ఉద్యోగులకే జీతాలిస్తలేరు.. రైతులను ఎట్ల ఆదుకుంటరు?

ఉద్యోగులకే జీతాలిస్తలేరు.. రైతులను ఎట్ల ఆదుకుంటరు?

ఎంపీ ధర్మపురి అర్వింద్​

నందిపేట, వెలుగు : ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వరదలతో పంట నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ ప్రశ్నించారు. నిజామాబాద్​జిల్లా నందిపేట మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు. వెల్మల్​ గ్రామంలో 50 డబుల్​బెడ్​రూం ఇళ్ల కోసం తవ్వి వదిలేసిన గుంతలు నీటితో నిండిపోయాయని అన్నారు. గ్రామంలో బైపాస్​ రోడ్డుకు శంకుస్థాపన చేసి ఐదేళ్లయినా ఇప్పటికీ రోడ్డు పూర్తి కాలేదన్నారు. తల్వేద గ్రామంలో వరద ధాటికి కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు.  గ్రామంలో డబుల్​ బెడ్​ రూం ఇళ్లకు హామీ ఇచ్చి ఇప్పటికీ స్థల సేకరణ చేయలేదన్నారు. జిల్లాలో 30 వరకు చెక్​డ్యాంల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఫండ్స్​కేటాయించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్​ నాయకులకు కాంట్రాక్ట్​ ఇచ్చి కార్యకర్తలతో నాసిరకంగా పనులు చేయించడం వల్ల అవి తెగిపోయి పంటలకు నష్టం వాటిల్లిందన్నారు.

ఫసల్​బీమా ప్రీమియం ప్రభుత్వం కట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. అయిలాపూర్​లో ఇటీవల గ్రామీణ సడక్​ యోజన కింద నిర్మించిన రోడ్డు వరదలకు కొట్టుకుపోయిందని, క్వాలిటీతో పనులు చేయించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. నందిపేట మండలంలో 60 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. కలెక్టర్​తో మాట్లాడి నియోజకవర్గంలో ఎంత నష్టం జరిగిందో రిపోర్టు తెప్పించి కేంద్రం పరిధిలోని హైపవర్​ కమిటీకి పంపిస్తామన్నారు. ఏ సహాయం వచ్చినా కేంద్రం నుంచి రావాల్సిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు. నందిపేట పాలిటెక్నిక్​ కాలేజీ చుట్టూ నీరు చేరిందని, కట్టకింద టీఆర్ఎస్​ నాయకులు అడ్డగోలుగా నిర్మాణాలు చేయడం వల్లే చెరువు నీరు వెళ్లే దారిలేక ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంపీ వెంట పార్టీ ఆదిలాబాద్​ ఇన్​చార్జి అల్జాపూర్​శ్రీనివాస్, కిసాన్​మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్​రెడ్డి, గంగాధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్,​ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగ సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.