కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపాలి : ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎద్దేవా

కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపాలి : ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎద్దేవా
  • పాలమూరు పౌరుషాన్ని సీఎం చూపాలి
  • తొండలిడుసుడు కాదు.. లోపలేయడానికే అధికారం ఇచ్చిన్రు
  • కవిత ఆరోపణలపై కేటీఆర్, హరీశ్​రావు మౌనమేల..?
  • నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ .

నిజామాబాద్, వెలుగు:  విద్యా, వైద్య రంగాలను నాశనం చేసి కూలిపోయే డ్యాంలు కట్టిన కేసీఆర్​ఇప్పుడు బయటకు వచ్చి సూక్తులు చెప్పడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ ​ఎంపీ అర్వింద్​ ధర్మపురి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను నమ్మించి ద్రోహం చేయడంలో ఆయన్ను మించిన ఘనులు లేరన్నారు. ఆదివారం నిజామాబాద్​లోని ఫంక్షన్​హాల్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ మద్దతుదారులను సన్మానించిన ఆయన ప్రసంగించారు. 

చాలా రోజుల తర్వాత మీడియా ఎదుటకు వచ్చిన కేసీఆర్​చాదస్తం, వైరాగ్యాన్ని చూపి వెళ్లారన్నారు. సీఎం రేవంత్​రెడ్డి రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నారో చెబుతారనుకుంటే పాత పురాణమంతా మళ్లీ చెప్పుకొచ్చారని విమర్శించారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్​ కుటుంబాన్ని సీఎం రేవంత్​రెడ్డి జైల్లో వేయాలని, ప్యాకేజీలకు సరెండర్​కావొద్దన్నారు. కేసీఆర్​ను లోపలేయడానికే ప్రజలు కాంగ్రెస్​కు అధికారం కట్టబెట్టారనే విషయాన్ని మరువొద్దని, లాగులో తొండలు ఇడువడానికి కాదన్నారు. 

పాలమూరు పౌరుషాన్ని చూపాల్సిన టైం రేవంత్​రెడ్డికు వచ్చిందన్నారు. కేటీఆర్, హరీశ్ రావుపై కవిత డైరెక్ట్​ఆరోపణలు చేస్తుంటే వారిద్దరు ఏ ముఖం పెట్టి ప్రజల ముందు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.  కేటీఆర్​తన ప్రసంగాల్లో తరచూ కేసీఆర్​ వయస్సును ప్రస్తావించడం వెనుక మతలబు దాగిఉందన్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్​అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ ఇరిగేషన్​ప్రాజెక్టుల పేరుతో రూ.50 వేల కోట్లు లూటీ చేసి పాపాత్ముడిగా మిగిలిపోయారన్నారు.

 పార్లమెంట్​సెగ్మెంట్​ పరిధిలో 96 మంది బీజేపీ మద్దతుదారులు సర్పంచ్​లుగా గెలువడం రానున్న రోజుల్లో గొప్ప మార్పునకు సంకేతమన్నారు. అవినీతికి తావులేని పారదర్శక సేవలు అందించి గెలిచిన గ్రామాలు డెవలప్​ చేయాలని సూచించారు. నేషనల్​ టర్మరిక్​ బోర్డ్​ చైర్మన్​ పల్లె గంగారెడ్డి, అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, బీజేపీ నిజామాబాద్​, జగిత్యాల జిల్లాల ప్రెసిడెంట్లు​ దినేష్ కులాచారి​, యాదగిరిబాబు, మోహన్​రెడ్డి, మేడపాటి ప్రకాష్​రెడ్డి, స్రవంతిరెడ్డి తదితరులు ఉన్నారు.