తెలంగాణ సర్కార్ ఎస్టీలను మోసం చేస్తోంది 

తెలంగాణ సర్కార్ ఎస్టీలను మోసం చేస్తోంది 

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రాష్ట్ర సర్కార్ ఎనిమిదేండ్లుగా మోసం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతుందని.. వాల్మీకి బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి న్యాయం చేస్తామన్నారు. అలాగే కుర్వా సమాజానికి ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. గురువారం రాజ్యసభలో రాజ్యాంగ(షెడ్యూల్ ట్రైబ్స్) ఆర్డర్(రెండో సవరణ) బిల్లు –2022 పై చర్చలో లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. జనాభా ప్రాతిపాదికన రాజ్యాంగం కల్పించిన ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. రిజర్వేషన్లపై 2015లో దాఖలైన ఓ పిటిషన్ లో ఎస్టీలకు జనాభా ప్రాతిపాదికన 9.34 రిజర్వేన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందన్నారు. అయినప్పటికీ తెలంగాణ సర్కార్ అమలు చేయడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎస్టీ రిజర్వేషన్లపై ట్రైబల్ అడ్వైజర్ కమిటీ(టీఏసీ) చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను బీఆర్ఎస్ సర్కార్ బుట్టదాఖలు చేసిందన్నారు. అయితే, ఎస్టీలకు 10 శాతం, ముస్లింలకు 12 శాతం మత రిజర్వేషన్లు కల్పించాలని 2017 లో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. మత రిజర్వేషన్లు పూర్తిగా రాజ్యాంగం విరుద్ధమని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎస్టీల జనాభా 10 శాతం ఉంటే, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టో లో పెట్టిందన్నారు. ఈ విధంగా ఎస్టీ వర్గాన్ని పూర్తిగా మోసం చేస్తోందని విమర్శించారు. వాల్మీకి బోయ కమ్యూనిటీని కర్నాటక, ఇతర రాష్ట్రాలు ఎస్టీల కింద గుర్తిస్తున్నాయని చెప్పారు. అయితే, ఏపీలో సర్కార్ ఈ ఆలోచన చేస్తున్నదని, తెలంగాణ సర్కార్ కు మాత్రం ఈ వర్గాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. వెంటనే తెలంగాణ సర్కార్ వాల్మీకి బోయ కమ్యూనిటీ గురించి ఆలోచన చేయాలని సూచించారు. మహబూబ్ నగర్, గద్వాల్ లో ఉన్న కుర్వా కులానికి తెలంగాణ సర్కార్ ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదన్నారు. ఈ విధంగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అణచివేయబడుతున్నాయని ఆరోపించారు. మోడీ సర్కార్ కులం, మతం, వర్గం తేడా లేకుండా అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు.  

ఎన్ బీసీఎఫ్ డీసీ ద్వారా తెలంగాణకు రూ. 181.63 కోట్లు

ఐదేండ్లలో నేషనల్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ బీసీఎఫ్ డీసీ) ద్వారా తెలంగాణకు రూ.181.63 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో ఎంపీ కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో 2017–18 ఏడాదిలో రూ - 0.44 కోట్లు, 2018–19  లో రూ.-10 కోట్లు, 2019–20 లో- రూ. 100 కోట్లు, 2020–21 లో రూ.- 50కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే, 2021–22 ఫైనాన్షియల్ ఈయర్ లో 21.19 కోట్లు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు.