విశ్వాసం.. అబద్ధానికి ప్రచారం ఎక్కువ.. ఓ నీతి కథ..

విశ్వాసం.. అబద్ధానికి ప్రచారం ఎక్కువ.. ఓ నీతి కథ..

అనగనగా ఒక ఊరిలో ఒక రాజు గారున్నారు. ఒక రోజు ఆ రాజుగారు దంతధావనం చేసుకుందామంటే, ఆయన రోజూ వాడే వెండి నాలుక బద్ద కనిపించలేదు. దానితో ఆ రాజుగారి పరిచారకుడు ఒక తాటాకు బద్దను ఇచ్చాడు. రాజుగారు ఆ తాటాకు బద్దతో పని కానిచ్చుకుంటుండగా అది నేల మీద పడిపోయింది. అది చూసిన పనివాడు – ‘రాజు గారి నోటి నుంచి తాటి బద్ద నేల మీదకు రాలింది’ అని చెప్పాడు. అది విన్న మరో బంటు ‘రాజు గారి నోట్లోంచి  తాటి ఆకు నేల మీద పడింది’ అని తన సొంత పాండిత్యం చేర్చి ప్రచారం చేశాడు. 

ఆ తర్వాత ప్రజలు ‘రాజుగారి నోటి నుండి తాటి మట్టలు పడ్డాయట’ అంటూ విచిత్రంగా చెప్పుకున్నారు. చివరికి ఆ మాట ఏకంగా, ‘రాజు గారి నోట్లో నుంచి తాటి చెట్టు రాలి నేల మీద పడింది’ అయింది. ఆ వింత చూద్దామని ప్రజలంతా వచ్చి రాజు గారి ఇంటి ముందు బారులు తీరి నిలబడ్డారు. అలా వాళ్లంతా ఎందుకు వచ్చారో రాజుకి అర్థం కాలేదు. తనను అంటిపెట్టుకున్న బంటుని అడిగాడు. అప్పుడు ఆ బంటు తల దించుకుని, తాను జత చేసిన వదంతి గురించి చెప్పాడు. అలా ఒక్కొక్కరు వారికి తోచిన విధంగా జత చేసుకుంటూ వెళ్లారు. ఇలా ఉంటాయి వదంతులు.‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అనే సామెత వాడుకలో ఉండనే ఉంది.

ఈ వదంతులకు రామాయణ, మహాభారత గాథలు మంచి ఉదాహరణలు. వాల్మీకి, వ్యాసుడు రాసిన కథలను చదివిన కొందరు మహానుభావులు.. ఆ కథలో లేని అంశాలను జత చేశారు. వదంతులలాగానే అవి తొందరగా ప్రచారమయ్యాయి. రామాయణంలో... సీతమ్మకు లక్ష్మణుడు లక్ష్మణరేఖ గీయలేదు. రావణాసురుడి కడుపులో అమృత భాండం లేదు.

అహల్య రాయిగా మారలేదు. శబరి... తాను ఎంగిలి చేసిన పండ్లను రాముడికి ఇవ్వలేదు.ఈ విషయాలేవీ వాల్మీకి రామాయణంలో లేవు. కానీ వాటిని ఎవరికి అనుకూలంగా వారు మార్చుకుని రాసిన రామాయణాలు... అసలు రామాయణం కంటె ముందుగా ప్రపంచాన్ని చుట్టి వచ్చాయి.

మహాభారతం విషయంలోకి వస్తే...

‘దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వింది’ అని ఎవరో కట్టు కథ పుట్టిస్తే, ఆ కథే ప్రచారంలోకి వచ్చింది. ద్రౌపది కర్ణుడిని ఆరవ భర్తగా స్వీకరించటానికి సిద్ధంగా ఉందని మరో కథ ప్రచారమైంది కూడా. ఇటువంటి అనేక సంఘటనలు... వాస్తవాన్ని మరుగుపరచి, అసత్యాన్ని ప్రచారం చేశాయనటానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
అసత్య ప్రచారానికి అద్దం పట్టే కథ ఒకటి చెప్పుకుందాం... ఒక బాటసారి మేకను అమ్మేందుకు తీసుకెళ్తుంటాడు. ఓ నలుగురు మోసగాళ్ళు అతడ్ని మోసం చేసి, ఆ మేకను సొంతం చేసుకోవాలి అనుకుంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోసారి బాటసారికి ఎదురై ‘ఈ కుక్కను ఎవరు కొంటారు?’ అని అడుగుతారు. ‘ఇది కుక్క కాదు మేక’ అని చెప్తుంటాడు. ఆ మాట పట్టించుకోకుండా వాళ్లు నలుగురు అది ‘కుక్క’ అనేసరికి... నిజంగానే ఇది కుక్కే అయి ఉంటుంది.

లేకపోతే ఇంతమంది కుక్క అని ఎందుకంటారు అనుకున్నాడు. దాంతో ఆ మేకను అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. ఆ తరువాత మోసగాళ్ళు మేకను తీసుకెళ్తారు.పదుగురాడు మాట పాటి యై ధర చెల్లు ఒక్కరాడు మాట ఎక్కదెందు ఊరకుండువాని నూరెల్ల నోపదువిశ్వదాభిరామ వినురవేమ.అసత్యమైనప్పటికీ... ఎక్కువమంది మాట్లాడే మాటకు విలువ ఉంటుంది. ఒక్కడు చెప్పే మాటకు ఎన్నడూ విలువ ఉండదు. అలాగే తటస్థంగా ఉండేవారిని ఎవ్వరూ పట్టించుకోరని వేమన చెప్పాడు. నేటి రాజకీయాల్లో చూసుకుంటే కూడా అవాస్తవాలకే బాగా ప్రచారం లభిస్తోంది. నిజాన్ని కప్పి పుచ్చేందుకు  అసత్యాన్ని ప్రచారం చేయటం వల్ల అబద్ధం రాజ్యమేలుతుంది. నిజం చచ్చిపోతుందని పెద్దలు చెప్తారు.

నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని సామెత విన్నాం. మనుషులకి... అబద్ధాన్ని, వదంతులను, గాలి కబుర్లను ప్రచారం చేయటంలో ఉన్న తొందరపాటు, ఆసక్తి, మంచిని ప్రచారం చేయటంలో ఉండదు. ఒక చిన్న పొరపాటు లేదా తప్పు జరిగిందన్న విషయం తెలిసిన తరువాత, ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, దానికి మరికొన్ని వదంతులను చేర్చి ప్రచారం చేస్తారు. అలా ఒక్కొక్కరి నుండి ఒక్కో అబద్ధం జత అవుతూ చివరకు ‘రాజుగారి నోట్లో తాడి చెట్టు మొలిచింది’ అన్న చందాన తయారవుతుంది.

రామాయణంలో... సీతమ్మకు లక్ష్మణుడు లక్ష్మణరేఖ గీయలేదు. రావణాసురుడి కడుపులో అమృత భాండం లేదు.
అహల్య రాయిగా మారలేదు. శబరి... తాను ఎంగిలి చేసిన పండ్లను రాముడికి ఇవ్వలేదు.ఈ విషయాలేవీ వాల్మీకి రామాయణంలో లేవు. కానీ వాటిని ఎవరికి అనుకూలంగా వారు మార్చుకుని రాసిన రామాయణాలు... అసలు రామాయణం కంటె ముందుగా ప్రపంచాన్ని చుట్టి వచ్చాయి.


- డా. వైజయంతి పురాణపండ 
ఫోన్​: 80085 51232