కూటముల్లో మొదలైన కదలిక

కూటముల్లో మొదలైన కదలిక

దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్​లు తమ నేతృత్వాలలోని కూటములను బలోపేతం చేసుకునే పనిలోపడ్డాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఇప్పటికి చాలా నెలల నుంచి స్తబ్ధుగా ఉంది. దేశంలోని రాజకీయాలన్నీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల చుట్టూనే తిరుగుతుండడంవల్ల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా ఉలుకు పలుకు లేకుండానే ఉంది. త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండడం, సార్వత్రిక ఎన్నికలకు గడువు ఇంచుమించుగా ఏడాదిలోకి రావడంతో  కూటముల్లో మళ్లీ కదలిక మొదలైంది.

పట్నాతో ప్రారంభం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయే వ్యతిరేక పార్టీలతో ఈ జూన్ 23న పట్నాలో  ఒక సమావేశం నిర్వహించారు. దానిలో పదిహేడు పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ తనవంతుగా బెంగళూరులో ప్రతిపక్షాలతో  మరో విడత సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తరాదిన, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకునే పనిని బీజేపీ ఏనాడో మొదలెట్టింది. తాజాగా మహారాష్ట్రలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీలిక వర్గాన్ని చేర్చుకోవడాన్ని దానికి కొనసాగింపుగా భావించాలి. దానికి ప్రతిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  దక్షిణాదిలోని చిన్నా చితక పార్టీలను కూడా కలుపుకొంటూ దాదాపు 24 పార్టీలకు బెంగళూరు సమావేశానికి ఆహ్వానం పలికారు.

ఎటూ చేరని పార్టీలు

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్​లు రెండూ ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నందు వల్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని బీఆర్​ఎస్​ ఏ కూటమిలోనూ చేరకపోవచ్చు. టీఆర్​ఎస్​ను జాతీయ పార్టీగా మార్చిన ఆయన ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలో బిజూ జనతా దళ్ బలంగా ఉంది. ఆయన ఒడిశా ప్రయోజనాలను ధ్యేయంగా పెట్టుకుని అంశాలవారీగా ఏ కూటమికి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధమే. ఉత్తరప్రదేశ్​లో మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఏ కూటమిలోనూ చేరలేదు కానీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అది సాధించగల ఫలితాలపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కనుక, ఎన్డీయే వ్యతిరేక పార్టీలన్నీ ఒకే కూటమిగా యూపీయే పంచన చేరకపోవచ్చు.

సమసిపోని పొరపొచ్చాలు

బెంగళూరులో జరుగుతున్న యూపీఏ సమావేశాలకు సోనియా గాందీ కూడా హాజరవుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ మొన్నీమధ్యనే బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నుంచి ముక్కోణపు పోటీని ఎదుర్కొని ఘన విజయం సాధించింది. అయినా, మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరవవచ్చు. అజిత్ తెచ్చిన చీలికతో ఎన్​సీపీలో పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో తలమునకలుగా ఉన్న శరద్ పవార్ కూడా బెంగళూరు సమావేశాలకు రావచ్చు. ఢిల్లీలో పాలనా యంత్రాంగంపై పట్టుకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సును బాహాటంగా వ్యతిరేకించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్​పై  కాంగ్రెస్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేసింది. 

ALSO READ:మంచిర్యాలలో బీఆర్ఎస్ ఓటమి ఖాయం...

కేజ్రీవాల్ కూడా బెంగళూరు సమావేశాలకు ప్రస్తుతానికి సానుకూలంగా మారాడు. పంజాబ్​లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఓపీ సోనీని, అక్కడి రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. పంజాబ్​లో ఆప్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కనుక, ఆప్​పై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. నేరాలు, అవినీతి, మతతత్వంపై రాజీపడే ప్రసక్తే లేదంటున్న నితీశ్ కుమార్​కు బిహార్​లో ఉప ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజస్వి యాదవ్​ను వెనకేసుకురావడం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఉద్యోగాలు ఇచ్చినందుకు ప్రతిగా భూములు తీసుకున్నట్లుగా తేజస్వి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ, ఇటీవల బిహార్ శాసన సభ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీకి తేజస్వి యాదవ్, ఆయన అన్న, క్యాబినెట్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ లను వెంటపెట్టుకుని ఒకే  కారులో  రావడం ద్వారా తమమధ్య పొరపొచ్చాలు ఏవీ లేవనే సంకేతాన్ని ఇచ్చేందుకు కూడా నితీశ్ ప్రయత్నించారు. కానీ, వారి కళంకం తనకూ అంటుతుందేమోననే భయం ఆయనకు లోలోపల లేకపోలేదు.

