
పాలమూరు, వెలుగు: దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్లను స్మరించుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమవారం ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా పాలమూరు పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ జయహో నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పహెల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమాయకులు చనిపోవడం బాధాకరమన్నారు.
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టడం హర్షణీయమన్నారు. పాక్ మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే పుట్టగతులు ఉండవని ప్రభుత్వం హెచ్చరించిందని చెప్పారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పద్మజా రెడ్డి పాల్గొన్నారు.