
- మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని ప్రశ్నించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: నాడు గంజి కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి నేడు బెంజ్ కారు ఎక్కడిదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఆ కారు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. గత పదేండ్లలో ఒక్కరోజు తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి గురించి పట్టించుకోని జగదీశ్ రెడ్డి, ఇప్పుడు జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు మతిమరుపు ఉన్నట్టు ఆయన మాటల తీరు చూస్తే తెలుస్తోందని విమర్శించారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దడం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ రేషన్ కార్డుల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని అంటున్న రాంచందర్ రావు.. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోటో పెట్టారా అని ఫైర్ అయ్యారు. ట్రిపుల్ ఆర్, మెట్రో ఫేజ్–2కు కేంద్రం నుంచి అనుమతి తీసుకొని వస్తే అప్పుడు మోదీ ఫొటో పెడుతామని చెప్పారు.