మోడీ, శరద్​ల సమావేశంపై ఉత్కంఠ

లోక్​మాన్య బాలగంగాధర్ తిలక్ 103వ వర్థంతి సందర్భంగా పుణేలో ఈ ఆగస్టు 1న జరుగనున్న సమావేశానికి శరద్ పవార్, ప్రధాని నరేంద్ర మోడీలు హాజరవనున్నారు. లోక్​మాన్య తిలక్ స్మారక ట్రస్టు ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశంలో లోక్​మాన్య తిలక్ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేయనున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సుశీల్ కుమార్ షిండే, రోహిత్ తిలక్​లు ఈ ట్రస్టు తరఫున పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా మోడీ, పవార్​లు దగ్గరవుతారేమోనని కూడా కాంగ్రెస్​లో గుబులు ఉంది.

తమిళనాడు, కేరళపై  ఆశలు

ఇక తమిళనాడు నుంచి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేతో పాటు వై. గోపాలస్వామికి చెందిన ఎండీఎంకే, కొంగు వెల్లాల గౌండర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కె.డి.ఎం.కె, తిరుమావళవన్​కు చెందిన వీసీకే పార్టీలు యూపీఏ దారిలోనే ఉన్నాయి. ఇంకా ఆర్​ఎస్​పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) కూడా ఈ యూపీఏ సమర సన్నాహక సమావేశాలకు మద్దతు తెల్పాయి. స్థిరమైన ఎజెండాతో బీజేపీ ముందుకు సాగుతున్నందువల్ల, దానికి ప్రత్యామ్నాయంగా మరో స్పష్టమైన ఎజెండాను కాంగ్రెస్ ప్రజల ముందు ఉంచక తప్పదు. అస్థిరతకు ఆలవాలమైన సంకీర్ణ ప్రభుత్వాలతో ప్రజలు విసుగుచెందిపోయారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే అంచనాలకు రావడం తొందరపాటు కావచ్చుకానీ, కూటమితో సంబంధం లేకుండా ప్రజలు ఏదో ఒక ప్రధాన పార్టీకి మెజార్టీ కట్టబెట్టే అవకాశాలే ప్రస్తుతానికి మెండుగా కనిపిస్తున్నాయి.

కదిలిన ఎన్డీయే

బీజేపీ రేపు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎన్డీయే సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే నాయకత్వంలోని శివసేన చీలిక వర్గంతోపాటు అజిత్ పవార్​కు చెందిన ఎన్సీపీ చీలిక వర్గం కూడా పాల్గొనవచ్చు. ఎన్డీయేని బలోపేతం చేసేందుకు ఉత్తరప్రదేశ్​లోని సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, బిహార్​లోని వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ, హిందూస్థాన్ అవామీ మోర్చా, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్​జేపీ చీలిక వర్గం వంటివాటిని కూడగట్టుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. కర్ణాటకలో హెచ్​డీ దేవె గౌడ నాయకత్వంలోని జనతా దళ్ (సెక్యులర్) కూడా ఎన్డీయే తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు దేశం పార్టీని తిరిగి చేర్చుకున్నా, చేర్చుకోకపోయినా పెద్దగా తేడా ఉండకపోవచ్చు. అక్కడ వై.ఎస్. జగన్మోహన రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్​సీపీ బలంగా ఉంది. అయిష్టంగా జరిగిన రాష్ట్ర విభజనకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇప్పట్లో కాంగ్రెస్, బీజేపీలను క్షమించగలిగిన స్థితిలో లేరు. 

అది వైయస్సార్​సీపీకి శ్రీరామ రక్షగా పనిచేస్తుంది. అది ఎన్డీయేలో చేరినా, చేరకపోయినా అవసరమైతే కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తుందని గతంలో చాలా సందర్భాలలో రుజువైంది. ఆంధ్రప్రదేశ్​ను పునర్నిర్మించడానికి లభించిన అవకాశాన్ని, ఎన్డీయేతో ఉన్న సద్భావనను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వయంకృతాపరాధాలతో పాడు చేసుకున్నారు. పంజాబ్​లో శిరోమణి అకాలీ దళ్ తిరిగి ఎన్డీయే గూటికి చేరుతుందో లేదో చూడాలి. ఖలిస్తాన్ వేర్పాటువాదుల పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తున్నందు వల్ల దాని నిర్ణయం ఆసక్తికరంగా మారనుంది.

- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్​