
రాజ కుటుంబమే కానీ..
- టైటిల్ : ది రాయల్, ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్, డైరెక్షన్ : ప్రియాంక ఘోష్, నుపుర్ అస్థానా
- కాస్ట్ : భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్, సాక్షి తన్వర్, విహాన్ సమత్, లిసా మిశ్రా, కావ్య ట్రెహాన్, మిలింద్ సోమన్..
రాజస్థాన్‌లోని రాజకుటుంబానికి చెందిన మహారాజా యువనాథ్ సింగ్ (మిలింద్ సోమన్) చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు అతని కొడుకు అవిరాజ్ (ఇషాన్ ఖట్టర్) మీద పడతాయి. అతనేమో అలాంటి బాధ్యతలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు. న్యూయార్క్ వెళ్లి అతనికి నచ్చిన మోడలింగ్ కెరీర్‌లో సక్సెస్ కావాలని కలలు కంటుంటాడు. తన నిర్ణయాన్ని తల్లి రాణి పద్మజ (సాక్షి తన్వర్)తో చెప్తాడు. కానీ.. రాజ కుటుంబం అయినా వాళ్ల దగ్గర అంత డబ్బు లేకపోవడంతో రాణి పద్మజ అతన్ని ఇక్కడే ఉండమని బలవంతం చేస్తుంది. ఆ తర్వాత ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు అవిరాజ్ ‘రాయల్ బిఅండ్బి’ అనే స్టార్టప్ కంపెనీ సీఈవో సోఫియా(భూమి పెడ్నేకర్)తో కలిసి పనిచేయాల్సి వస్తుంది. కానీ.. ఆమెతో పదే పదే గొడవలకు దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి.
రోగుల్లేని హాస్పిటల్!
- టైటిల్ : గ్రామ్ చికిత్సాలయ్ , ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో, డైరెక్షన్ : రాహుల్ పాండే
- కాస్ట్ : అమోల్ పరాశర్, వినయ్ పాఠక్, ఆనందేశ్వర్ ద్వివేది, ఆకాష్ మఖిజా, ఆకాంక్ష రంజన్ కపూర్, గరిమా సింగ్, సంతూ కుమార్
మెడికల్ గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రభాత్ సిన్హా (అమోల్ పరాశర్) ఉత్తర భారతదేశంలోని ఒక మారుమూల గ్రామమైన భట్కండిలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కి డాక్టర్‌గా వెళ్తాడు. ఆ ఊళ్లోని హాస్పిటల్ని చాలా కాలంగా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కనీసం బీపీ మెషిన్ కూడా పనిచేయదు. కొన్ని పరికరాలు తుప్పు పట్టి ఉంటాయి. అదంతా చూసి సిన్హా ఆశ్చర్యపోతాడు. ఆ గ్రామంలోని రోగులకు గూగుల్‌పై ఆధారపడే ఒక మోసగాడు చేతక్ కుమార్(పాఠక్) వైద్యం చేస్తుంటాడు.
►ALSO READ | పరిచయం: అప్పుడు ఆలిండియా ర్యాంకర్.. ఇప్పుడు ఆర్టిస్ట్ అమోల్
గవర్నమెంట్ హాస్పిటల్‌లోని మందులు కూడా అతని దగ్గరే ఉంటాయి. కాంపౌండర్ ఫుటాని జీ (ఆనందేశ్వర్ ద్వివేది), వార్డ్ బాయ్ గోవింద్ (ఆకాష్ మఖిజా) హాస్పిటల్‌కు చాలా అరుదుగా వెళ్తుంటాడు. దాన్ని ఒక వర్క్ ప్లేస్‌గా కాకుండా అప్పుడప్పుడు టైంపాస్ కోసం వెళ్లే ప్రదేశంగా భావిస్తారు. అలాంటి భట్కండి పరిస్థితులను ఎలాగైనా మార్చాలని నిశ్చయించుకుంటాడు సిన్హా. కానీ.. ఆ ప్రయత్నంలో అతను స్థానిక రాజకీయ నాయకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.
అమ్మంటే ప్రాణం
- టైటిల్ : నోన్నాస్, ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్, డైరెక్షన్ : స్టీఫెన్ చ్బోస్కీ గంట,
- కాస్ట్ : విన్స్ వాఘన్, లోరైన్ బ్రాకో, తాలియా షైర్, సుసాన్ సరాండన్, జో మాంగనీల్లో, కాంప్‌బెల్ స్కాట్, మైఖేల్ రిస్పోలీ
ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. కథలోకి వెళ్తే.. జో స్కారావెల్లా (విన్స్ వాఘన్) బ్రూక్లిన్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. సడెన్‌గా వాళ్ల అమ్మ చనిపోతుంది. అతనికి అమ్మ, ఆమె చేతి వంట చాలా ఇష్టం. ఆమెకు కూడా జో అంటే ప్రాణం. అందుకే తాను చనిపోయినా జో బాగుండాలని ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటుంది.
ఆమె చనిపోయాక జోకి ఆ డబ్బు వస్తుంది. దాంతో అతను తల్లి జ్ఞాపకార్థం ఒక రెస్టారెంట్ పెడతాడు. అందులో ప్రొఫెషనల్ చెఫ్‌లకు బదులుగా నలుగురు ఇటాలియన్ అమ్మమ్మల(నోన్నాస్)ని చెఫ్‌లుగా పెట్టుకుంటాడు. వాళ్లు చేసే గోల చాలా నవ్వు తెప్పిస్తుంది. వాళ్లతో పనిచేయించుకోవడానికి జో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.