రాష్ట్రంలో 75 నుంచి 80 సీట్లు గెలుస్తం : కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

రాష్ట్రంలో 75 నుంచి 80 సీట్లు గెలుస్తం : కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి
  • రాష్ట్రంలో 75 నుంచి 80 సీట్లు గెలుస్తం 
  • దసరా లోపు అభ్యర్థులను ప్రకటిస్తం: కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి
  • సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​కే సీఎంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నరని కామెంట్

నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ట్రంలో జరగబోయే ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ 75 నుంచి 80 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. దసరాలోపు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. స్క్రీనింగ్ కమిటీ 90% మంది అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసిందని, ఇంకో 10 శాతం మం ది అభ్యర్థులను తొందరలోనే కన్ఫామ్ చేస్తామని చె ప్పారు. మొత్తం లిస్ట్ ఒకేసారి విడుదల చేయడం కుదరకపోతే ఈనెల 16వ తేదీలోపే 70 మందితో మొదటి లిస్ట్ ఉంటుందన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీలో వాకర్స్, ప్లేయర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఆపై ఓ టీ స్టాల్ లో చాయ్ చేసి కార్యకర్తలకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించట్లేదని, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​కు మాత్రమే సీఎం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మంది ఇండ్లను కూల్చి రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి జరిగిందనుడు హాస్యాస్పదమే అవుతుందన్నారు.  

లెఫ్ట్​ పార్టీలకు ఒక్కో సీటు.. 

వేల ఎకరాలకు సాగునీటిని అందించే బ్రాహ్మణ వెల్లం ల ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంకట్​రెడ్డి మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో భావబామ్మర్దుల ఆటలు సాగవన్నారు. ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాకి అండగా నిలిచి కాంగ్రెస్ ని గెలిపించి నాలుగున్నర కోట్ల మంది ప్రజలు గెలవాలని కోరారు. కమ్యూనిస్టులతో చర్చలు జరుగుతున్నాయని, ఒక్కో పార్టీకి ఒక్కో సీటు లేదంటే రెండు ఎమ్మెల్సీలు ఇస్తామ న్నారు.

కమ్యూనిస్టులతో పొత్తు ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా గెలిచే సత్తా ఉందన్నారు. అన్ని సర్వేల్లో కాంగ్రెస్​కి 65- నుంచి 75 సీట్లు వస్తున్నాయన్నారు. వంగూరు లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, జూలకంటి సైదిరెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ప్రచార టైమ్​లో.. నల్గొండ మండలం కోదండపురానికి చెందిన లక్ష్మీప్రసన్న వెటర్నరీలో  సీటు సాధించగా కాలేజీ ఫీజులు అప్పు తెచ్చి కట్టినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు వెంకటరెడ్డికి దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన రూ.20 వేల సాయాన్ని అందజేశారు. ఎన్జీ కాలేజీ గ్రౌండ్​లో ఉన్న క్రీడాకారిని పుట్టినరోజు సందర్భంగా రూ.5వేల సాయం అందించారు.