246 జీవో నల్గొండ నాశనానికే..

246 జీవో నల్గొండ నాశనానికే..

నల్గొండ, వెలుగు : పాలమూరు, -రంగారెడ్డి, నల్గొండ జిల్లాల మధ్య సాగునీటి పంపకాల్లో కొత్త చిచ్చు పెట్టేందుకే ప్రభుత్వం 18న జీవో నెం.246 జారీ చేసిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. దీనిపై కేసీఆర్ 4 రోజుల్లోగా స్పందించకపోతే నల్గొండ జిల్లా కేంద్రంలో దీక్ష చేస్తానని, లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అందుకు జిల్లా రైతులు, రైతు సంఘాలు, రిటైర్డ్​ ఇంజనీర్లతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఆదివారం ఆయన నల్గొండలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ ప్రాజెక్టు పనులు గాలికి వదిలేశారని, దీనికి అనుసంధానంగా నిర్మిస్తున్న బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పనులు కూడా అతీగతీ లేకుండా పోయాయన్నారు.

తెలంగాణ వచ్చాక చేపట్టిన డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​కు నీళ్లియ్యలేదు కానీ, ఇప్పుడు కొత్తగా జీవో 246 తెచ్చి కృష్ణా జలాల్లో ఎస్​ఎల్​బీసీకి కేటాయించిన 45 టీఎంసీల నీటిని రద్దు చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. దీంతో జిల్లాకు కృష్ణా జలాల నీటి కేటాయింపులో అన్యాయం జరుగుతోందని, ఎస్ఎల్బీసీ, డిండి, బీవెల్లంల ప్రాజెక్టుల పనులు ఆగిపోయి, ఫ్లోరైడ్​ ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు, నల్గొండ, నకిరేకల్​ నియోజకవర్గాలు సాగు, తాగునీరు లేక సర్వనాశం అవుతాయని వెంకటరెడ్డి పేర్కొ న్నారు.

కృష్ణా జలాల్లో నల్గొండకు వాటా ఇవ్వాల్సిందే
వైఎస్సార్  హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్​ నివారణకు  రూ.600 కోట్లు, జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మరో రూ.500 కోట్లు సాంక్షన్​ చేయించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తుచేశారు. జిల్లాలో 60, 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులను కంప్లీట్​ చేయకుండా సీఎం ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం పూర్తి చేసుకున్నారన్నారు. అదే ఎస్​ఎల్​బీసీకి సంబంధించిన డీపీఆర్​ రిపోర్ట్​ ఇప్పటి వరకు కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 1978లో జరిగిన ఒప్పందాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు.