ఎన్నికల హామీని నెరవేరుస్తున్నాం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

 ఎన్నికల హామీని నెరవేరుస్తున్నాం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • చేర్యాలలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు అందజేత

చేర్యాల, వెలుగు:  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధితో అమలు చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను కలెక్టర్ కె. హైమవతి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప రెడ్డి లతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. జులై 14 నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారని తెలిపారు.  పదేళ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. నాలుగు మండలాలకు 636 ఇండ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. 

చేర్యాల రెవెన్యూ డివిజన్ విషయం సీఎం దృష్టికి తీసుకెళతా.. 

చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ నాయకులు ఎంపీకి  మెమోరాండం ఇచ్చారు. రాష్ట్రంలోని మిగతా డివిజన్ల తో  చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.  ఇందిరమ్మ ఇంటిని మొదట పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి వచ్చి సొంత ఖర్చులతో గృహ ప్రవేశం చేస్తానని హామీ ఇచ్చారు.

 కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మార్కెట్ చైర్ పర్సన్ ఎన్. శ్వేత వెంకట చారి,  కె.జీవన్ రెడ్డి, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, సిద్దిపేట ఆర్డీవో సదానందం, జడ్పీ సీఈఓ రమేశ్, మండల స్పెషల్ ఆఫీసర్ ఏడీ గ్రౌండ్ వాటర్ నాగరాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.