
- తప్పుచేయకపోతే ఎంక్వైరీకి హాజరు కావాలి: ఎంపీ చామల
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరంలో అవినీతి జరగకపోతే కమిషన్ విచారణ అనగానే కేసీఆర్ ఎందుకు జంకుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నిం చారు. ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణంలో తప్పులు లేకపోతే విచారణకు హాజరుకావాలని సవాల్ విసిరారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో చామల మాట్లాడారు. కాళేశ్వరం నిర్మాణంలో తప్పేమి జరగకపోతే.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్ డీఎస్ ఏ) కేసీఆర్ కు నోటీసులు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు.
కుంగిన తర్వాత ప్రాజెక్టు నుంచి సుమారు 10 కి.మీ. మేర ఎందుకు ఆంక్షలు విధించారు? రాహుల్ గాంధీ సందర్శనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాంగ్రెస్ వాళ్లు బాంబులు పెట్టారని కేటీఆర్ ఆరోపించడం ఆయన మానసిక అంధత్వానికి నిదర్శనమని చామల ఫైర్ అయ్యారు. మిస్ వరల్డ్ పోటీలను చూసి కేటీఆర్ ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఒకప్పుడు కేటీఆర్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మెరిశారని, రామ్(కేటీఆర్) రెమోగా మారుతున్న వైనాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. కుటుంబ పరిస్థితి గురించి అన్నీ చెప్పిన కవిత.. అమెరికా టూర్ కు వెళ్లారన్నారు. ఇంటి సమస్యలు బయటకి వస్తాయేమోననే భయంతోనే బావ హరీశ్ రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ శాంతింపజేశారని చెప్పారు.