
‘ఇది చదువు ఫ్యూచర్ బాగుంటుంది.. అది చెయ్ లైఫ్ సెట్ అయిపోతుంది’ అనే మాటలు ఎవరో ఒకరు ఇంకొకరికి చెప్తూనే ఉంటారు. అలాంటి వాళ్ల మాటలకు ఇన్స్పైర్ అయ్యి వాళ్లు చెప్పినట్టే చేస్తాం.. సక్సెస్ కూడా అవుతాం. కానీ, అందులో తృప్తి లేదు అనిపిస్తే..? ఇప్పటివరకు సాఫీగా సాగిపోతున్న కెరీర్ వదిలేసి పూర్తి విరుద్ధంగా వేరే ఆప్షన్ ఎంచుకుంటే? సక్సెస్, ఫెయిల్ అనేది పక్కన పెడితే అసలు అఆలు కూడా తెలియని ఇండస్ట్రీలో అడుగుపెడితే..? ఆలోచిస్తేనే చాలా డౌట్లు వస్తాయి.
ఎన్నో భయాలు చుట్టుముడతాయి. నిజమే.. కానీ, వాటన్నింటినీ దాటి బలంగా ఒకటి నమ్మి.. అహర్నిశలు దానికోసమే చెమటోడిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రూవ్ చేసిన ఒక నటుడు అమోల్ పరాశర్. ప్రస్తుతం తను లీడ్‌రోల్ చేసిన ‘గ్రామ్ చికిత్సాలయ్’ సిరీస్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సందర్భంగా అమోల్ జర్నీ విశేషాలు ఇవి.
అమోల్ పరాశర్ ఒక నటుడిగా కంటే ముందు ఆలిండియా ర్యాంకర్‌గా ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఎంతోమంది రాత్రిపగలు కష్టపడి చదివితేగానీ ఐఐటీ జేఈఈలో ర్యాంక్ రాదు. అలాంటి అతిపెద్ద పరీక్షలో ఆలిండియా 238 ర్యాంక్ తెచ్చుకున్న అమోల్.. మంచి కార్పోరేట్ కంపెనీలో జాబ్ కూడా చేశాడు. కానీ, ఎక్కడో అసంతృప్తి.. ఇంకా ఏదో చేయాలనే తపన తనని నిద్రపోనివ్వలేదు. అప్పుడే ఎక్కడో తనకు సినిమాలు, నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తట్టి లేపినట్టు అనిపించింది.
బాగా ఆలోచించాడు.. సినిమాల్లో నటించాలి అని ఒకరోజు డిసైడ్ అయిపోయాడు. అంతే... అప్పటిదాకా హైవేలో హాయిగా వెళ్తున్న కారులా సాగిన లైఫ్.. ఉన్నఫళంగా సడెన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయింది. యూటర్న్ తీసుకుని సరాసరి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వచ్చేశాడు. వచ్చిన వెంటనే అవకాశాలు రావడం.. పెద్ద యాక్టర్ అయిపోవడం ఇవన్నీ అనుకున్నంత ఈజీ కాదు. ఎన్నో ప్రయత్నాలు చేయగా.. ‘టీవీఎఫ్ ట్రిప్లింగ్’ అనే సిరీస్‌తో గుర్తింపు దక్కింది. ఆ తర్వాత విక్కీ కౌశల్ నటించిన ‘సర్దార్ ఉద్ధమ్’ సినిమాలో భగత్ సింగ్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
జాబ్ మానేసి ముంబైకి..
అమోల్ పరాశర్ది న్యూఢిల్లీ. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో మెకానికల్ ఇంజినీర్‌గా గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఒక కంపెనీలో జాబ్ రావడంతో కొన్నాళ్లు పనిచేశాడు. అప్పటికే అమోల్కి సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో జాబ్ మానేసి.. ముంబై వెళ్లిపోయాడు. అక్కడ యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాడు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే అప్పుడు మన చుట్టూ ఉండేవాళ్లు, మన గురించి జాగ్రత్త తీసుకునేవాళ్లకు కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మంచి జాబ్ ఉంది. లైఫ్ చాలా బాగా సాగుతోంది.
మరెందుకు ఎక్కడో తెలియని చోటికి వెళ్లాలనుకుంటున్నావు? అక్కడికి వెళ్లి ఏం చేయాలని? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాబ్లమ్ ఏంటంటే.. నాకు అసలు ఏ ప్లాన్ లేకపోవడమే. అందువల్ల వాళ్లు నా గురించి బాధపడడంలో అర్థం ఉంది. ఒక సెక్యూర్డ్ లైఫ్‌ని వదిలిపెట్టి తెలియని చోట మన కెరీర్ స్టార్ట్ చేయాలంటే అది చాలా పెద్ద రిస్క్. కాబట్టి అసలు ఎలాంటి ప్లాన్ కూడా బ్లైండ్‌గా వెళ్లిపోతానంటే ఎవరైనా ఆపడానికే ట్రై చేస్తారు. మా ఫ్యామిలీ, బంధువులంతా ఒకటే మాట మీద ఉన్నారు.
►ALSO READ | జూన్‌లో బద్మాషులు
ఓనమాలు కూడా తెలియని ఒక కొత్త రంగంలోకి వెళ్లి అక్కడ ఏం చేస్తాడు? టైం, మనీ వంటివన్నీ వేస్ట్ అవ్వడం తప్ప మరేంలేదు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అని చాలా దిగులుపడ్డారు. కానీ, నా ఫ్రెండ్స్ మాత్రం ‘నువ్వు మా హీరో’ అంటూ ఎంకరేజ్ చేసేవాళ్లు. నువ్వు ముందుకెళ్తూనే ఉండాలి. మాకు కూడా జాబ్స్ వదిలేయాలనుంది. కానీ, నీకున్నంత ధైర్యం మాకు లేదు అనేవారు నా ఫ్రెండ్స్.
జీరో నుంచి ఒంటరిగా లైఫ్ మొదలు
ఢిల్లీలో చదువుకునేటప్పుడు అక్కడ జరిగే ఫెస్టివల్స్‌లో పార్టిసిపేట్ చేసేవాడిని. అలా ఒకసారి థియేటర్ ఆర్టిస్ట్‌ల కోసం ఆడిషన్ చేస్తుండగా నేను ఒకసారి ట్రై చేద్దామని వెళ్లా. అది ఒక ఇంగ్లీష్ నాటకం. అందులో ఒక పాత్రలో నటించా. అక్కడి నుంచి నటన అంటే ఏంటి? ఎలా పర్ఫార్మ్ చేయాలి? అనే ఆలోచనలు నాలో మొదలయ్యాయి. కానీ, ఆర్టిస్ట్ అవ్వాలని అనుకోలేదు. దాని గురించి పూర్తిగా నాకు చెప్పేవాళ్లు ఎవరూ లేరు. మా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అంతా చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ఉండేవాళ్లు. దానివల్ల నటన గురించి నాకు అస్సలు నాలెడ్జ్ లేదు. కానీ, ఎప్పుడైతే నటుడిని కావాలని నిర్ణయించుకున్నానో అప్పుడే జాబ్ వదిలేశా.
అప్పటివరకు ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేశా. నాకు తెలుసు ఇక్కడ ఎవరూ తెలిసినవాళ్లు లేరు. ప్రాంతం, ప్రజలు, నేను చేయాలనుకుంటున్న పని అన్నీ కొత్తవే. అయినా నేను ధైర్యం చేశాను. ఇప్పటివరకు నాకు వచ్చిన ప్రశంసలు, డబ్బు అన్నీ పక్కన పెట్టి, జీరో నుంచి ఒంటరిగా లైఫ్ మొదలుపెట్టాలి అనుకున్నా. ఆ బలమైన కోరికే నన్ను ఈరోజు ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇక్కడికి వచ్చాక రకరకాల ప్రజల్ని కలిశాను. ఎన్నో విషయాలు తెలుసుకున్నా.
ఆ బాధ కూడా కొంతకాలమే
ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పటి నుంచి ముంబై సిటీతోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి చాలా కథలుగా విన్నాను. నేను ఒక బయటి వ్యక్తిగా వచ్చి అక్కడి పరిస్థితులు చూసినప్పుడు ఒక ఏలియన్ వరల్డ్‌లా అనిపించింది. ఎంతోమంది సినిమాల్లో అవకాశాల కోసం వచ్చి ఎన్నో ఏళ్లు ప్రయత్నిస్తూ ఉన్నారు. కొందరు అవకాశాలు వచ్చి ప్రాజెక్ట్‌లు చేసినా సక్సెస్ లేక సతమతమవుతూ కనిపించారు. భయం అనేది కూడా కొంతవరకే ఉంటుంది. కాస్త ముందుకెళ్తే ఇంకొంచెం తెలుసుకోవచ్చు. నీ లైఫ్ నీకు నచ్చినట్లుగా బతకాలి. విలువలతో బతకడం ఇంపార్టెంట్.
►ALSO READ | దీపావళికి వచ్చేస్తున్న డ్యూడ్
అంతేకానీ ప్రజలు ఏమనుకుంటారో అని భయపడుతూ, బాధపడుతూ బతకకూడదు. సక్సెస్ రాలేదనే బాధ కూడా కొంతకాలమే. మొదట్లో నాకు ఆ బాధ ఉండేది. పేరెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ, టైంతోపాటు హార్డ్ వర్క్ కలిస్తే పని త్వరగా స్టార్ట్ అవుతుంది. నేను సినిమాల్లోకి వచ్చాక నాకు ఇక్కడే పని దొరికింది. అవార్డులు రావడం మొదలైంది. ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా స్టార్ట్ అయింది. అప్పుడు ‘నేను ఏదో చేస్తున్నా..’ అని మనసుకు అనిపించింది. అందుకు హ్యాపీగా ఉన్నా. పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని నమ్మకం కుదిరింది.
అలాంటిదే ఈ కథ కూడా
కొత్త పాత్రల్లో నటించాలంటే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ఈ సిరీస్‌లో నేను చేసిన పాత్ర కూడా అలాంటిదే. ‘గ్రామ్ చికిత్సాలయ్’ సిరీస్ ఒక విలేజ్‌లో జరిగే కథ. ఒక చిన్న గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలకు సిటీ నుంచి వచ్చిన ఒక మంచి డాక్టర్ పాత్ర నాది. అతను అక్కడి వాళ్లలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంటాడు. మరి అతని ప్రయత్నాలు సఫలమయ్యాయా? లేదా? అన్నదే పాయింట్. రూరల్ బ్యాక్‌గ్రౌండ్, టీవీఎఫ్ బ్యానర్ అనగానే ‘పంచాయత్’ సిరీస్‌లా ఉంటుంది అనుకుంటారు.
కానీ, ఆ రెండు మాత్రమే సేమ్.. మిగతా కథ, అందులోని పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఓటీటీ వచ్చాక క్రియేటివ్ ఫ్రీడమ్ దొరికింది. కాబట్టి మనసుకు నచ్చిన పాత్రలు, ప్రజలకు చెప్పాల్సిందే అనిపించేటటువంటి కథలు తెరపైకి తీసుకొస్తున్నారు. అలాంటిదే ఈ కథ కూడా. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది.