ఏదో ఒక రోజు సీఎం అవుతా :  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఏదో ఒక రోజు సీఎం అవుతా :  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చు .. ఏదో ఒక రోజు తాను సీఎం అవుతానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మోసపు మాటలతో ఎన్నికల్లో మళ్లీ గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడ కుట్రతో కేటీఆర్ కరెంటు కట్ చేయిస్తున్నారని ఆరోపించారు. నకిరేకల్ కాంగ్రెస్​ ఎమ్మెల్యేగా వేముల వీరేశం అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మెజార్టీ విషయంలో నల్గొండలో తనకు, నకిరేకల్ లో వీరేశంకు పోటీ ఉంటుందన్నారు. 

బీఆర్ఎస్ కు చెందిన ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి వందల కోట్లు పంచుతున్నారని ఆరోపించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లక్షల సార్లు అబద్దం చెప్పిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ మందికి కేబినెట్​ లో పెద్దపీట వేశారని చెప్పారు. బీఆర్ఎస్​ ప్రభుత్వంలో దళితులు, మహిళలు వివక్షకు గురయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోలేదన్నారు. సంతలో పశువులను కొన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు.

ఆదివారం (అక్టోబర్ 8న) ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టోతో భయపడి గ్యాస్, యూరియా ఫ్రీ అంటారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భార్యాభర్తలు ఇద్దరికీ నాలుగు వెల పెన్షన్ ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను దేనికైనా సిద్దమే అన్నారు. ఎన్నికల వరకే దళితబంధు ఇస్తారని చెప్పారు. సిరిసిల్ల, గద్వేల్, సిద్ధిపేట తప్ప మిగతా 116 నియోజకవర్గాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 

కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు రూ. 600 కోట్లతో రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డి సంగతి పటేల్ రమేష్ రెడ్డి, వడ్డే జానయ్య చూసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టు పూర్తైందన్నారు. తానే నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఆ పేరు పెట్టానని అన్నారు. దమ్ముంటే వేముల వీరేశంను నకిరేకల్ లో ఓడించు... అంటూ మంత్రి కేటీఆర్ కు ఛాలెంజ్ విసిరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సత్తా ఏంటో బీఆర్ఎస్ పార్టీకి చూపిస్తామన్నారు.