కరీంనగర్ క్రైం/బాన్సువాడ, వెలుగు: గర్భం దాల్చిన తర్వాత భర్త వదిలేయడంతో ఓ మహిళ తనకు పుట్టిన బిడ్డను అమ్ముకుంది. ఇక భర్త చనిపోవడానికి తోడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో మహిళ తనకు పుట్టిను బిడ్డను విక్రయించింది. ఏపీలోని వైజాగ్‌కు చెందిన ఓ మహిళను భర్త వదిలేశాడు. అయితే ఆమె అప్పటికే గర్భం దాల్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన తన స్నేహితులు అభినవ్, హీనా దగ్గర ఆశ్రయం పొందింది. వారం రోజుల కింద మగ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డను పోషించడం కష్టమని, ఎవరికైనా అమ్మితే డబ్బులు వస్తాయని అభినవ్, హీనా చెప్పారు.
పల్లవి, భవాని అనే మధ్యవర్తుల ద్వారా కరీంనగర్‌లోని గన్నేరువరానికి చెందిన దంపతులకు రూ.5 లక్షలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో మహిళ, శిశువును తీసుకుని అభినవ్, హీనా ఈ నెల 20న కారులో (డ్రైవర్ అశోక్) కరీంనగర్ చేరుకున్నారు. భవాని సూచన మేరకు నగరంలోని ఆర్య హాస్పిటల్ వద్దకు వెళ్లి బిడ్డను కొనుగోలుదారులకు చూపించారు. అయితే అక్కడ డబ్బుల విషయంలో గొడవ జరగడంతో గమనించిన ఓ ఆటో డ్రైవర్.. డయల్ 100కు సమాచారమిచ్చాడు.
పోలీసులు రావడంతో భయపడిన వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నించారు. నిందితులు కిసాన్ నగర్‌లో భవాని ద్వారా రూ.5 లక్షలు నగదు తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి పసికందును రక్షించారు. డబ్బులు, కారును స్వాధీనం చేసుకున్నారు. శిశువు తల్లి, మధ్యవర్తులు హీనా, అభినవ్, భవాని, కారు డ్రైవర్ అశోక్ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
అబార్షన్‌కు వెళ్లగా పరిచయమై..
భర్త చనిపోవడానికి తోడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మహిళ తనకు పుట్టిన శిశువును విక్రయించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. నిజాంసాగర్ మండలానికి చెందిన ఓ మహిళకు మూడు రోజుల కింద మగశిశువు జన్మించాడు. అయితే భర్త చనిపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మహిళ శిశువును పిట్లంకు చెందిన వారికి విక్రయించింది.
సమాచారం అందుకున్న పోలీసులు మహిళను, శిశువును ఆధీనంలోకి తీసుకొని, సఖి కేంద్రానికి అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్రవంతి తెలిపారు. కాగా, అబార్షన్ చేయించుకునేందుకు మూడు నెలల కింద ఓ హాస్పిటల్‌కు వెళ్లగా.. పిట్లం గ్రామానికి చెందిన కొందరు పరిచయమై అబార్షన్ చేసుకోవద్దని, ఆస్పత్రి ఖర్చులు తామే భరిస్తామని చెప్పి.. డెలివరీ కాగానే బాబును తీసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
