంట్ ద్వారా దుబాయ్​ వెళ్లింది. కానీ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఆమె బిడ్డ యాస్మిన్ షేక్ తల్లి కోసం వెతుకుతూనే ఉంది. సోషల్ మీడియా ద్వారా తన తల్లి పాకిస్తాన్​లో ఉందని తెలిసిందని, ఆమెను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. 

యూట్యూబ్ వీడియోతో వెలుగులోకి.. 

ఏజెంట్ చేతిలో మోసపోయిన హమీదా బానో పాకిస్తాన్​కు వెళ్లింది. లోకల్ వ్యక్తిని పెండ్లి చేసుకొని సింధూ ప్రావిన్స్​లో ఉంటోంది. వాళ్లకు ఒక పాప పుట్టింది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. ఆమె జీవిత కథనంతా సామాజిక కార్యకర్త వలీవుల్లా మరుఫ్ తన యూట్యూబ్ చానెల్​లో పెట్టారు. ముంబై సామాజిక కార్యకర్త ఖఫ్లాన్ షేక్ ఆ వీడియోను షేర్ చేయడంతో యాస్మిన్​ షేక్​, ఆమె బంధువులకు చేరింది. వాళ్లు హమీదా బానోతో వీడియో కాల్​లో మాట్లాడారు.