ప్రభుత్వ ఉద్యోగం కోసం పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టిన టీచర్.. భార్య సహకారంతోనే..

ప్రభుత్వ ఉద్యోగం కోసం పుట్టిన బిడ్డను సజీవంగా పాతిపెట్టిన టీచర్.. భార్య సహకారంతోనే..

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా అడవిలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న రెండో సంతానం విధానంపై మళ్లీ చర్చను తెచ్చింది. మూడు రోజుల వయస్సు ఉన్న శిశువును సజీవంగా పాతిపెట్టిన ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంట నాల్గవ బిడ్డ పుట్టడంతో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోతాడనే భయం వల్ల ఇలా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

చింద్వారా జిల్లా ధనోరా ప్రాంతంలోని నందన్వాడి గ్రామానికి చెందిన బబ్లు దండోలియా (38), అతని భార్య రాజకుమారి (28)కి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. 11 ఏళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఆ దంపతులకు ఉన్నారు. అయితే సెప్టెంబర్ 23న రాజకుమారి మరో బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు పుట్టిన మూడో రోజు భార్యాభర్తలు శిశువును మోటార్ సైకిల్‌పై అడవికి తీసుకెళ్లి రాళ్ల కింద సజీవంగానే కెప్పెట్టారు. అయితే గ్రామస్తులకు బిడ్డ ఏడుపు వినిపించటంతో వెంటనే రక్షించి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమయానికి ఇచ్చిన చికిత్సతో ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు. 

మొదట ఈ దంపతులపై శిశువును వదలివేసినట్లు కేసు నమోదు చేశారు పోలీసులు. కానీ అనంతరం వెలువడిన వీడియోలో బిడ్డను రాళ్ల కింద సజీవంగా వదిలిపెట్టిన సన్నివేశాలు ఉండటంతో కేసును హత్యాయత్నంగా మార్చారు. మూడో బిడ్డను అధికారిక రికార్డుల్లో చూపించకుండా దాచి పెట్టగలిగామని.. అయితే నాల్గో బిడ్డ నమోదు అయితే తన ఉద్యోగానికే ప్రమాదం వస్తుందని సదరు ఉపాధ్యాయుడు భావించటంతో ఇలా చేసినట్లు ఆ దంపతులు ఒప్పుకున్నారు. 

ఈ దారుణ ఘటనపై గ్రామంలో కలకలం రేగింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఇద్దరు పిల్లల విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. NCRB తాజా డేటా ప్రకారం పిల్లలను వదలేస్తున్న కేసుల్లో మధ్యప్రదేశ్ ఇప్పటికే వరుసగా నాలుగో సంవత్సరం అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.