బనకచర్ల బంకమట్టి రుద్దుతామంటే ఊరుకోం : ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి

బనకచర్ల బంకమట్టి రుద్దుతామంటే ఊరుకోం : ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి
  • అసెంబ్లీలో చర్చకు రావాలని మాజీ సీఎంకు సవాల్​
  • జనగామలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ 

జనగామ, వెలుగు: ఏపీలోని బనకచర్ల ప్రాజెక్టు పాపం మాజీ సీఎం కేసీఆర్​దేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే దీనిపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్​చేశారు. గురువారం జనగామ జిల్లాకేంద్రంలోని సాయిరాం కన్వెన్షన్​ హాల్ లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఇందులో 816 మంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు.  కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​రెడ్డితో కలిసి ఆయన చీఫ్ గెస్ట్​గా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్..​ బనకచర్ల బంకమట్టిని తెచ్చి తమకు రుద్దుతూ తెలంగాణ సెంటిమెంట్​రగుల్చుతానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  సీఎం రేవంత్​రెడ్డి ఎన్నిసార్లు సవాల్​చేసినా కూడా కేసీఆర్​అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు.

 రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. ఇప్పటికైనా గత పదేండ్ల పాలన, ప్రజా సమస్యలపై చర్చకు రావాలని సూచించారు. కాంగ్రెస్​ప్రభుత్వ ప్రజాపాలనలో అందరి సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. దీన్ని ఓర్వలేక బీఆర్ఎస్​ నేతలు సీఎం రేవంత్​సర్కార్ పై చెడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లకు ఆగస్టు 15 లోపు వంద శాతం గ్రౌండింగ్​చేయాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు రోహిత్​సింగ్, పింకేశ్​కుమార్, ఆర్డీఓ గోపీ రామ్​, మున్సిపల్​కమిషనర్​వెంకటేశ్వర్లు, కాంగ్రెస్​ యువజన సంఘం రాష్ట్ర నేత కొమ్మూరి ప్రశాంత్​ రెడ్డి, జనగామ అగ్రికల్చర్​ మార్కెట్​కమిటీ చైర్మన్​బనుక శివరాజ్​యాదవ్, ఆర్టీఐ మెంబర్​అభిగౌడ్​తదితరులు పాల్గొన్నారు.