రేషన్ షాపుల్లో మాస్కులు.. అగ్గువ ధరకే అందుబాటులోకి

రేషన్ షాపుల్లో మాస్కులు.. అగ్గువ ధరకే అందుబాటులోకి
  • తొలివిడత 50 లక్షల మాస్కులు కొనుగోలు
  • మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం

భోపాల్: పట్టణ ప్రాంతాల్లోని మహిళలు తయారు చేస్తున్న కాటన్ క్లాత్ మాస్కులు కొనుగోలు చేయనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో 50 లక్షల మాస్క్‌లను కొనుగోలు చేసేందుకు రెడీ అయింది. రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులలో వాటిని తక్కువ ధరకే అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. కరోనా ఎఫెక్టుతో దేశవ్యాప్తంగా మాస్కులకు తీవ్ర కొరత ఏర్పడింది. చాలా మంది మహిళలు ఇంటివద్దే కాటన్ క్లాత్ మాస్కులు తయారు చేస్తున్నారు. వారి నుంచే కొనుగోలు చేయాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ణయించినట్లు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్ ) అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లోని మహిళలు తయారుచేస్తున్న కాటన్ మాస్కులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. సంబంధిత వెబ్ సైట్ లో మహిళలు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం నుంచి వెయ్యి మాస్కులకు వారు ఆర్డర్ పొందవచ్చునని తెలిపారు. దీంతో ఇంటివద్దే పనిచేస్తున్న మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పరిధిలో ఉన్న అన్ని రేషన్ షాపులలో ఈ మాస్కులను అందుబాటులో ఉంచుతామన్నారు.